ఈ ఏడాది రెండో త్రైమాసికం (ఏప్రిల్-జూన్) లో నియమకాలు పెంచనున్నట్లు భారత కార్పొరేట్ రంగం సంకేతాలిచ్చింది. ప్రధానంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, విద్య, సేవా రంగాల్లో అధిక నియామకాలు జరిగే అవకాశముందని మాన్‌పవర్ గ్రూప్ తాజా సర్వే నివేదిక వెల్లడించింది. టోకు, రిటైల్ రంగాల్లో మాత్రం ఉద్యోగావకాశాలు అంతంత మాత్రంగానే ఉండవచ్చని అంటోంది. కరోనా సంక్షోభానికి కుదేలైన భారత జాబ్ మార్కెట్ వేగంగా కోలుకుంటోందని మాన్‌పవర్ గ్రూప్ ఇండియా ఎండీ సందీప్ గులాటీ అన్నా రు. దేశవ్యాప్తంగా 2,375 కంపెనీల యాజమాన్యాలను సర్వే సందర్భంగా ప్రశ్నించినట్టు మాన్‌పవర్ గ్రూప్ తెలిపింది. జూన్ నాటికల్లా తమ నియామకాలు ప్రీ-కొవిడ్ స్థాయికి పెరగనున్నాయని సర్వేలో పాల్గొన్న 27 శాతం కంపెనీ యాజమాన్యాలు తెలిపాయి. ఈ సంవత్సరాంతానికల్లా నియామకాలను పునఃప్రారంభించనున్నట్లు 56 శాతం కంపెనీలు వెల్లడించాయి.

అప్రెంటి్‌సలపై కంపెనీల ఆసక్తి : ఈ ఏడాది ప్రథమార్ధంలో అప్రెంటి్‌సలకు అవకాశాలు పెరగనున్నాయని టీమ్‌లీజ్ వెల్లడించింది. ఈ ఏడాది ప్రథమార్ధంలో అప్రెంటిస్‌ల నియామకాలను పెంచే యోచనలో ఉన్నట్లు తమ సర్వేలో పాల్గొన్న 58 శాతానికి పైగా కంపెనీలు తెలిపాయని ఆ నివేదిక తెలిపింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే, మహిళా అప్రెంటి్‌సలకు ప్రాధాన్యం 10 శాతం పెరిగిందని పేర్కొంది.
జూన్ నాటికి 2,500 నియామకాలు: వేదాంతు కంపెనీ తదుపరి దశ వృద్ధికి దోహదపడేలా ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో 2,500 ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు ప్రముఖ ఎడ్యుటెక్ యాప్ కంపెనీ వేదాంతు ప్రకటించింది. ప్రస్తుతం ఈ కంపెనీలో 6,000 మంది పనిచేస్తున్నారు. ఈ ఏడాది ప్రథమార్ధం ముగిసే నాటికి కంపెనీ ఉద్యోగుల సంఖ్యను 8,500కు పెంచుకోవాలనుకుంటోంది.