అహ్మదాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ప్రారంభించారు. గుజరాత్‌లోని మొతేరాలో 63 ఎకరాల్లో రూ. 800 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ స్టేడియం ఆరంభ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు, బీసీసీఐ కార్యదర్శి జై షా తదితరులు పాల్గొన్నారు. కాగా.. మొతేరాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంగా ఉన్న పేరును ప్రధాని నరేంద్ర మోదీ పేరున మార్పు చేశారు. ప్రారంభించిన తర్వాతి వరకు స్టేడియం పేరును మారుస్తున్న విషయాన్ని గోప్యంగా ఉంచడం గమనార్హం. స్టేడియాన్ని ప్రారంభించిన అనంతరం రాష్ట్రపతి కోవింద్ మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ స్టేడియం నిర్మాణానికి బాటలు వేశారు. అప్పట్లో ఆయన గుజరాత్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ఈ స్టేడియం భారతీయుల ఆకాంక్షలకు, సమర్థతకు నిదర్శనం. భారత్‌ను క్రికెట్ హబ్‌గా పిలుస్తారు. అందుకు తగ్గట్టుగా మన దేశంలో ఇంత భారీ స్టేడియం ఉండడం సమంజసమే. ఇది భారత్‌కు కొత్త గుర్తింపు తెస్తుంది’ అని అన్నారు.

మోదీ కలల ప్రాజెక్టు: స్టేడియాన్ని మోదీ కలల ప్రాజెక్టుగా హోం మంత్రి అమిత్ షా అభివర్ణించారు. ‘ఇది మోదీ కలల ప్రాజెక్టు. అందుకే ఈ స్టేడియానికి ఆయన పేరు పెట్టాలని నిర్ణయించాం’ అని షా తెలిపారు. ‘భారత్‌లో అతి పెద్ద స్టేడియం ఉండాలని చిన్న పిల్లాడిగా ఉన్న సమయంలో కలలు కన్నా. నేను క్రీడల మంత్రిగా ఉండగా ఆ కల నిజమైనందుకు సంతోషంగా ఉంది’ అని రిజిజు వ్యాఖ్యానించారు. ఆ క్రీడా సముదాయానికి రాష్ట్రపతి కోవింద్ శంకుస్థాపన చేశారు. దీనికి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్‌గా నామకరణం చేయనున్నారు. ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, హాకీ, కబడ్డీ, బాక్సింగ్, టెన్నిస్ తదితర కోర్టులు ఈ సముదాయంలో ఉండనున్నాయి. 215 ఎకరాల ఈ ప్రాజెక్టులో మొత్తం 20 స్టేడియాలను క్రీడాకారులు, కోచ్‌లకు అవసరమైన సదుపాయాలతో నిర్మించనున్నారు.
సర్దార్ పటేల్ పేరునే కాంప్లెక్స్: కేంద్రం వివరణ
స్టేడియం పేరును నరేంద్ర మోదీ పేరిట మారుస్తున్నట్లు ప్రకటించగానే సోషల్ మీడియాలో విమర్శలు, అభ్యంతరాలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ నాయకులతోపాటు ఇతర విపక్షాల నేతలు కూడా స్టేడియం పేరు మార్పును తప్పుబట్టారు. అలా చేయడం వల్లభాయ్ పటేల్‌ను అవమానించడమేనని దుయ్యబట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ వివరణ ఇస్తూ..క్రికెట్ స్టేడియం పేరును మాత్రమే నరేంద్ర మోదీగా మార్చామన్నారు. కాంప్లెక్స్ పేరు వల్లభాయ్ పటేల్ పేరిటే కొనసాగుతుందని చెప్పారు.