‘‘శ్వాసకోశ సమస్యతో ఓ గర్భిణి ఆస్పత్రిలో చేరింది. ఆమెకు కరోనా పరీక్ష చేయగా, పాజిటివ్ వచ్చింది. గర్భిణి పరిస్థితి ఆందోళగా మారడంతో మూడు రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉంచాం. ఆ సమయంలోనే సిజేరియన్ చేసి పురుడు చేశాం. ఆ తర్వాత తల్లీ బిడ్డ క్షేమంగా బయట పడ్డారు. 115 కిలోల బరువున్న మరో గర్భిణి కరోనాతో ఆస్పత్రికి వచ్చింది. ఆమెకు ఇతర జబ్బులు కూడా ఉన్నాయి. మధుమేహం, శ్వాసకోస సమస్యలు ఎదుర్కొంటోంది. వాటిని నియంత్రిస్తూ ఆమెకు సుఖ ప్రసవం చేశాం. నా 32 ఏళ్ల సర్వీసు ఒక ఎత్తయితే, కరోనా సర్వీస్ మాత్రం మరో ఎత్తుగా మిగిలిపోయింది’’ ఇదీ గాంధీ ఆస్పత్రి గైనకాలజీ విభాగం అధిపతి డాక్టర్ మహాలక్ష్మి అనుభవం.
‘‘ఓ పోలీసు కానిస్టేబుల్ కరోనాతో అడ్మిట్ అయ్యారు. ఆయన ఫోన్‌లో చార్జింగ్ అయిపోయింది. వార్డులో ఉండే ఇతర రోగులను ఫోన్ అడిగితే ఎవరూ ఇవ్వలేదు. ఇంట్లో వారితో మాట్లాడలేక ఇబ్బందిపడి ఆయన మానసికంగా కుంగిపోయారు. ఆయనను బుజ్జగించి, నచ్చజెప్పి మా ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడించాం. నెమ్మదిగా మాకు సహకరించడం మెదలు పెట్టారు’’ సైకియాట్రిస్ట్ డాక్టర్ అజయ్ చెప్పిన మాటలివి.

అంతు చిక్కని అంటురోగం.. కొమ్ములు తిరిగిన కొత్త దెయ్యం.. ముట్టుకుంటే చాలు ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తోంది.. గట్టిగా తుమ్మితే పక్కనున్న వారిలోనూ ప్రవేశిస్తోంది.. రోజుల వ్యవధిలోనే దేశాలకు విస్తరించింది. ఖండాంతరాలు దాటి ప్రపంచాన్ని కమ్మేసింది.. ఆ జబ్బు గురించి వింటేనే హడల్.. వైరస్ సోకిందంటే మనిషికి మీటర్ల దూరంలో ఉండే పరిస్థితి.. రోగిని కనీసం దూరం నుంచి చూడాలన్నా వణుకే.. వ్యాధి వచ్చిన వ్యక్తిని కుటుంబసభ్యులే దగ్గరకు రానీయని దయనీయ స్థితి..
సమాజంలో తీవ్ర భయాందోళన.. బయటికి వెళ్లకుంటేనే బతికి ఉంటామనే భావన.. ప్రాణం పోసే డాక్టర్లలోనూ దడ.. వైరస్ తమకు ఎక్కడ అంటుకుంటుందోనన్న గుబులు. ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.. వ్యాధి నుంచి బయటపడతామో.. లేదోనని రోగుల్లో టెన్షన్. ఎందరో ఆత్మీయులను కోల్పోయారు. మరెందరో కడసారి చూపునకూ నోచుకోలేదు. సరిగ్గా సంవత్సరం క్రితం మన రాష్ట్రంలోకి ప్రవేశించిన ఓ వైరస్ సృష్టించిన కల్లోలం. ఇది కరోనా తెచ్చిన ఉత్పాతం.
