ఆశ చూపి.. మోసం చేసి..

0
310
Spread the love

విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మాణానికి 1971లో 15 వేల ఎకరాల భూమిని సేకరించారు. అప్పట్లో ఎకరాకు రూ.1,200 చొప్పున నిర్వాసితులకు చెల్లించారు. ఆ మొత్తం సరిపోదని నిర్వాసితులు ఆందోళన చేయడంతో 1973లో రూ.3,000 చొప్పున ఇచ్చారు. ప్లాంట్‌ అవసరాల నిమిత్తం ఇంకా భూమి అవసరమని భావించి ఆ తర్వాత మరో 11 వేల ఎకరాలను సేకరించారు. ఈ భూములకు ఎకరాకు రూ.26 వేల వరకూ చెల్లించారు. అలా.. నెలిముక్కు, సిద్ధేశ్వరం, నడుపూరు, గంగవరం, దిబ్బపాలెం, కణితి, అప్పికొండ, వడ్లపూడి, కొండయ్యవలస పంచాయతీల పరిధిలోని 64 గ్రామాల్లో సుమారు 26 వేల ఎకరాలు సేకరించారు. అప్పట్లో 16 వేల మందిని నిర్వాసితులుగా గుర్తించారు. భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం, ఇళ్లు కోల్పోయిన వారికి 107 గజాల స్థలం, నిర్వాసితులుగా గుర్తించే కార్డు(ఆర్‌-కార్డు) ఇచ్చారు. అది కూడా భూ సేకరణ సమయానికి మేజర్‌ అయ్యి వివాహం అయిన వారికి మాత్రమే ఇచ్చారు.

నిర్వాసితులకు ఇచ్చిన హామీలు ఇవీ

ప్రతి నిర్వాసిత కుటుంబానికి ఓ ఉద్యోగం

నిర్వాసిత కుటుంబానికి నిర్వాసిత కాలనీలో 107 గజాల స్థలంలో ఇళ్లు కట్టించి ఇవ్వడం

ప్లాంట్‌ నిర్మాణం చేయగా మిగులు భూములు ఉంటే, అప్పటికి మేజర్‌ అయిన పిల్లలకు అదనంగా మరో 100 గజాల స్థలం.

నిర్వాసిత కాలనీలు పూర్తిస్థాయిలో అభివృద్ధి

సగం మందికైనా నెరవేరని హామీలు

నాడు 16 వేల మందిని నిర్వాసితులుగా గుర్తించినప్పటికీ 8,009 మందికే ఇప్పటి వరకు ప్లాంట్‌లో ఉపాధి కల్పించారు. మిగిలినవారు ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. నిర్వాసిత కాలనీలో 107 గజాల స్థలంలో ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి, కొన్నిచోట్ల నమూనా ఇళ్లు నిర్మించారు. అవి సరిగా లేవని నిర్వాసితులు వ్యతిరేకించడంతో సామగ్రి ఇస్తామని చెప్పారు. ఇవి కూడా కొంతమందికి మాత్రమే అందాయి. నిర్వాసిత కాలనీలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదు

ఆశ చచ్చిపోయింది

స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం జరిగితే ఉపాధి లభించి మా బతుకులు బాగుంటాయని ఆరు ఎకరాలు ఇచ్చాను. ఉద్యోగం ఇస్తామని, ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పారు. ఇల్లూ కట్టివ్వలేదు. ఉద్యోగమూ ఇవ్వలేదు. కనీసం నా కొడుక్కి కూడా ఉద్యోగం రాలేదు. ఉద్యోగం వస్తుందనే ఆశ ఇప్పటి వరకు ఉంది. ఇప్పుడు ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేస్తుండటంతో ఆ ఆశ కూడా చచ్చిపోయింది. భూములు ఇచ్చినందుకు ఇప్పుడు చాలా బాధపడుతున్నాం.

ఉద్యోగం వచ్చేనా..

నా వయసు ఇప్పుడు 78 సంవత్సరాలు. 25 ఏళ్ల వయసులో నా భూమి 11 ఎకరాలు, ఇల్లు స్టీల్‌ప్లాంట్‌ కోసం తీసుకొని ఆర్‌-కార్డు ఇచ్చారు. నాకు ఉద్యోగం వస్తుందని ఆశగా ఎదురుచూశాను. కానీ రాలేదు. పోనీ నా ఇద్దరు కుమారుల్లో ఒకరికి అవకాశం వస్తుందని చూశాను. వారికీ ఇప్పటి వరకు రాలేదు. నేను బతికుండగా నా కుమారుడికి ఉద్యోగం వస్తే

నాన్న ఎంతోకాలం ఎదురుచూశారు

సుమారు 45 ఏళ్ల క్రితం స్టీల్‌ ప్లాంట్‌ కోసం మా నాన్న గారు ఆరు ఎకరాల భూమిని ఇచ్చారు. ఉద్యోగం కోసం ఆయన చాలా కాలం ఎదురు చూశారు. కానీ రాలేదు. తరువాత ఆర్‌ కార్డును నా పేరున మార్చుకున్నాను. ఉద్యోగం కోసం నేను కూడా చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేస్తే, ప్రైవేట్‌ వాళ్లు మాకు ఉద్యోగం ఇవ్వరు కదా! అందుకే మా భూమిని మాకు తిరిగి ఇచ్చేయాలి.

మా భూములతో ప్రభుత్వం వ్యాపారం..

నాకు ప్రస్తుతం 75 ఏళ్లు. ఉద్యోగం లభిస్తుందని చెప్పడంతో అప్పట్లో చాలా తక్కువ ధరకు ఆరు ఎకరాలు ఇచ్చాను. ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగం ఇవ్వలేదు. ఇప్పుడు ప్రైవేటు వాళ్లకు స్టీల్‌ కంపెనీని అమ్మేస్తామంటున్నారు. ఇందుకు ఒప్పుకోం. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రభుత్వమే నడపాలి. లేదంటే మా భూములు తిరిగిచ్చేసి అమ్ముకోమనండి. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ఎన్ని పోరాటాలకైనా సిద్ధం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here