ఆలోచించి అడుగేయండి

0
180
Spread the love

ఎంతోకాలంగా షేర్లలో పెట్టుబడులు పెడుతున్నప్పటికీ, వాటి క్రయ, విక్రయాలకు తగిన సమయాన్ని గుర్తించేదెలా..? అన్న ప్రశ్న మాత్రం చాలా మందిలో ఉంటుంది. కొత్తగా మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న వారిలోనైతే ఇలాంటి సందేహాలు అనేకం. షేర్ల కొనుగోలు, అమ్మకానికి ముందు పరిగణించాల్సిన అంశాలు..

కొనుగోలు

షేర్లను ఎప్పుడు కొనుగోలు చేయాలో తెలుసుకోవడం కన్నా ఎప్పుడు కొనుగోలు చేయకూడదో తెలుసుకోవడం ముఖ్యం. గొర్రెదాటు తీరుగా అందరూ కొంటున్న షేర్ల కోసం పరిగెత్తకండి. మార్కెట్లో ఆర్థిక మూలాలకు అతీతంగా నెలకొన్న డిమాండ్‌ పాలపొంగు లాంటిదే. వెంటనే చల్లారుతుంది. వేలం వెర్రిగా ఎగబడుతున్న షేర్లను గరిష్ఠ స్థాయి ధరకు కొనుగోలు చేస్తే, మీ పెట్టుబడి కర్పూరంలా కరిగేందుకు అవకాశాలధికం. నష్టపోకున్నా.. లాభాలు పంచే అవకాశాలు మాత్రం తక్కువే.
దీర్ఘకాలంలో మెరుగైన రిటర్నులు పంచేందుకు అవకాశాలున్న రంగాలకు చెందిన కంపెనీల షేర్లను ఎంచుకోవడం మేలు. మార్కెట్‌ ప్రతికూలతలకు నిలదొక్కుకోగలిగే షేర్లను ఎంచుకుంటే భవిష్యత్‌లో మంచి ప్రతిఫలాలు అందిపుచ్చుకోవచ్చు.

విక్రయం

ఏదేని కంపెనీ షేర్లు కొనుగోలు చేసేందుకు ప్రభావితం చేసిన కారణం మనుగడ కోల్పోయినప్పుడు ఆ కంపెనీ షేర్ల నుంచి వైదొలగడమే ఉత్తమం. ఉదాహరణకు, మీరు ఓ బ్యాంక్‌ షేర్లు కొనుగోలు చేశారనుకుందాం. కేవలం ఆ బ్యాంక్‌ సీఈఓ ప్రతిభ, అనుభవం, నాయకత్వం మీద నమ్మకంతోనే పెట్టుబడులు పెట్టారనుకుందాం. భవిష్యత్‌లో ఆ సీఈఓ వైదొలిగితే.. మీ కారణం మనుగడ కోల్పోతోంది. అలాంటప్పుడు బ్యాంక్‌ షేర్లను విక్రయించడమే మేలు.
వ్యాపారావకాశాలు తగ్గుతున్నా, పనితీరు దిగజారినా, రుణ భారం అనూహ్యంగా పెరిగినా, ప్రమోటర్ల వ్యవహారశైలి వివాదాస్పదంగా మారినా ఆ కంపెనీ షేర్ల నుంచి వైదొలగడం మేలు.
మీరు పెట్టుబడులు కలిగి ఉన్న కంపెనీకి చెందిన రంగంలో విధానపరమైన, వ్యవస్థాగత, సాంకేతిక మార్పులపై సదా అప్రమత్తంగా ఉండాలి. కంపెనీ పనితీరు బాగున్నప్పటికీ, ఆ రంగంలోని ప్రతికూలతలను ముందే పసిగట్టగలిగితే పెట్టుబడి నష్టపోకుండా బయటపడవచ్చు.
మీరు కొనుగోలు చేసిన ధరతో పోలిస్తే షేరు ఇప్పటికే బాగా పెరిగిందని గుడ్డిగా అమ్మేయకండి. మున్ముందు మరింత పెరిగేందుకు అవకాశాలున్నాయా..? మార్కెట్‌ పరిస్థితులు వంటి అంశాలను బేరీజు వేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here