కరోనా వైర్‌సపై పోరులో డాక్టర్లు, వైద్య సిబ్బంది అహర్నిహలు శ్రమించారు. వార్డ్ బాయ్ నుండి సూపరింటెండెంట్ వరకు పీపీఈ కిట్లు ధరించి రోజుల తరబడి రోగులకుసేవలందించారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ వేదన అనుభవించారు. 8 గంటలు, 10 గంటలు, 15 గంటలు, 24 గంటలు, 2 రోజులు ఇలా సిబ్బంది కొరతతో రోజుల తరబడి ఆస్పత్రుల్లోనే సేవలందించారు. కొంత మంది రోగుల నుంచి ఆగ్రహాన్ని చవిచూశారు. మరికొంత మంది దాడులనూ ఎదుర్కొన్నారు.
ఓ వైపు పీపీఈ కిట్లు ధరించి గంటల తరబడి విధి నిర్వహణ.. మరోవైపు సహకరించని రోగులతో నానా అవస్థలు.. ఇలా కొవిడ్‌పై పోరులో శారీరకంగా, మానసికంగా డాక్టర్లు అనుభవించిన వేదన వర్ణనాతీతం. అయితే, మహమ్మారిపై ప్రాణదాతలే పైచేయి సాధించారు. ఎన్నో ప్రయాసలకోర్చి మందు లేని మహమ్మారికి ముకుతాడు వేశారు. ఇది వైద్యులు సాధించిన విజయం.
అక్కున చేర్చుకున్న వైద్యులు
కరోనా రోగులను కుటుంబ సభ్యులే దూరం పెడుతున్న సమయంలో వారిని వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది అక్కున చేర్చుకున్నారు. ఆస్పత్రికి ఒంటరిగా వచ్చిన బాధితులకు మేమున్నామనే భరోసా కల్పించారు. ఆకలైతే అన్నం పెట్టారు. అవసరమైతే దుస్తులు మార్చారు. బాధితులకు వ్యాధి నయం కావడంలో కీలక పాత్ర పోషించారు. గాంధీ ఆస్పత్రి ముందు నుంచి వెళితే చాలు ఎక్కడ కరోనా వస్తుందోననే భయం.
అలాంటి విపత్కర పరిస్థితుల వేళ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడాది పాటు కొన్ని వేల మందిని కంటికి రెప్పాల చూసుకుంటూ రేయింబవళ్లు కష్టపడ్డారు డాక్టర్లు, వైద్య సిబ్బంది. ఎన్నో క్లిష్టమైన కేసులు, మరెన్నో ఇబ్బందులు, సమస్యలను అధిగమించిన వైద్య సిబ్బంది ఇప్పుడు అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. వైద్య సిబ్బందికి కరోనా కొత్త సవాల్ విసిరింది. అయితే దానిని అంతే సమర్థంగా ఎదుర్కొని ఎందరికో ప్రాణం పోశారు డాక్టర్లు. గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్స మొదలై ఏడాది పూర్తయిన సందర్భంగా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది అనుభవాలను తెలుసుకోవడానికి ‘ఆంధ్రజ్యోతి’ వారిని పలకరించింది.
సగం సిబ్బందితోనే మూడు షిప్టుల సేవలు
సిబ్బంది తక్కువ.. రోగులు ఎక్కువ. ఉన్న వారితోనే అన్ని వార్డుల్లో వైద్యం అందించాలి. అసలే కరోనా బాధితులకు వద్దకు అటెండెంట్ సదుపాయం లేదు. వారికి ఆలనాపాలనా మేమే చూడాలి. రోగులకు దుస్తులు మార్చడం, తినిపించడం, నీళ్లు, జ్యూస్ తాగించడం ఇలా అన్నీ ఆస్పత్రి సిబ్బందే చూసుకోవాల్సి వచ్చింది. ఒకవైపు వారికి చికిత్సలు అందిస్తుండగానే మరో వైపు బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదులు, పోలీసు కేసులు ఇలా అన్ని రకాల సమస్యలను ఎదుర్కొన్నాం. ఆ బాధలో కూడా రోగులకు మంచి వైద్యం అందించాలన్న ధ్యాసే.
