‘‘ఏపీలో అరాచక పాలన సాగుతోంది. ప్రజలెవరూ సుఖశాంతులతో జీవించడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ముందుముందు భయానక వాతావరణంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవించాల్సి వస్తుంది’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. మునిసిపల్, నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు, పిఠాపురంలో ఆయన పర్యటించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలను కల్పించడంలో విఫలమయ్యిందన్నారు. అభివృద్ధి పక్కనపెట్టి ఇప్పుడు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులకు ఓటు వెయ్యకపోతే పథకాలు ఆపేస్తామని, చంపేస్తామని, తరిమేస్తామని ఆ పార్టీ నాయకులు అంతర్గత బెదిరింపులకు పాల్పడుతుండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజలు ఇప్పుడు ఏపీలో ఉన్నారో, బిహార్‌లో ఉన్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. పోలీసులు లేకుండా వైసీపీ నాయకులు బయటకు రాలేకపోతున్నారన్నారు. ఒకవేళ ధైర్యం చేసి బయటకు వస్తే వారిని ప్రజలే తరిమికొడతారన్నారు.

‘‘జగన్ రెడ్డి పిరికోడు. పసుపు జెండా చూస్తేనే కంగారు పడుతున్నాడు. పిరికోడు గనుకనే మన అభ్యర్థులను ఆయన కార్యకర్తలతో ఇబ్బందులకు గురిచేస్తున్నాడు’’ అని ఎద్దేవా చేశారు. ప్రతీ విషయంలో పెంచుతూ పోతానంటోన్న జగన్ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. అధికారంలోకి రాగానే పేదలకు సన్నబియ్యం ఇస్తామని చెప్పి, ఇప్పుడు మాట మార్చి నాణ్యమైన బియ్యం అంటున్నారని విమర్శించారు.
జగన్ పాలనలో అంతా సెలక్షన్
ఒక్క అవకాశమివ్వాలని కోరి అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ఇప్పుడు మరో అవకాశమిస్తే మన కుటుంబాల మీదకు వస్తారని లోకేశ్ అన్నారు. ఆదివారం రాత్రి పిఠాపురం మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన రోడ్‌షో నిర్వహించారు. జగన్‌రెడ్డి పాలనలో ఎలక్షన్ లేదని, అంతా సెలక్షన్ ఉందన్నారు. పాదయాత్రలో విసిరిన ముద్దులు ట్రైలర్ మాత్రమే అని ఇప్పుడు మాత్రం పిడిగుద్దులు విసురుతున్నారని విమర్శించారు. ఢిల్లీని గడగడలాడిస్తానని చెప్పిన జగన్ కేసులభయంతో మోదీని చూస్తే గజగజ వణుకుతూ ఆయన కాళ్లపై పడేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవాచేశారు. ధరల పెరుగుదలపై చర్చ కు తానే వస్తానని చెప్పినా మంత్రి కన్నబాబు నుంచి స్పందన లేదన్నారు.