సరైనవో కావో.. తేల్చేందుకే విచారణ

0
215
Spread the love

స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత తనపై ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) పేర్కొంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు సరైనవో కావో తేల్చేందుకే ఫిర్యాదులపై విచారణ జరపాలని కలెక్టర్లను ఆదేశించామని స్పష్టం చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సమయంలో బెదిరింపులు, దౌర్జన్యాల కారణంగా నామినేషన్‌ వేయలేనివారు, వేధింపులు కారణంగా నామినేషన్‌ ఉపసంహరించుకున్న వారు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశిస్తూ ఎస్‌ఈసీ గత నెల ఫిబ్రవరి 18న ఉత్తర్వులివ్వడం, వీటిని సవాల్‌ చేస్తూ చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన రత్నశేఖరరెడ్డి తదితరులు వ్యాజ్యాలు దాఖలు చేయడం.. ఏకగ్రీవాలు ప్రకటించి ఫామ్‌-10 జారీ చేసిన చోట ఎలాంటి విచారణ జరపవద్దని, ఫామ్‌-10 జారీ చేయని చోట ఏవైనా చర్యలు తీసుకుని ఉంటే వాటిని ప్రకటించవద్దంటూ హైకోర్టు గత నెల 19న మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే.

ఈ వ్యవహారంలో ఎస్‌ఈసీ దాఖలుచేసిన కౌంటర్‌ అఫిడవిట్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు సోమవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి, న్యాయవాదులు ప్రశాంత్‌, జి.సుధాకర్‌ తదితరులు వాదనలు వినిపించారు. ‘ఫామ్‌-10 జారీ చేశాక విచారణకు ఆదేశించే అధికారం ఎస్‌ఈసీకి లేదు. నామినేషన్‌ ఒకటే మిగిలినప్పుడు.. ఆలస్యం లేకుండా ఏకగ్రీవమైనట్లు ప్రకటించాలి. చట్టంలో స్పష్టత లేని విషయాల్లో మాత్రమే ఎస్‌ఈసీ తన అధికారాన్ని వినియోగించాలి.

ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకుంటే ఎన్నికల పిటిషన్‌ ద్వారా ఎన్నికల ట్రైబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు. నామినేషన్ల అడ్డగింతలు, బలవంతపు ఉపసంహరణలపై పరిశీలకుల నుంచి ఎస్‌ఈసీ ఎలాంటి నివేదికలు తెప్పించుకోలేదు. కొన్ని ఫిర్యాదుల ఆధారంగా విచారణకు ఆదేశించడం, నామినేషన్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించే చట్టబద్ధ అధికారం దానికి లేదు. దాని ఉత్తర్వులను రద్దు చేయండి’ అని కోరారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపిస్తూ… బలవంతపు ఉపసంహరణలు జరగాయా లేదా అనే విషయం ఎన్నికల ట్రైబ్యునల్‌ తేలుస్తుందన్నారు. మీడియా కథనాల ద్వారా విచారణకు ఆదేశించడం సరికాదని.. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించే అధికారం ఎస్‌ఈసీకి లేదని తెలిపారు.

వారి న్యాయబద్ధమైన హక్కును ప్రశ్నించం..

ఎస్‌ఈసీ తరఫున న్యాయవాది అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ‘ఫామ్‌-10 పొందినవారి న్యాయబద్ధ హక్కును మేం ప్రశ్నించడం లేదు. ఏకగ్రీవాలు సజావుగా జరిగాయో లేదో తెలుసుకోవడారికే విచారణ చేయిస్తున్నాం. నామినేషన్ల అడ్డగింత, బలవంతపు ఉపసంహరణలపై ఫిర్యాదులు అందడంతో.. రాజ్యాంగంలోని అధికరణ 243(కె)ను అనుసరించి విచారణకు ఆదేశించాం. విచారణ ప్రారంభ దశలో పిటిషనర్లు కోర్టును ఆశ్రయించడం సరికాదు.

ఫిర్యాదులపై స్పందించాల్సిన బాధ్యత మాపై ఉంది. స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు పరిస్థితులకు తగినట్లు నిర్ణయం తీసుకునే అధికారం మాకుంది. విచారణ ముగిసి నివేదికలు అందితే అధికారులు ఎన్నికల నిర్వహణలో విఫలమయ్యారో లేదో తెలుస్తుంది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని వ్యాజ్యాలు కొట్టివేయండి’ అని కోరారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని మరికొంత మంది న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరారు. ఆ ఉత్తర్వులతో విచారణ నిలిచిపోయిందని.. ఏకగ్రీవాల కోసం నామినేషన్ల సందర్భంగా అధికార పార్టీ నాయకులు అడ్డంకులు సృష్టించారని పేర్కొన్నారు. అన్ని పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును వాయిదా వేశారు.

జనసేన పిటిషన్‌పై విచారణ 15కి వాయిదా

పరిషత్‌ ఎన్నికల ప్రక్రియను తాజాగా ప్రారంభించాలని కోరుతూ జనసేన పార్టీ వేసిన పిటిషన్‌ పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. సోమవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా.. కరోనా కారణంగా నిలిచిపోయిన ఎన్నికలను.. తిరిగి అక్కడ నుంచే ప్రారంభిస్తామని ఎస్‌ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించిందని.. అందుకు విరుద్ధంగా ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయమూర్తి తెలిపారు. వ్యాజ్యంపై పూర్తిస్థాయిలో వాదనల కోసం విచారణను 15వ తేదీకి వాయిదా వేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here