కరోనా కారణంగా సగం మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది క్వారంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి. మిగిలిన సగం మంది సిబ్బందికి మూడు షిఫ్టులు వేయాల్సి వచ్చేంది. దాదాపు ఇరవై వార్డులకు వైద్యులు, సిబ్బంది విధులు కేటాయిస్తే, ఒక్కో వార్డుకు ఒకరిద్దరి కంటే ఎక్కువ వచ్చేది కాదు. ఇలా ఇరవై శాతం మందితో సేవలు అందించాల్సి వచ్చేంది. అసలే కొత్త వైరస్.. ఆస్పత్రిలో అన్ని పడకలు రోగులతో నిండిపోవడం, అందరికీ సేవలు అందించడం సవాల్‌గా మారింది.
రాత్రి, పగలు ప్రతి వార్డు తిరుగుతూ, రోగులను పలకరిస్తూ, వారిలో మనో దైర్యం నింపేందుకు ప్రయత్నించాం. ఏడాదిగా ఈ సమస్యలను పరిష్కరిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతూ ఎంతో మంది రోగులకు మెరుగైన చికిత్స అందించామనే సంతృప్తి మిగిలింది. కొంత మంది నయం అయిన పెద్ద వాళ్లను ఎవరూ ఇంటికి తీసుకుపోలేదు. వారిలో కొందరిని వృద్ధాశ్రమాలకు తరలిస్తే మాపై కేసులు పెట్టారు. ఆస్పత్రిలోనే ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి వారిని మేమే చూసుకున్నాం. మరో వైపు రంజాన్ రావడంతో రోజా ఉండే వారికి ప్రత్యేక ఆహారం తయారు చేయించాల్సి వచ్చింది. తెల్లవారుజామున 3.30 గంటలకే వారికి భోజనాలు సిద్ధం చేసి 4.30 గంటలకు అందించాల్సి వచ్చింది.
- డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్
వారి ఊపిరికి మా ఊపిరి అడ్డు వేశాం
మొదటి కేసు గాంధీకి రాగానే మేము సిద్ధమయ్యాం. రోగుల ఊపిరికి మా ఊపిరి అడ్డు వేశాం. కరోనాతో వచ్చే రోగిలో న్యూమోనియా తీవ్రత పెరుగుతుంది. ఆక్సిజన్ స్థాయిలో హెచ్చు తగ్గులుంటాయి. దీంతో పేషెంట్ పరిస్థితి విషమంగా ఉంటుంది. ఆక్సిజన్ స్థాయి తక్కువగా రోగులకు చికిత్స అందించడం ఒక సవాల్‌గా మారుతుంది. ప్రతి రోగిని చాలా జాగ్రత్త గమనించాలి. దాదాపు 8 గంటలకు మించి పీపీఈ కిట్లు వేసుకొని వారిని కనిపెట్టుకొని ఉండాలి. ఏడాదిలో 2 నుంచి 3 వేల మంది ఇలాంటి రోగులకు చికిత్సలు అందించాం. అందులో మెజారిటీ రోగులను ప్రాణాపాయస్థితి నుంచి తప్పించాం.
- డాక్టర్ ప్రమోద్‌కుమార్, సీనియర్ పల్మానాలజిస్టు
దైర్యం కల్పించడానికి చాలా కష్టపడ్డాం
కరోనాతో వచ్చే బాధితులు ఇంటికి దూరంగా ఉండడంతో మానసికంగా, శారీరకంగా కుంగిపోయే వారు. వారి వద్దకు వెళ్లితే మాపై మండిపడే వారు. మొదట 20 నుంచి 30 కేసులను పరిశీలించే వాళ్లం. ఆ తర్వాత సంఖ్య వందలకు చేరింది. కోలుకున్న వారికి రెండు నెగిటివ్స్ వచ్చేంత వరకు ఇక్కడే ఉంచడంతో మానసికంగా ఇబ్బంది పడే వారి సంఖ్య మరింత పెరిగింది. దీంతో అందరినీ ఒకేచోట కూర్చో బెట్టి కౌన్సెలింగ్ నిర్వహించాం. కొంత మందికి ఇంట్లో వారితో ఫోన్ మాట్లాడించి కుదుట పర్చేవాళ్లం. డిప్రెషన్, అల్కాహల్ విత్‌డ్రాయల్ సిండ్రోమ్, యాంగ్జయిటీ ఇలా.. అనేక రకాల సమస్యలతో రోగులు బాధపడేవారు. అలాంటి వారికి కౌన్సెలింగ్, మందులతో నయం చేశాం.
- అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అజయ్, సైకియాట్రిస్టు
పురుడు పోసేందుకు తీవ్రంగా శ్రమించాం..
కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితులో గైనిక్ సిబ్బంది అవసరం వచ్చింది. అందరం ముందుకు వచ్చి దాదాపు 950 మందికి ప్రసవాలు చేశాం. గాంధీ ఆస్పత్రిని నోడల్ కేంద్రంగా ప్రకటించడంతో గైనిక్ విభాగాన్ని సుల్తాన్‌బజార్‌కు తరలించాం. నెలలు నిండిన గర్భిణులకు కరోనా వస్తే చాలా క్లిష్ట పరిస్థితి ఉంటుంది. కడుపులో ఉన్న బిడ్డ, గర్భిణి గుండె స్పందనలు, బీపీ గమనిస్తూ వారికి ప్రసవం చేయాలి. ఇలాంటి సీరియస్ కేసుల్లో వెంటనే సిజేరియన్ చేయాల్సి వచ్చేంది. మెల్లమెల్లగా ఎలాంటి చికిత్సలు అందించాలనే విషయంలో మెలుకువలు తెలుసుకుంటూ సిజేరియన్ చేయడం తగ్గించాం. రకరకాల జబ్బులతో నెలుల నిండి ఆస్పత్రికి వస్తే వారందరికీ ప్రసవం చేసి తల్లీ బిడ్డలు క్షేమంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం.
- డాక్టర్ మహాలక్ష్మి, అధిపతి, గైనకాలజీ విభాగం
మాపై మండిపడినా..
నా అనుభవంలో ఇలాంటి కేసులు రావడం మొదటిసారి చూశా. రోగులను చూస్తుంటే గుండె తరుక్కుపోయింది. ఇంక అంతా అయిపోయిందనుకుంటున్న రోగులకు మేం అండగా నిలిచాం. కుటుంబ సభ్యులను వదిలి ఆస్పత్రికి వచ్చిన వారికి వైద్యం అందించాం. మాకూ కుటుంబం ఉంది. పిల్లలు ఉన్నారు. వారిని వదలి నెలల తరబడి కరోనా బాధితుల సేవలో ఉండిపోయాం. కొన్నిసార్లు బాధేసింది. అందరినీ వదిలి ఇలా ఉండాల్సి రావడం ఏంటని మనోవేదనకు గురయ్యాం. తర్వాత బాధ నుంచి తేరుకున్నాం. వందల మందికి ఒక నర్స్‌గా సేవలందించాను.
- అరుణ, సీనియర్ స్టాఫ్ నర్స్
వైర్‌సను నిర్ధారించడం ఒక సవాల్
కరోనా సమయంలో మైక్రో బయాలజీ ల్యాబ్‌లో 24 గంటల పాటు పరీక్షలు నిర్వహించాం. కొంత మందికి ఒకటికి రెండు సార్లు పరీక్ష చేసి నిర్ధారించుకోవాల్సి వచ్చేది. ఇబ్బందులు అధిగమిస్తూ వేల మందికి పరీక్షలు చేశాం. అనుమానితులకు ముందుగా స్ర్కీనింగ్ చేసే వాళ్లం. ఆ తరువాత రెండు రకాల జీన్స్ పరీక్షలు చేసే వాళ్లం. వైరస్ తీవ్రతను బట్టి నిర్ధారణకు వచ్చేవాళ్లం. ఫలితం రావడానికి మొదట్లో 6 నుంచి 8 గంటలు పట్టేంది.
- డాక్టర్ అర్జున్, పీజీ విద్యార్థి