
దేశంలో 18-25 సంవత్సరాల మధ్య వయస్కులైన యువతులు సాంప్రదాయిక పెట్టుబడి సాధనాలపై పెదవి విరుస్తున్నారు. ఎక్కువ రిస్క్ ఉన్నా అధిక రాబడి ఇచ్చే పెట్టుబడులకే తమ ప్రాధాన్యత అని తేల్చి చెప్పారు. మహిళల పెట్టుబడి ధోరణులపై గ్రో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడయింది. అధిక శాతం మంది సాంప్రదాయికమైన ఎఫ్‌డిల కన్నా రిస్క్ అధికంగా ఉన్న ఈక్విటీ పెట్టుబడులకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆ సర్వే తేల్చింది. అలాగే అన్ని ఆదాయ శ్రేణుల్లోని మహిళల్లోనూ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల పట్ల మక్కువ కనిపించింది. దేశవ్యాప్తంగా మొత్తం 28 వేల మంది విభిన్న వయోశ్రేణుల్లోని మహిళల పెట్టుబడి ధోరణులపై ఆ సంస్థ సర్వే నిర్వహించింది. ఆదాయం, వయస్సు ఆధారంగా పెట్టుబడి లక్ష్యాలు మారుతున్నట్టు తేలింది.
- అన్ని వయోశ్రేణులు, ఆదాయ వర్గాల్లోని మహిళలు బంగారానికి తమ పోర్ట్‌ఫోలియోలో స్థిరమైన స్థానాన్ని కొనసాగించారు. 25 శాతం మంది మహిళలు బంగారంపై పెట్టుబడులు పెట్టారు. రూ.10 లక్షల పైబడి ఆదాయం ఆర్జించే మహిళల్లో 40 శాతం మంది బంగారంపై మొగ్గు చూపారు.
- రూ.30 లక్షల ఆదాయ శ్రేణిలోని వారిలో 6 శాతం మంది క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడి పెట్టారు. రూ.10 లక్షల కన్నా తక్కువ ఆదాయ శ్రేణిలోని వారిలో క్రిప్టోల్లో పెట్టుబడి పెట్టిన వారి సంఖ్య 4 శాతం ఉంది.
- రూ.30 లక్షలు, ఆ పైబడిన ఆదాయ శ్రేణిలోని వారిలో అధిక శాతం మంది రియల్ ఎస్టేట్‌పై మక్కువ ప్రదర్శించారు.
- పెట్టుబడి లక్ష్యాల విషయానికొస్తే 57 శాతం మంది మిలీనియల్స్ వ్యక్తిగత అవసరాలకు, 28 శాతం మంది ప్రయాణాల కోసం, మరో 28 శాతం ఉన్నత విద్యకు ఇన్వెస్ట్ చేస్తున్నారు.
- రూ.30 లక్షలు, పైబడిన వార్షికాదాయ శ్రేణిలోని మహిళలు రిటైర్మెంట్ అనంతర అవసరాలకు ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీరిలో 70 శాతం మంది వీలైనంత త్వరగా రిటైర్ కావాలనుకుంటున్నారు.
- రూ.10-30 లక్షల ఆదాయ శ్రేణిలోని వారిలో 36 శాతం మంది, రూ.5-10 లక్షల ఆదాయ శ్రేణిలోని వారిలో 26 శాతం మంది ముందుగానే రిటైర్ కావాలనుకుంటున్నారు.
- 35 సంవత్సరాల వయోశ్రేణిలోని వారిలో 64 శాతం మంది పిల్లల విద్య, వివాహ అవసరాలకు పెట్టుబడులు పెడుతున్నారు.
ఇన్వెస్ట్ చేయని వారూ ఉన్నారు
ఏ పెట్టుబడులకు మొగ్గు చూపని 2000 మంది అభిప్రాయాలు కూడా ఈ సర్వేలో తీసుకున్నారు. వారిలో 49 శాతం మంది సరైన పెట్టుబడి పరిజ్ఞానం లేకపోవడమే కారణమని చెప్పగా 32 శాతం మంది పొదుపు చేయడానికి అవసరమైన వనరులు లేవన్నారు. మార్కెట్లో డబ్బు పోగొట్టుకుంటామేమో అన్న భయం 13ు మంది వ్యక్తం చేశారు.