
ఇప్పటికే పక్కా ఇళ్ల పథకం ఒక్క అడుగూ పడక పేదలు నానా పాట్లు పడుతున్నారు. దానికితోడు ‘సర్కారు మాది! స్కీమూ మాదే’ అన్న అధికార ధోరణి గ్రామాల్లో పెరగడం మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతోంది. పంచాయతీ ఎన్నికల్లో తాము ఓడిపోయిన గ్రామాల్లో ఇప్పటికే చేపడుతున్న, కొత్తగా తలపెట్టిన ఇళ్ల నిర్మాణాల విషయంలో వైసీపీ స్థానిక నాయకులు గందరగోళం సృష్టిస్తున్నారు. లబ్ధిదారుల నుంచి ఆప్షన్ల స్వీకరణ, మోడల్ హౌస్‌లకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో అధికార పార్టీ నాయకులు తలదూరుస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే ఎక్కువగా ఇళ్ల కేటాయింపు జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో కూడా అదేవిధంగా వైసీపీ నాయకులు చెప్పినవారికే స్థలాలు, ఇళ్లు కేటాయించారు. అయితే పంచాయతీ ఎన్నికలు అయిపోగానే ఓడిపోయిన చోట్ల అధికార పార్టీ నాయకులు పునరాలోచనలో పడ్డారు. తమకు ఓట్లేయలేదని అనుమానం ఉన్న వారికి ఇళ్లు ఇవ్వకూడదని గట్టిగా పట్టుబడుతున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో జియో ట్యాగింగ్, లబ్ధిదారుల మ్యాపింగ్ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నాయి.
నిబంధనలలా, వీళ్లిలా..
నిబంధనల ప్రకారం ఒకసారి ఇంటి స్థలం ఇచ్చిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకంతో అనుసంధానమైన ఇళ్ల పథకం అమలుచేస్తున్నందున ఒకసారి లబ్ధిదారుల పేర్లపై ఐడీ తయారైతే, వేరే వారికి ఇల్లు ఇవ్వడం సాధ్యపడదు. ఇవన్నీ తెలియని స్థానిక నాయకులు తమకు నచ్చిన వారికే ఇళ్లు ఇవ్వాలని, కొందరికి ఇప్పటికే కేటాయించినా ఆపాలని అధికారులపై జులుం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కాదని గృహనిర్మాణ శాఖకు చెందిన క్షేత్రస్థాయి అధికారులు నాయకులు తెగేసి చెబుతున్నారు. ఒకసారి ఐడీ రూపొందించాక లబ్ధిదారులను తొలగించడం సాధ్యం కాదని చెబుతున్నా, కొందరు నాయకులు మొండి పట్టుదల పడుతున్నారని అధికారవర్గాల్లో చర్చ సాగుతోంది. కొన్ని చోట్ల మోడల్ హౌస్‌ల కోసం తొలుత ఎంపిక చేసిన లబ్ధిదారుల పేర్లనూ మార్చాలని ఒత్తిళ్లు జరుగుతున్నాయి.
కొత్తగా స్థలాలు ఇచ్చిన కాలనీల్లో కాలనీకి ఒకటి చొప్పున తొలుత మోడల్ హౌస్‌లు కట్టాలని నిర్ణయించారు. వాటికి ఒక్కొక్కరు చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారిలోనూ కొందరు తమకు ఓట్లేయలేదనే కారణంతో మోడల్ హౌస్‌లకు కూడా లబ్ధిదారులను మార్చాలంటూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంతో అధికార యంత్రాంగం విసిగిపోతోంది. ఇప్పటికే పక్కా ఇళ్ల నిర్మాణాల విషయంలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతున్నాయి.
ఇళ్ల లక్ష్యం నెరవేరేనా!
అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతున్నా వైసీపీ ప్రభుత్వం ఇంతవరకూ కొత్తగా ఒక ఇల్లూ కట్టలేదు. ఎక్కువ కాలం ఇళ్ల స్థలాల కోసం సాగదీసిన ప్రభుత్వం, అవి పంపిణీ చేసిన తర్వాత కూడా ఇళ్ల నిర్మాణాల పథకాన్ని వెంటనే పట్టాలెక్కించలేకపోయింది. ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు చిన్నవి కావడం, గృహనిర్మాణ శాఖ ప్రభుత్వమే ఇళ్లు కట్టిస్తుందనే ఆప్షన్ పెట్టడం, ప్రభుత్వమే తక్కువ ధరకు నిర్మాణ సామగ్రి ఇస్తుందని హామీ ఇవ్వడం ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. తక్కువ ధరకు నిర్మాణ సామగ్రి సరఫరా చేసేందుకు కంపెనీలు ఏవీ ముందుకు రాకపోవడంతో టెండర్ల ప్రక్రియ పూర్తికావడం లేదు. మరోవైపు తమవల్ల కాదని ప్రభుత్వం కట్టించి ఇస్తే తీసుకుంటామని దాదాపు 3లక్షలకు పైగా లబ్ధిదారులు ఆప్షన్ పెట్టుకోవడంతో ఇప్పుడు వాటినెలా కట్టాలో అధికారులకు అర్థంకావడం లేదు.
ఈ మొత్తం వ్యవహారం చూస్తే ప్రభుత్వం తొలి విడతలో అనుకుంటున్న 15లక్షల ఇళ్ల నిర్మాణాలు వైసీపీకి మిగిలిన మూడేళ్లలో అయ్యేలా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక నాయకులు కొత్త అడ్డంకులు సృష్టించడం అధికారులను మరింత అసహనానికి గురిచేస్తోంది.