పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైసీపీ మద్దతుదారులు 80శాతానికిపైగా సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తిరుపతిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘కుప్పం ఓటమితో 40ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు క్లీన్ బౌల్డయ్యాడు. ఈ ఫలితాలపై చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి. నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తాడా లేక కుట్రలే పన్నుతూ రాజకీయాల్లోనే కొనసాగుతాడా? అనేది తేల్చుకోవాలి’ అన్నారు. కుప్పం మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకుంటామని చెప్పారు. ఎస్‌ఈసీ గురించి తానేమీ మాట్లాడబోనని, చంద్రబాబు కొన్ని వ్యవస్థలను చేతిలో పెట్టుకుని తమను టార్గెట్ చేశారన్నారు. ఇకనైనా ఆయన బుద్ధి తెచ్చుకోవాలన్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ త్వరలో చంద్రబాబుకు పిచ్చి పట్టడం ఖాయమని, అందుకే ఆయన నిమ్మగడ్డపై మండిపడుతున్నారని చెప్పారు. నిమ్మగడ్డలో మార్పు కనిపిస్తోందని, చంద్రబాబు కుట్రలకు ఆయన బలయ్యారని అన్నారు. జగన్ ప్రధాని కావాలని నారాయణస్వామి ఆకాంక్షించారు.

ఆడలేక మద్దెల ఓటన్నట్లుంది: బొత్స
ఆడలేక మద్దెల ఓటన్న రీతిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తాడేపల్లిలో విలేకరులతో అన్నారు. కుప్పంలో టీడీపీ కాదు.. ప్రజాస్వామ్యం ఓడిపోయిందంటూ వ్యాఖ్యానించడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. కుప్పంలో రిగ్గింగ్ ఎక్కడ జరిగిందో బాబే చెప్పాలన్నారు. కౌంటింగ్‌లో అక్రమాలు జరిగితే రీకౌటింగ్‌ను ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. సొంత నియోజకవర్గంలోనే తన వారిని గెలిపించుకోలేని చంద్రబాబు.. రాజకీయాలకు గుడ్‌బై చెప్పడం మంచిదని ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా వ్యాఖ్యానించారు.
కీర్తించిన నోటితోనే నిమ్మగడ్డపై విమర్శలా?: సజ్జల
ఈ శతాబ్దపు వీరుడిగా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను కీర్తించిన నోటితోనే.. ఇప్పుడు ఎలా విమర్శలు చేస్తున్నారని చంద్రబాబును సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. తాము ఎస్‌ఈసీ నిర్ణయాలలో తప్పులపై విమర్శలు చేశామే తప్ప వ్యక్తిగతంగా దూషించలేదన్నారు.