వ్యవసాయరంగానికి బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేశారు. ఏ ఇతర శాఖలకు, రంగాలకు కేటాయించని రీతిలో, వ్యవసాయశాఖకు రికార్డు స్థాయిలో రూ. 25 వేల కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేయటం గమనార్హం. ఏటికేడు వ్యవసాయరంగానికి బడ్జెట్ కోటా పెరుగుతూ వస్తోంది. నిరుటి బడ్జెట్(2020- 21) లో రూ. 24,117 కోట్లు కేటాయించగా, (2019- 20) బడ్జెట్‌లో రూ. 20,566 కోట్లు వ్యవసాయరంగానికి కేటాయించారు.

గత బడ్జెట్‌తో పోలిస్తే రూ. 884 కోట్లు, ముందటేడు బడ్జెట్‌తో పోలిస్తే రూ. 4,434 కోట్లు అదనంగా ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేయటం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలకు సరిపడా నిధులు కేటాయిస్తూనే ఈసారి అదనంగా ఆయిల్ పామ్, వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ కేటాయింపులు చేయటం గమనార్హం. కాగా, రైతుబంధుకు రూ. 14,800 కోట్లు కేటాయించారు. అంటే గత బడ్జెట్ కంటే రూ.64 కోట్లు అదనంగా కేటాయించారు.
వ్యవసాయ యాంత్రీకరణకు మోక్షం: వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా ఎలాంటి నిధుల కేటాయింపులు చేయటంలేదు. కానీ ఈ బడ్జెట్‌లో వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి ఈ బడ్జెట్‌లో రూ. 1,500 కోట్లు కేటాయించారు.
రుణమాఫీకి అరకొర నిధులు : రుణమాఫీ పథకం రెండేళ్లు దాటినా కొలిక్కిరావటంలేదు. రూ. 25 వేల లోపు బకాయిలు ఉన్న 2.95 లక్షల మంది రైతులకు రూ. 409 కోట్లు పంపిణీ చేశారు. మిగిలిన రూ. 801 కోట్లను ప్రభుత్వం తిరిగి తీసుకొంది. మిగిలిన రైతులకు నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని చెప్పారు. కానీ 2020- 21 లో రూ. 25 వేల కంటే ఎక్కువ బకాయిలున్న వారికి మొదటి విడత మాఫీ చేయలేదు. కరోనా నేపథ్యంలో చేయలేదని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు రూ. 25 వేల కంటే ఎక్కువ బకాయి ఉన్నవారికోసం రూ. 5,225 కోట్లు కేటాయించారు. ఈ రైతుల సంఖ్య సుమారు 35 లక్షలు ఉంది. వీరికి రూ. 25 వేల కోట్లు అవసరం అవుతాయి. మూడేళ్లలో ఈ బకాయిలు పూర్తిచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
రైతాంగానికి ఏటికేడు పెరుగుతున్న కేటాయింపులు
రైతు బంధు 14,800
రైతు బీమా 1,200
రుణమాఫీ 5,225 ( కోట్లలో)