ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమరావతి హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (SEC) నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) విషయంలో కోర్టు మొట్టికాయలు పెట్టింది. ఈ సందర్భంగా కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్‍ఈసీకి ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని మండిపడింది. “మీకు ఇష్టంలేదని వ్యక్తిని తీసేస్తే అతనికి న్యాయబద్ధంగా పనిచేసే అవకాశం కల్పిస్తే… మీరు ఈ విధంగా వ్యవహరిస్తారా” అని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు (Andhra Pradesh High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధ సంస్థల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్న హైకోర్టు… ప్రభుత్వాలు వస్తాయి, వెళ్తాయి.. రాజ్యాంగబద్ద సంస్థలు ఎప్పుడూ పనిచేస్తాయి అని యూనివర్శల్ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాలన్న హైకోర్టు… దీనిపై 3 రోజుల్లో సమగ్రమైన నివేదిక ఇవ్వాలని కోరింది.
రాష్ట్ర ప్రభుత్వం ఎస్‍ఈసీకి కావాల్సిన సౌకర్యాలు, ఏర్పాట్లు చేయాలన్న హైకోర్టు… జస్టిస్ కనగరాజ్ కోసం ఖర్చు పెట్టిన డబ్బుల్ని ఈసీ చెల్లించక్కర్లేదని స్పష్టం చేసింది. కనగరాజ్ ఆ డబ్బులను తాను వ్యక్తిగతంగా చెల్లించాలని తెలిపింది. కనగరాజ్ డబ్బుల విషయాన్ని ఈసీ పరిశీలించాలన్న హైకోర్టు… ఆయన లీగల్ ఖర్చులకు ఎస్‍ఈసీ ఎందుకు డబ్బులు ఇవ్వాలని ప్రశ్నించింది. అన్ని అంశాలపై ప్రభుత్వానికి ఎస్‍ఈసీ మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలంది. ఎస్‍ఈసీ నివేదికను బట్టి ప్రభుత్వం కావాల్సిన ఏర్పాట్లు చేయాలనీ… లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హైకోర్టు హెచ్చరించింది.
రాష్ట్ర ప్రభుత్వానికీ… ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య చాలా కాలంగా ఘర్షణ వాతావరణం ఉంది. కరోనా వచ్చిన కొత్తలో స్థానిక సంస్థల ఎన్నికలను జరిపించేందుకు నిమ్మగడ్డ ఒప్పుకోలేదు. దాంతో… ఆయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ… ఆయన పదవీకాలాన్ని తగ్గిస్తూ… ప్రభుత్వం… ఆయన స్థానంలో… తమిళనాడు నుంచి జస్టిస్ కనగరాజ్‌ను రప్పించి… ఆయన్ని ఎస్‌ఈసీగా మార్చింది. దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్… న్యాయ చేయడంతో… తిరిగి ఆయనకే ఆ పదవి దక్కింది. ఇప్పుడు కూడా కరోనా ఉన్నా… దాని తీవ్రత తగ్గిందంటూ… స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు రమేష్ కుమార్ సిద్ధమవుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికలని వాయిదా వెయ్యాలని కోరుతోంది. ఇలా నిప్పు-ఉప్పులా సాగుతోంది వ్యవహారం. ఈ క్రమంలో ప్రభుత్వం ఎస్ ఈసీకి సహకరించాలని ఆదేశిస్తూ… హైకోర్టు తాజాగా మండిపడింది.