ఇక ‘మండలి’ భేరి!

0
175
Spread the love

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో రెండు ఉపాధ్యాయ స్థానాలకు, తెలంగాణలో రెండు పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి నోటిఫికేషన్‌తో రెండు రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరుపుతామని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) కె.విజయానంద్‌ కూడా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం, కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి.. తెలంగాణలో మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ గ్రాడ్యుయేట్‌ నియోజ కవర్గం, వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గాల ఎన్నికలకు ఈసీఐ షెడ్యూల్‌ ప్రకటించింది.

ఈ నెల 16న నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు 23వ తేదీ. మర్నాడు వాటిని పరిశీలిస్తారు. ఉపసంహరణకు 26 వరకు గడువిచ్చారు. పోలింగ్‌ మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మార్చి 17న జరుగుతుంది. మార్చి 22వ తేదీతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. కాగా.. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలతో ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఈసీఐ తెలిపింది. కరోనా నేపథ్యంలో కొవిడ్‌-19 మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించింది.

వారి పదవీ కాలం మార్చి 29తో సరి..

కాగా.. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న రాము సూర్యారావు(ఆర్‌ఎ్‌సఆర్‌ మాస్టర్‌), కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ పదవీ కాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు, వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పదవీ కాలం కూడా అదే రోజు ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఆయా స్థానాలకు ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించనుంది.

నామినేషన్లు మొదలయ్యే రోజు వరకు ఓటర్లుగా చేరొచ్చు

అర్హత కలిగిన ఉపాధ్యాయులు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించే రోజు వరకు ఓటర్లుగా చేరవచ్చని సీఈవో విజయానంద్‌ తెలిపారు. గురువారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. పీఎఫ్‌ లేదనే కారణంగా ఉపాధ్యాయుల ఓటు హక్కును తిరస్కరించరని స్పష్టం చేశారు. ఓటుకు సంబంధించిన దరఖాస్తులను గానీ, నామినేషన్లు గానీ గంపగుత్తగా తీసుకోబోమని.. ఎవరికి వారే వ్యక్తిగతంగా అందజేయాలని ఆయన సూచించారు. తక్షణం నాలుగు జిల్లాల్లో కోడ్‌ అమల్లోకి వస్తున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here