హీరోల కొడుకులు, నిర్మాతల కొడుకులే ఇంతవరకూ హీరోలయ్యారు. దక్షిణాది భాషలలో హీరోయిన్ కొడుకులు హీరోలుగా వచ్చిన సందర్భాలు చాలా అరుదు. మొదటిసారి తెలుగులో పాపులర్ అయిన ఓ హీరోయిన్ తనయుడు హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు. ఆ అబ్బాయి పేరే…రోహిత్ కృష్ణ. ఈ రోహిత్ కృష్ణ ఎవరో కాదు.. ‘శంకరాభరణం’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి అందరికీ సుపరిచితమైన శారద పాత్రధారి రాజ్యలక్ష్మి తనయుడు. రోహిత్ కృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతోన్న చిత్ర విశేషాలను ఆంధ్రజ్యోతి ఎక్స్‌క్లూజివ్‌గా అందిస్తోంది.

శంకరాభరణం’ చిత్రం తర్వాత వందలాది చిత్రాలలో నటించిన రాజ్యలక్ష్మి పెద్ద కొడుకు రోహిత్ కృష్ణ హీరోగా ఇప్పుడు ఓ చిత్రం రూపొందుతోంది. పూర్తి గ్రామీణ వాతావరణంలో ఓ విలక్షణమైన కథతో, విభిన్నశైలిలో రూపొందుతున్న కారణంగా ఈ చిత్రానికి ‘పల్లెగూటికి పండగొచ్చింది’ అనే కవితాత్మకమైన టైటిల్‌ని పెట్టాలని చిత్ర దర్శకనిర్మాత తిరుమలరావు కంచరాన నిర్ణయించారు. రోహిత్ కృష్ణ హీరోగా రూపొందుతున్న ‘పల్లెగూటికి పండగొచ్చింది’ చిత్రం ఖర్చుకి, బడ్జెట్‌కి ఏమాత్రం రాజీపడకుండా తిరుమలరావు కంచరాన భారీ తారాగణంతోనే రూపొందిస్తున్నారు. రోహిత్‌కి ఫాదర్‌గా సుమన్ నటిస్తుండగా.. షాయాజీషిండే, అన్నపూర్ణ, జబర్దస్త్ బ్యాచ్‌లో క్రేజ్ ఉన్న వారందరినీ ఈ చిత్రంలోని పాత్రలకి ఎంపిక చేశారు.
దర్మకనిర్మాత తిరుమలరావు కంచరాన పలాసకు చెందిన వ్యక్తి కావడం చేత సినిమాలోని సన్నివేశాలలో అధికశాతం పలాస ప్రాంతంలోనే చిత్రీకరించారు. పూర్తి పల్లెటూరులోనే టాకీపార్ట్, పాటలు కూడా షూట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే విడుదల తేదీ కూడా ఖరారు కానుంది. శంకరాభరణం వచ్చి ఫిబ్రవరి రెండో తేదీకి పూర్తిగా 41 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ చిత్రం సాధించిన ఘనవిజయ పరిమళాలు ఇంకా ఇప్పటికీ ఇగిరిపోలేదు.
ఇన్నాళ్ళకి, ఇన్నేళ్ళకి శంకరాభరణం టైటిల్‌ని ఇంటిపేరుగా మార్చుకున్న రాజ్యలక్ష్మి ఇంటినుండి ఓ యువతరంగం తెరమీదకి ఉరకబోతున్నాడు. ఆల్ ద బెస్ట్.. రోహిత్ కృష్ణ అండ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్.. తిరుమలరావు కంచరాన. ఈ చిత్రానికి నందమూరి హరి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా.. ప్రతీక్ నాగనాధం సంగీతం, సినిమాటోగ్రఫీ పి. రవికుమార్ అందిస్తున్నారు.