ఆదివారమూ రిజిస్ట్రేషన్లు!

0
312
Spread the love

ఈ నెలాఖరు నాటికి నిర్దేశించిన రాబడి లక్ష్యాన్ని సాధించేందుకు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు ఆదివారాలు, రెండో శనివారాల్లోనూ పని చేయనున్నాయి. ఈ నెల రోజుల్లో పండుగలు మినహా మిగతా రోజుల్లో కార్యాలయాలు తెరిచి ఉంటాయని ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ వి.శేషాద్రి వేర్వేరుగా ప్రకటించారు.

ఈ నెలలోని 7, 14, 21, 28 తేదీల్లోని ఆదివారాలు, 13న రెండో శనివారం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను తెరిచి ఉంచాలని వారు ఆదేశించారు. ఈ నెల 11(గురువారం)న మహాశివరాత్రి, 29(సోమవారం) హోలి సందర్భంగా సెలవులుంటాయని, మిగతా ఆదివారాలు, రెండో శనివారం కార్యాలయాలు పని చేయాలంటూ సూచించారు. కాగా, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రాబడి లక్ష్యం రూ.10 వేల కోట్లు.

ఈ నెలలో ఇప్పటికే నాలుగు రోజులు గడిచిపోయాయి. వచ్చింది మాత్రం 40 శాతం ఆదాయమే. కనీసం ఈ 26 రోజుల్లోనైనా కొంత మేర ఆదాయాన్ని రాబట్టుకోవడానికి ప్రభుత్వం తంటాలు పడుతోంది. ఆ నేపథ్యంలోనే పై విధంగా నిర్ణయం తీసుకుంది. కాగా, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ఉద్యోగ సంఘం నాయకులు గురువారం సీఎ్‌సను కలిశారు. అన్ని స్థాయిల్లోని పదోన్నతులను తక్కువ సమయంలో పూర్తి చేసినందుకు వారు సీఎం కేసీఆర్‌, సీఎ్‌సకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్యుమెంట్లను క్లియర్‌ చేయడానికి సబ్‌-రిజిస్ట్రార్లు, అధికారులు 2 నెలలుగా మెరుగైన సేవలందిస్తున్నారంటూ సీఎస్‌ అభినందించారు.

నిరాశపర్చిన రాబడి

నిజానికి రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఈసారి ఆశించిన రాబడి రాలేదు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.10 వేల కోట్ల రాబడిని ప్రభుత్వం అంచనా వేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి ఆటంకాల్లేకుండా రిజిస్ట్రేషన్లు సాఫీగా సాగాయి. రూ.6147 కోట్లను అంచనా వేస్తే.. ఏకంగా రూ.6671 కోట్ల రాబడి వచ్చింది. అలా ఊపుమీదున్న రిజిస్ట్రేషన్లతో ఉత్సాహం పొందిన ప్రభుత్వం.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 33 శాతం పెంచి రూ.10 వేల కోట్ల రాబడిని అంచనా కట్టింది.

కానీ, ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్లు అనేక ఆటుపోట్లకు గురయ్యాయి. రిజిస్ట్రేషన్ల కోసం ‘ధరణి’ పోర్టల్‌ను తెరపైకి తెచ్చింది. ఆ నేపథ్యంలో సెప్టెంబర్‌ 8 నుంచి మూడు నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో దాదాపు రూ.2500 కోట్ల రాబడి రాకుండా పోయింది. కరోనా కారణంగా మరో రూ.1200 కోట్ల వరకు రాబడి కోల్పోయింది.

వచ్చిన రాబడి 40 శాతమే

గురువారం(4న) నాటికి రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.4069.56 కోట్ల రాబడి సమకూరింది. ఇది లక్షిత రూ.10 వేల కోట్లలో 40 శాతమే. ఈ నెలాఖరుకు కొంతలో కొంతైనా రాబడిని సాధించే చర్యలు చేపట్టింది. ఆదివారాలు, రెండో శనివారం సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాలు పని చేసేలా ఆదేశాలిచ్చారు. ఏమైనా ఈ 26 రోజుల్లో మరో రూ.800-900 కోట్ల వరకు రాబడి రావొచ్చని అంచనా వేస్తున్నారు. 50 శాతం టార్గెట్‌ రీచ్‌ అయినా గొప్పేనంటూ రిజిస్ట్రేషన్‌ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here