9 లక్షలు దాటిన కరోనా కేసులు

0
263
Spread the love

రాష్ట్రంలో కరోనా విజృంభణ వేగం పుంజుకుంది. మార్చి నెల మొదటి వారం వరకూ.. 100-150లోపు నమోదైన కేసులు ఇప్పుడు వెయ్యిని తాకుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో మొత్తం కేసులు కూడా 9 లక్షల మార్కుని దాటేశాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 30,851 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 993 మందికి పాజిటివ్‌గా తేలినట్టు వైద్యఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,00,805కి పెరిగింది. ఏపీలో గతేడాది మార్చి 13న తొలి కరోనా కేసు నమోదైంది. ఏడాది తిరిగొచ్చేలోగా ఆ సంఖ్య 9 లక్షలు దాటింది. దీంతో దేశంలో 9 లక్షలకుపైగా కేసులు నమోదైన నాలుగో రాష్ట్రంగా ఏపీ రికార్డు నెలకొల్పింది.

మహారాష్ట్ర (27,45,518), కేరళ (11,19,543), కర్ణాటక (9,89,804) ఏపీకన్నా ముందున్నాయి. గతేడాది అక్టోబరు చివరి వరకూ రాష్ట్రంలో కరోనా భీభత్సం సృష్టించింది. ఒకానొక దశలో రోజుకు పది వేల కేసులు కూడా నమోదయ్యాయి. రోజూ వందల్లో మరణాలు సంభవించేవి. నవంబరు తర్వాత కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయి. జనవరి, ఫిబ్రవరిలో ఇక కరోనా లేనట్టేనని అంతా భావించారు. కానీ మార్చి 15 తర్వాత నుంచి సెకండ్‌ వేవ్‌ మొదలైంది. వంద నుంచి రెండు వందలు, మూడు వందలు ఇలా పెరుగుతూ వచ్చిన కేసులు ప్రస్తుతం వెయ్యి మార్కుని టచ్‌ చేస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో అత్యధికంగా 198 మంది వైరస్‌ బారినపడ్డారు. చిత్తూరులో 179, కృష్ణాలో 176, విశాఖపట్నంలో 169 కేసులు వెలుగుచూశాయి. ఈ నాలుగు జిల్లాలో రోజూ వందపైనే కేసులు నమోదవుతున్నాయి. ఒకరోజు వ్యవధిలో 480 మంది దిశ్చార్జ్‌ కావడంతో రికవరీల సంఖ్య 8,86,978కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,614 యాక్టివ్‌ కేసులున్నాయి. గుంటూరు, కృష్ణా, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో చనిపోయారు. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా మరణాలు 7,213కి చేరాయి.

మాజీ మంత్రి జవహర్‌కు కరోనా

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత కేఎస్‌ జవహర్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని మంగళవారం ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఆయన తూర్పుగోదావరి జల్లా కొవ్వూరులోని తన నివాసంలో క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here