హోదా ఏదీ జగన్‌!?

0
189
Spread the love

ఉద్యోగాలు కావాలంటే ప్రత్యేక హోదా రావాలని ఆ రోజు ఊరూవాడా చెప్పిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక ఏం చేశారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రశ్నించారు. ‘నేను హోదా తేలేదని తప్పు పట్టిన జగన్‌… ఇప్పుడు దాని కోసం ఏ ప్రయత్నం చేస్తున్నారు?’ అని నిలదీశారు. ‘‘ప్రత్యేక హోదా లేదు. అమరావతి లేదు. పోలవరం పూర్తి చేయలేదు. అసలు అభివృద్ధి అన్న పదమే జగన్‌ డిక్షనరీలో లేదు’’ అని దుయ్యబట్టారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం గురువారం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం చేరుకున్నారు. గుడుపల్లె, కుప్పం మండలాల్లో రోడ్‌ షో నిర్వహించారు. టీడీపీ శ్రేణుల సమావేశాల్లో ప్రసంగించారు. ‘‘ఎర్రచందనం, ఇసుక, లిక్కర్‌.. ఇలా దొరికిన ప్రతిదానిపై పడుతున్నారు. అవి చాలవని పందేలు, పేకాటలు పెట్టి కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. జే-బ్రాండ్‌ అమ్మకాలతో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటలాడుతున్నారు. లిక్కర్‌ మాఫియాలో వేల కోట్ల అవినీతి జరుగుతోంది. కర్ణాటక మద్యాన్ని తీసుకొచ్చి ఎన్నికలు చేసుకోవాల్సిన దుస్థితి వైసీపీకి వచ్చింది’’ అని చంద్రబాబు విరుచుకుపడ్డారు.

‘సంక్షేమం’ ఎవరి సొత్తు?

‘రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు మనం కట్టే పన్నులతో కాకుండా వైసీపీ సొత్తుతో ఇస్తున్నారా’ అని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయకపోతే రేషన్‌ కార్డు కట్‌ చేస్తాం.. అమ్మఒడి తీసేస్తాం.. పింఛను పీకేస్తామంటూ ప్రజలను అధికార పార్టీ నేతలు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ‘‘పులివెందులలో టీడీపీ గెలవకపోయినా అక్కడ నీళ్లిచ్చాం. కుప్పానికి మాత్రం నీళ్లు ఎందుకివ్వరు. అణగదొక్కితే పడి ఉండం. మా తడాఖా ఏంటో చూపిస్తాం. కక్షపూరిత రాజకీయాలు నాకు తెలిసి ఉంటే పుంగనూరు నేత అక్కడ ఉండేవాడు కాదు. మావాళ్లను అడుగడుగునా వేధిస్తుంటే ఎంతకాలం చూడాలి? నేను కూడా మనిషినే. మీరు పడే కష్టాలను చూస్తున్నా. నేను రాసుకుంటున్నా, మీరూ రాసుకోండి.. అన్నీ చక్రవడ్డీతో తీర్చేస్తా. పుంగనూరులో ఒక మహా మేతగాడు ఉన్నాడు. దేశం మొత్తం మేసేస్తున్నాడు’’ అని దుయ్యబట్టారు.

తప్పుడు కేసులు పెట్టిన పోలీసులకు శిక్ష..

కుప్పంలో ఎప్పుడూ అధైర్యపడిన సందర్భాలు లేవని చంద్రబాబు తెలిపారు. ఎవరికి అన్యాయం జరిగినా ఎంత డబ్బులైనా ఖర్చుపెట్టి కార్యకర్తలను కాపాడుకుంటానని ప్రకటించారు. ‘‘మన కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టినా అధికారంలోకి రాగానే ఒక్క సంతకంతో అన్నీ కొట్టేస్తా. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై కూడా సమీక్షించి వాళ్లకు శిక్షపడేలా చేస్తా. క్షేత్రస్థాయిలో సమర్థ నాయకత్వాన్ని ఎంపిక చేసుకుని ముందుకుపోదాం. పోరాడే వీరులకే నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తాం’’ అని ప్రకటించారు. కుప్పంలో మొదటి నుంచీ నీతి, నిజాయితీగా పనిచేశామని తెలిపారు. అధికారంలోకి వచ్చాక కుప్పంలో ఎక్కువ సమయం గడపలేకపోయానని… అందుకు కారణం విభజిత ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి వైపు నడిపించడంపై దృష్టి పెట్టడమేనని చంద్రబాబు తెలిపారు. ‘‘ఆ సమయంలో ఇప్పటి నాయకుడు అధికారంలోకి వచ్చి ఉంటే చేతులెత్తేసి ఇంటికి వెళ్లిపోయేవాడు’’ అని జగన్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. శాంతికి మారుపేరైన కుప్పం పంచాయతీ ఎన్నికల్లో తాను ఎన్నడూ జోక్యం చేసుకోలేదన్నారు. ‘‘అదే అదనుగా వైసీపీ అధికార యంత్రాంగాన్ని వాడుకుని సంక్షేమ పథకాలు తీసేస్తామని, వ్యాపారాలపై దాడులు చేస్తామంటూ బెదిరించి ఎన్నికలు జరిపారు. అయినా టీడీపీ కార్యకర్తలు వీరోచితంగా పోరాడారు. కొన్ని నియోజకవర్గాల్లో నామినేషన్లు కూడా వేయనివ్వలేదు. బెదిరించి ఎన్నికల్లో గెలవడం, లేదా నోట్లు పంచి ఓట్లు వేసుకోవడం వైసీపీకి అలవాటుగా మారిపోయింది. కుప్పానికి కొత్తగా కొందరు చోటామోటా నాయకులు వచ్చి రాజకీయాలు చేస్తున్నారు. ఎన్ని చేసినా వారికి కుప్పం ప్రజలు తగిన బుద్ధి చెబుతారు’’ అని చంద్రబాబు తెలిపారు. జమిలి ఎన్నికలు వస్తే వైసీపీ ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించడం మన బాధ్యత అన్నారు. నాయకులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.

ఈ ఓటమి అర్థం కావడం లేదు

కుప్పం నియోజకవర్గంలో రూ.50 కోట్లు ఖర్చు పెట్టి పంచాయతీ ఎన్నికలు నిర్వహించారంటే వారి పరిస్థితి అర్థం చేసుకోవచ్చునని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘‘రూ.5 వేలు ఓటుకు ఇచ్చారంటే ఎవడబ్బ సొత్తు అది? నేను దారిపొడవునా గమనించా. కార్యకర్తల దండు ఎక్కడా కట్టుకదల్లేదు. అయినా ఎందుకీ ఓటమి సంభవించిందో అర్థం కావడం లేదు. నేను అప్పట్లో సంపాదనకే ప్రాముఖ్యమిచ్చి ఉంటే ఇటువంటి రాజకీయాలు ఎన్ని చేసి వుండేవాడిని. అయినా అటువంటి అపప్రఽథ మాకు అక్కర్లేదు. త్వరలో జరగనున్న మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికలను మనం గెలవాలి. మళ్లీ తొందరలోనే వస్తా. ఇక తరచూ వస్తుంటా’’ అని ప్రకటించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చంద్రబాబు పేర్కొన్నారు. అది ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. కేంద్రంతో జగన్‌కున్న వ్యవహారాల కారణంగా గట్టిగా పోరాడలేకపోతున్నారని… అందువల్ల, ఆంధ్రులందరూ ఏకమై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here