ఎస్‌ఈసీగా శామ్యూల్‌ వద్దు

0
148
Spread the love

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ముఖ్యమంత్రి సలహాదారు శామ్యూల్‌ పేరును అంగీకరించవద్దని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేసింది. ఆయన సీఎం జగన్మోహన్‌రెడ్డి అవినీతి కేసుల్లో సహనిందితుడిగా ఉన్నారని.. అలాంటి వ్యక్తికి రాజ్యాంగబద్ధ పదవులు ఇవ్వడం సరైన సంప్రదాయం కాదని, ఈ విషయంలో గవర్నర్‌ తన విచక్షణను ఉపయోగించాలని కోరింది. టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య బుధవారమిక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ స్థానంలో కొత్త ఎన్నికల కమిషనర్‌ నియామకం కోసం వైసీపీ ప్రభుత్వం మూడు పేర్లు పంపిందని, అందులో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి శామ్యూల్‌ నియామకానికి లాబీయింగ్‌ చేస్తోందని పత్రికల్లో వార్తలు వచ్చాయని చెప్పారు.

‘వాన్‌పిక్‌ ప్రాజెక్టు పేరుతో జరిగిన భారీ భూ కుంభకోణంపై సీబీఐ నమోదు చేసిన కేసులో జగన్‌రెడ్డి మొదటి నిందితుడైతే.. శామ్యూల్‌ ఎనిమిదో నిందితుడు. ఇందూ టెక్‌ జోన్‌ కుంభకోణంపై సీబీఐ నమోదు చేసిన మరో కేసులో కూడా ఆయన పదో నిందితుడు. తన అవినీతి కేసుల్లో ఉన్న వారికి ముఖ్యమంత్రి అధికార పదవుల్లో పునరావాసం కల్పిస్తున్నారు. వారితో రాష్ట్రప్రభుత్వం కిక్కిరిసిపోతోంది. ఇప్పుడు ఏకంగా రాజ్యాంగబద్ధ పదవులే కట్టబెట్టాలని చూస్తున్నారు. ప్రతి శుక్రవారం ముఖ్యమంత్రితోపాటు సీబీఐ కోర్టుకు నిందితుడిగా హాజరయ్యే వ్యక్తి రాజ్యాంగ పదవిలో ఎలా ఉంటారు? జగన్‌తో పాటు కోర్టుకు హాజరు కావడమే ఆయన అర్హతా? ఎన్నికల కమిషనర్‌గా నిష్పక్షపాతంగా ఎలా పనిచేస్తారు? అందుకే ఆయన పేరు పక్కన పెట్టాలని గవర్నర్‌ను కోరుతున్నాం’ అని తెలిపారు. గతంలో నిమ్మగడ్డను అర్ధాంతరంగా తొలగించాలని చూసినప్పుడు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ కనగరాజ్‌ను తీసుకొచ్చారని, ఇప్పుడాయన ఎందుకు పనికిరాకుండా పోయారని ప్రశ్నించారు.

జస్టిస్‌ కనగరాజ్‌ను నియమించినప్పుడు ఆయన దళితుడని.. న్యాయ కోవిదుడని.. నిష్పక్షపాతంగా విధులు నిర్వహించగలిగే సామర్థ్యం ఉందని వైసీపీ నేతలు తెగ పొగిడారని, ఆయన నియామకానికి చంద్రబాబు అడ్డుపడుతున్నారని విరుచుకుపడ్డారని.. ఇప్పుడు ఆయన పేరును కనీసం ప్రతిపాదనకు కూడా తీసుకోలేదని ఆక్షేపించారు. తన సొంత సోదరి షర్మిల కంటే కూడా జగన్‌రెడ్డికి తన కేసుల్లో సహనిందితురాలిగా ఉన్న ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి ముఖ్యమయ్యారని, కేంద్ర పెద్దల కాళ్లపై పడి ఆమెను తెలంగాణ నుంచి తెచ్చి ప్రమోషన్లపై ప్రమోషన్లు ఇస్తున్నారని విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here