ఏపీ రైతుకు ఏమిచ్చారు!

0
289
Spread the love

వ్యవసాయ చట్టాలపై ఉద్యమాలు నడుస్తున్న వేళ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక బడ్జెట్‌పై సహజంగానే రైతులు ఆసక్తి చూపించారు.

నిరుడు ఆంధ్రా నుంచి ఢిల్లీకి కేంద్రం కిసాన్‌రైలును ప్రారంభించింది. దక్షిణాదిలో నడిచిన తొలి రైలు ఇదే. అయితే, తాజా బడ్జెట్‌లో కిసాన్‌ రైలు ఊసే మరిచారు. గ్రామీణ మౌలిక సదుపాయాల నిధిని రూ.30వేల కోట్ల నుంచి రూ.40వేల కోట్లకు పెంచారు. వ్యవసాయోత్పత్తుల క్రయవిక్రయాల్లో పారదర్శకత, పోటీతత్వాన్ని పెంచిన ఈ-నామ్‌ విధానంలోకి దేశంలోని వెయ్యి మండీలను తెచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22యార్డుల్లోనే ఈనామ్‌ విధానం ఉంది.

తాజా నిర్ణయంతో మరికొన్ని మండీల్లో ఈ విధానంలో లావాదేవీలు జరగనున్నాయి. ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ కింద పంటకు పెట్టుబడి సాయంగా కేంద్రం ఇచ్చే రూ.6వేలను రూ.10వేలకు పెంచుతారని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. దేశంలో సూక్ష్మసేద్యానికి ఊతమిచ్చేలా నాబార్డు కింద మైక్రో ఇరిగేషన్‌ కార్పస్‌ ఫండ్‌ను రూ.5వేల కోట్ల నుంచి రూ.10వేల కోట్లకు బడ్జెట్‌లో పెంచారు. కానీ దాని ఫలితం రాష్ట్రంలో ప్రశ్నార్ధకమౌతోంది. 2019-20,2020-21 కింద సూక్ష్మ సేద్యానికి కేంద్రం నిధులిచ్చినా, రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇంత వరకు విడుదల చేయలేదు. రైతులకు రాయితీ పరికరాలు అందజేసిన 32కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.800 కోట్లు వరకు బిల్లులు పెండింగ్‌లో పెట్టింది.

దీంతో ఉద్యాన తోటల సాగుకు ప్రోత్సాహం కరువైంది. కేంద్రం నిధులు పెంచినా, జగన్‌ సర్కారు సూక్ష్మసేద్యాన్ని ప్రోత్సహిస్తుందా? రైతులకు ప్రయోజనం దక్కుతుందా? అనే సందేఽహం వ్యవసాయదారుల్లో వ్యక్తమౌతోంది. దేశంలో కొత్తగా వ్యవసాయ సదుపాయాలు, అభివృద్ధి సెస్‌ని(ఏఐడీసీ) అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ముడి పామాయిల్‌, సోయాబిన్‌, సన్‌ఫ్లవర్‌ నూనెలతో పాటు శనగలపై అగ్రి సెస్‌ విధించింది. క్రూడ్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌ విభాగంలో పామాయిల్‌, సోయాబిన్‌, సన్‌ఫ్లవర్‌లపై 15ు, శనగలపై 10ు అగ్రి సెస్‌ వసూలు చేయనున్నది. ఈ కారణంగా వంట నూనెల ధరలు మరింత పెరగనున్నాయి. కాగా పత్తిపై 5ు, పత్తి వ్యర్థాలపై 10ు కస్టమ్‌ సుంకాన్ని కేంద్రం విధించింది. ముడి పట్టు, పట్టు నూలుపై కస్టమ్‌ సుంకాన్ని మరో5ు పెంచింది. దీంతో పట్టుపై 15ు సుంకం పడనుంది. పశువుల దాణాపై 5ు కస్టమ్‌ సుంకాన్ని తగ్గించి, రొయ్యల దాణాపై 10ు సుంకాన్ని పెంచింది.

వ్యవసాయాంశాలు పర్వాలేదు

ఇక మన రాష్ట్రానికి వస్తే.. ప్రత్యేకంగా ఇచ్చిందేమీ లేకపోయినా దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన ఎన్నెన్నో వ్యవసాయ సంబంధ అంశాలు బలంగానే రాష్ట్ర సాగురంగాన్ని తాకాయి. ‘ఆపరేషన్‌ గ్రీన్‌ స్కీమ్‌’ను మరో 22 రకాల పెరిషబుల్‌ ప్రొడక్టులను (త్వరగా పాడయ్యే ఉత్పత్తులకు) కేంద్ర ఆర్థిక బడ్జెట్‌లో విస్తరించారు. ఈ పథకంలో కొత్తగా టమాటా, ఉల్లి, బంగాళదుంప ఉత్పత్తులను చేర్చారు. రాష్ట్రంలో ఉల్లి, టమాట రైతులు ఏటా పంట నష్టాలు, ధరల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉల్లి పంట మార్కెట్‌కు వచ్చినప్పుడు ధర తగ్గుతోంది. ఆ తర్వాత దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. టమాటా పంట మార్కెట్‌కు వచ్చినప్పుడు కిలో పావలాకు కూడా కొనే దిక్కుంటడం లేదు. ఉత్పత్తి తగ్గినప్పుడు ధర పెరుగుతోంది. కానీ రైతులకు మాత్రం ఫలితం ఉండడం లేదు. కేవలం వ్యాపారులకే ప్రయోజనం దక్కుతోంది. ఆపరేషన్‌ గ్రీన్‌ స్కీమ్‌ పరిధిలోకి ఉల్లి, టమాటా తేవడం వల్ల రైతులకు కొంత ఊరట లభించే అవకాశం ఉందని మార్కెటింగ్‌ అధికారులు చెబుతున్నారు. ‘ఆపరేషన్‌ గ్రీన్‌ స్కీమ్‌’తో మార్కెటింగ్‌లో ప్రభుత్వ జోక్యానికి వీలు కలుగుతుంది. రైతులు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసినప్పుడు రవాణాలో రాయితీలు లభిస్తాయి.

విశాఖలో ఫిషింగ్‌ హార్బర్‌

విశాఖపట్నంలో మోడరన్‌ ఫిషింగ్‌ హార్బర్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా ఫిషింగ్‌ హార్బర్‌, ఇన్‌ల్యాండ్‌ ఫిషింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు పెట్టుబడులుపెట్టనుంది. నదుల ఒడ్డున కూడా ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనివల్ల మత్స్యకారుల ఉపాధి మెరుగుపడుతుందని అభిప్రాయపడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here