ఆసరా లేని వృద్ధులకు ఆపన్న హస్తం!

0
162
Spread the love

ఇండోర్‌లో.. ఆసరాలేని వృద్ధులను శివార్లలో చెత్తకుప్పలా పడేసిన దారుణ ఘటన కేంద్రాన్ని కదిలించింది. పట్టెడన్నం కోసం ఏ రోజుకు ఆ రోజు పోరాడుతున్న వయసుడిగిన వాళ్లను ఆదుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. వీరి కోసం ‘మధ్యాహ్న భోజన పథకాన్ని’ తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ పథకాన్ని ముందుగా 2 వేల గ్రామ పంచాయతీలు, 200 మునిసిపాలిటీల్లో అమలు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న, నిరాశ్రయులైన వృద్ధుల వివరాలు సేకరించనుంది. రోజుకు 55 వేల మందికి భోజనం అందించేందుకు కావలసిన సామగ్రిని అందించాలని, ఇందుకుగాను 25 మందితో కూడిన ఓ కేటరింగ్‌ బృందాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. 2025 నాటికి 10 వేల గ్రామ పంచాయతీలు, 1,000 మునిసిపాలిటీలకు ఈ పథకాన్ని తీసుకెళ్లాలని, 2.75 లక్షల మంది లబ్ధిదారులకు ఆహారం అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2050 నాటికి దేశంలో వృద్ధుల జనాభా 30 కోట్లు దాటుతుందని అంచనా. దీన్ని దృష్టిలో ఉంచుకుని వారిని ఆదుకునేందుకు ఓ క్రమ పద్ధతిలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని భావిస్తోంది. ఈ దిశగా రాబోయే ఐదేళ్లను లక్ష్యంగా నిర్ణయించుకుని వృద్ధులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన ‘పోషణ్‌ అభియాన్‌’ లాంటి మరికొన్ని పథకాలకు రూపకల్పన చేయాలని యోచిస్తోంది. ఈ ప్రణాళికలను సామాజిక న్యాయం, సాధికారత శాఖ కార్యదర్శి ఆర్‌. సుబ్రహ్మణ్యం అధ్యక్షతన వృద్ధుల సంక్షేమ నిధి (ఎస్‌సీడబ్ల్యూఎఫ్‌) కోసం ఏర్పాటైన అంతర్గత మంత్రిత్వ సంఘం (ఐఎంసీ) ఈ నెల 4న ఆమోదించింది. రోజుకి ఒక్కో మనిషికి రూ. 20 ఖర్చవుతుందని, మొత్తంగా రూ. 39.60 కోట్లు ఖర్చు చేయనున్నామని సుబ్రహ్మణ్యం వివరించారు. వృద్ధాశ్రమాలు లేని గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలను మాత్రమే ఇందుకోసం పరిగణనలోకి తీసుకుంటామని ఆయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here