‘సర్పంచ్ సమర్థుడైతే ప్రతి ఊరూ బాగు పడుతుంది. పంచాయతీ ఎన్నికల్లో సమర్థులను ఎన్నుకోవడం ద్వారా ఊరి బాగుకు బాటలు వేసుకోవచ్చు.
స్థానిక స్వపరిపాలన ద్వారా అనేక సమస్యలు పరిష్కారమవుతాయి. దీనికి పంచాయతీ ఎన్నికలే కీలకం. ఉదాసీనంగా ఉంటే మీ ఊరిని మీరు పాడు చేసుకున్నట్లే’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.
తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల టీడీపీ నేతలతో శుక్రవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ దాడులు, దౌర్జన్యాలపై ఫోటోలు, వీడియో సాక్ష్యాధారాలను 7557557744 వాట్సాప్ నంబరుకు పంపాలని, కాల్ సెంటర్ నంబరు 7306299999కు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు.
కాగా, కడప జిల్లా ప్రొద్దుటూరులో కడప లోక్‌సభ నియోజకవర్గం పార్టీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి అరెస్టుపై చంద్రబాబు మండిపడ్డారు. ‘‘లింగారెడ్డి సహా వివిధ పార్టీల నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని విడుదల చేయాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.
కాగా, స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయానికి టీడీపీ అంతర్గత ఎన్నికల కమిటీలను నియమించింది. ప్రాంతీయ సమన్వయానికి జోన్ కమిటీలను, పార్టీ కేంద్ర కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది.