కథ:
కండోమ్‌ల అమ్మకం కొనసాగిస్తూ జీవించే ప్లేబాయ్ ఫణి భూపాల్(జగపతిబాబు) కు, అతనికి విరుద్ధమైన పాత్ర అంటే రాముడు మంచి బాలుడు అనే తరహాలో కొడుకు కార్తీక్(రామ్ కార్తీక్) ఉంటాడు. కార్తీక్, ఉమా(అభిరామి) అనే అల్రెడీ నిశ్చితార్థం జరిగిన అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కూడా కార్తీక్‌ని ఇష్టపడుతుంది. కానీ వీరిద్దరి ప్రేమ చిగురించే క్రమంలో ప్లేబాయ్ ఫణి భూపాల్ వల్ల జరిగిన ఓ సంఘటనతో కార్తీక్‌ని ఉమా ధ్వేషిస్తుంది. ఆ సంఘటన ఏమిటి? ఫణి భూపాల్, కార్తీక్, ఉమా జీవితాలను చిట్టి అనే చిన్న పాప ఎలా ప్రభావితం చేసింది? చిట్టి ఎవరు? చివరికి కార్తీక్, ఉమా ఒక్కటయ్యారా? అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
ఒకప్పుడు హీరోగా లేడీస్ మనసు దోచిన జగపతిబాబు.. ఇప్పుడు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా క్షణం తీరికలేని నటుడిగా మారిపోయారు. ఏ పాత్ర అయినా జగపతిబాబుకు కొట్టినపిండే. ఈ సినిమాలో కూడా ఆయన మిడిల్ ఏజ్‌డ్ ప్లే బాయ్‌గా ఆకట్టుకున్నారు. ఆయన సాల్ట్ అండ్ పెప్పర్ లుక్, యాటిట్యూడ్ అంతా వావ్ అనేలా ఉంటాయి. ఇటువంటి చిలిపి పాత్ర ఈ మధ్య కాలంలో జగపతిబాబు అయితే చేయలేదు. కాస్త కొత్తగా ఉంటుందనే జగపతిబాబు ఈ సినిమా అంగీకరించి ఉంటాడు. ఆయన పరంగా ఎటువంటి వంక పెట్టాల్సిన పని లేదు. అలాగే మిగతా మెయిన్ మూడు పాత్రలు, ఉమా, కార్తీక్, చిట్టి పాత్రలు కూడా చక్కగా మెప్పిస్తాయి. నటనపరంగా నాలుగు మెయిన్ పాత్రలు ఎక్కడా తగ్గలేదు. ఇతర పాత్రల్లో చేసిన వారు కూడా వారి పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక పరంగా ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు ప్లస్. పాటలు కూడా పరవాలేదు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కత్తెర పడాల్సింది. అయితే జగపతిబాబు వంటి నటుడిని దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేదనిపిస్తుంది. ఆయన పాత్రని ఇంకాస్త హైలెట్ చేయవచ్చు. దర్శకుడు తీసుకున్న మెయిన్ పాయింట్‌తో ఇది వరకు వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్‌కి మంచి విజయాలనే అందించాయి. దీనికి బోల్డ్ పాయింట్‌ని కూడా దర్శకుడు జోడించాడు. స్ర్కీన్‌ప్లే విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది. నిర్మాణ సంస్థని పదే పదే గుర్తు చేసుకున్నట్లు ఉన్నాడు. అందుకే బోల్డ్ కంటెంట్‌ని కూడా చాలా పద్ధతిగా మూవ్ చేయించాడు. ప్రేక్షకులు ఈ మూవ్‌కి కనెక్ట్ కావడానికి చాలా టైమ్ పడుతుంది. అలాగే స్క్రీన్‌ప్లే గ్రిప్ తప్పింది. ప్రతి సీన్ ప్రేక్షకులకు ముందే తెలిసిపోతుంది. ఈ కథని ఆసక్తికరంగా చెప్పే మార్గం ఉన్నా.. దర్శకుడు ఆ దారిలో వెళ్లలేదు. బహుశా.. అడల్ట్ కంటెంట్ అనే పేరు వస్తే.. తన చిత్రానికి ఇబ్బంది అనుకున్నాడేమో తెలియదు కానీ.. అడల్ట్ కంటెంట్‌ని కూడా ఓ కీర్తనలా చెప్పే ప్రయత్నం చేశాడు. అలా కాకుండా కథలో ఉన్న కాన్‌ఫ్లిక్ట్ మీద కరెక్ట్‌గా దృష్టి పెట్టి ఉంటే.. ఈ సినిమా గురించే ఇప్పుడంతా చర్చలు జరుగుతుండేవి. మంచి అవకాశాన్ని దర్శకుడు మిస్సయ్యాడా? అని అనిపించకమానదు. నిర్మాణం పరంగా ఓ బ్యూటీఫుల్ సినిమా చూస్తున్నట్లు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు అంత బాగున్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ చిత్రంలో జగపతిబాబు కొత్తగా కనిపిస్తాడు. ఆయన కోసం ఈ సినిమా చూడొచ్చు.