ఎట్టకేలకు దళాల ఉపసంహరణ

0
147
Spread the love

తూర్పు లద్దాఖ్‌లో నెలల తరబడి ఘర్షణ తరువాత ఎట్టకేలకు భారత్‌ , చైనాలు రెండూ తమ దళాలను ఉపసంహరించడం మొదలుపెట్టాయి. ‘పాంగాంగ్‌ సరస్సు దక్షిణ, ఉత్తర తీరాల వద్ద మోహరించిన దళాలను బుధవారంనుంచి ఏకకాలంలో, ఓ క్రమరీతిన ఉపసంహరించడాన్ని రెండు దేశాలూ మొదలుపెట్టాయి’ అని చైనా రక్షణ శాఖ ప్రతినిధి సీనియర్‌ కల్నల్‌ వూ క్వియాన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ పరిణామాన్ని ధ్రువీకరిస్తూ భారత్‌ ఎలాంటి ప్రకటనా చేయలేదు. కిందటి నెలలో చైనా అఽధీనంలో ఉన్న మాల్డో ఛుషుల్‌ ఏరియాలో జరిగిన కాప్స్‌ కమాండర్‌ స్థాయి 9వ రౌండ్‌ చర్చల్లో కుదిరిన అంగీకారం మేరకు ఈ ఉపసంహరణ మొదలైనట్లు క్వియాన్‌ పేర్కొన్నారు. పాంగాంగ్‌ సరస్సుపై అధికారం తమదంటే తమదని రెండు దేశాలూ ఎన్నాళ్లగానో వాదిస్తున్నాయి. తాజా ఉపసంహరణ ప్రకారం… చైనా దళాలు తిరిగి తమ పూర్వ స్థానానికి అంటే ఫింగర్‌ 8కి ఆవలకు వెళ్లిపోతాయి. భారత దళాలు ఫింగర్‌ 2-3 మధ్య నున్న ధన్‌సింగ్‌ థాపా పోస్టు వద్దకు మరలుతాయి. ఫింగర్‌ 4 వరకూ రెండు దేశాల దళాలూ ఎలాంటి గస్తీ చేపట్టబోవు. ఫింగర్‌ 8ను రెండు దేశాల మధ్య వాస్తవాధీనరేఖ (ఎల్‌వోఏసీ) గా భారత్‌ గుర్తిస్తోంది. దీనిని డ్రాగన్‌ అంగీకరించడం లేదు.

నిరుడు మే నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్క పెట్టున పెరిగాయి. జూన్‌ 14 రాత్రి గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన సైనికులు బరిసెలతో, ప్రాచీన మారణాయుధాలతో, రాళ్లతో దాడి చేసి 20 మంది భారత సైనికులను చంపారు. భారత్‌ కూడా జరిపిన ఎదురుదాడిలో సుమారు 44 మంది సైనికులను డ్రాగన్‌ పోగొట్టుకుంది. ఈ ఘర్షణ వాతావరణం తొమ్మిది నెలలపాటు సాగింది. సైనిక, దౌత్యస్థాయుల్లో జరిగిన అనేక సమావేశాల తరువాత ఈ ఉపసంహరణ మొదలైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here