విశాఖ ఉక్కు ఉత్తరాంధ్ర జీవనాడి అని, తెలుగు ప్రజల ఐక్యతకు చిహ్నమైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విశాఖ ఉక్కు పరిశ్రమను ఆర్థికంగా బలోపేతం చేసి, ప్రైవేటీకరణ ప్రక్రియను తక్షణం నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ప్రధాని మోదీకి లేఖ ఆయన రాశారు. ‘విశాఖ స్టీల్‌ప్లాంట్‌గా పిలిచే రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్)ను ప్రైవేటీకరించాలని భాతర ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌లో ప్రతిపాదించింది. 2021 జనవరి 27న ఆర్‌ఐఎన్‌ఎల్‌ను ప్రైవేటీకరించే ప్రతిపాదనకు ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపినట్లు ఇన్వె్‌స్టమెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ విభాగం కార్యదర్శి ప్రకటించారు. 1966 నుంచి తెలుగు ప్రజలు చేసిన మహోద్యమం ఫలితంగా విశాఖ ఉక్కు కర్మాగారం వచ్చింది. ఉక్కు కర్మాగారం కోసం ఉద్యమానికి దళిత నేత అమృతరావు నిరవధిక నిరాహార దీక్ష చేశారు. ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన 12 మంది రక్తంతో స్టీల్‌ప్లాంట్ పునాదులు తడపబడ్డాయి. మరో 20 మంది కూడా చనిపోయారు.

ఇలా ఎందరో తెలుగు ప్రజల ఐక్యతకు చిహ్నంగా నిలిచిన విశాఖ ఉక్కు కోసం 68 గ్రామాల ప్రజలు 26,500 ఎకరాల భూమిని త్యాగం చేశారు’ అని చంద్రబాబు ఈ లేఖలో గుర్తు చేశారు. ‘భూమిని కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం అని వాగ్దానం చేశారు. కానీ 8 వేల మందికే ఉద్యోగాలు వచ్చాయి. విశాఖ నగరం, స్టీల్ ప్లాంట్ అభివృద్ధి ఒకదానికొకటి ముడిపడి ఉంది. 1991-2000 మధ్య రూ.4వేల కోట్ల నష్టాల్లో ఉన్న స్టీల్‌ప్లాంట్‌ను అప్పటి రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు రూ.1,333 కోట్ల ప్యాకేజీతో ప్లాంట్ లాభపడేలా వాజ్‌పేయి ఆధ్వర్యంలోని కేంద్రప్రభుత్వం బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకనస్ట్రక్షన్ (బీఐఎ్‌ఫఆర్)కు సూచించింది. ఉక్కు తయారీలో అతిపెద్దదైన విశాఖకు సొంత గనులు లేకపోవడం, రుణాలపై అధిక వడ్డీ రేట్లు కారణంగా నష్టాలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తమ అధీనంలోని గనులను ఆర్‌ఐఎన్‌ఎల్‌కు కేటాయిస్తే లాభాల బాట పడుతుంది. స్టీల్ ప్లాంట్ భూమి రూ.2లక్షల కోట్ల దాకా ఉంటుంది. ఇంత ఘనమైన సంస్థ ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేసి, స్టీల్ ప్లాంట్ లాభదాయకంగా మారేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రజల తరుపున కోరుతున్నాం’ అని చంద్రబాబు లేఖలో కోరారు.
ఢిల్లీలో సభ పెట్టే దమ్ముందా?: టీడీపీ
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో బహిరంగ సభ పెట్టే దమ్ము వైసీపీకి ఉందా అని, నీతి అయోగ్ సమావేశంలో విశాఖ ఉక్కు గురించి ప్రధాని మోదీతో సీఎం జగన్ ఎందుకు ప్రస్తావించలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టి, ఇప్పుడు పాదయాత్ర అంటూ హడావుడి చేయడానికి వైసీపీ నేతలు సిగ్గుపడాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు. ఆంధ్రాబ్యాంక్‌ను యూనియన్ బ్యాంక్‌లో కలిపినప్పుడు నోరెత్తని బీజేపీ, వైసీపీనేతలు విశాఖ ఉక్కునీ లేకుండా చేస్తారా? అని మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ట్విటర్‌లో నిలదీశారు.
రెండు రోజుల్లో 20 వేలమంది మద్దతు
ఉక్కుపై టీడీపీ మిస్డ్‌కాల్ ఉద్యమానికి విశేష స్పందన
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ ప్రారంభించిన మిస్డ్ కాల్ కార్యక్రమానికి మద్దతు వెల్లవెత్తుతోంది. రెండురోజుల్లోనే 20వేల మంది మిస్డ్ కాల్ ఇచ్చి తమ మద్దతు తెలిపారు. 8099981981 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి విశాఖ ఉక్కు ఉద్యమానికి సంఘీభావం తెలిపే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రెండురోజుల క్రితం ప్రారంభించింది.