
సొంత దేశంలో ఎక్కడైనా విల్లా, ఫ్లాట్ లేదా ప్లాటు కొనాలి!’
ఈ ఆలోచన వచ్చిందే తడవుగా ప్రవాస భారతీయులు ఇంటర్నెట్‌లో ‘ప్రాపర్టీ సెర్చ్’ మొదలు పెడుతున్నారు. 75 శాతం మంది దక్షిణాది రాష్ట్రాల చుట్టూనే తిరుగుతున్నారు. అందులోనూ… కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణకే జై కొడుతున్నారు. మరి… ఆంధ్రప్రదేశ్ మాటేమిటి? అని ప్రశ్నిస్తే… ‘‘అక్కడేముందని పెట్టుబడులు పెడతాం!’’ అని పెదవి విరుస్తున్నారు. కామన్‌ఫ్లోర్ (క్వికర్) అనే ప్రముఖ రియల్టీ వెబ్‌సైట్ ఈ అధ్యయనం చేసింది. ప్రవాస భారతీయులు గత ఏడాది జరిపిన ‘ప్రాపర్టీ సెర్చ్’ను క్రోడీకరించింది. ‘స్వదేశంలో ఏ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు?’ అనే వివరాలను విశ్లేషించింది. దీని ప్రకారం… ప్రవాస భారతీయులు 75 శాతం మంది దక్షిణాది రాష్ట్రాలపైనే దృష్టి సారించారు.
ఇక్కడ ఇంటి స్థలం లేదా ఫ్లాటు కొనుగోలు కోసం ‘సెర్చ్’ చేశారు. అందులోనూ… అత్యధికులు కర్ణాటకవైపు మొగ్గు చూపించారు. స్వదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకుని ప్రాపర్టీ సెర్చ్ చేసిన ప్రవాసుల్లో అమెరికాలో స్థిరపడిన వారే ఎక్కువమంది. ఆ తర్వాతి స్థానం… యూఏఈ, బ్రిటన్‌లలోని ఎన్‌ఆర్‌ఐలు ఉన్నారు. 31 శాతం మంది కర్ణాటకలో ప్రాపర్టీ కొనుగోలుపై ఆరా తీశారు. ఆ తర్వాత… 20 శాతంతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. కేరళలో కొనుగోళ్ల గురించి 11 శాతం, తెలంగాణలో కొనడంపై 9 శాతం మంది ప్రాపర్టీ సెర్చ్ చేశారు. అమెరికాతోసహా అనేక దేశాల్లో సీమాంధ్రులు లక్షల సంఖ్యల్లోనే స్థిరపడ్డారు. అయినప్పటికీ… ఎన్‌ఆర్‌ఐ ప్రాపర్టీ సెర్చ్‌లో ఆంధ్రప్రదేశ్ కనిపించకపోవడంపై ‘కామన్‌ఫ్లోర్’ వెబ్‌సైట్ విస్మయం వ్యక్తం చేసింది.
మారిన చిత్రం
ఎన్నికల ముందు… అమరావతితోపాటు సీమాంధ్రపై ‘ప్రవాసులు’ ప్రత్యేక ఆసక్తి కనపరిచారు. అమరావతిలో ఎన్‌ఆర్‌ఐ టవర్స్ పేరిట ప్రవాసాంధ్రుల కోసమే ఒక ప్రత్యేక ప్రాజెక్టు! అందులో ప్లాట్లు సొంతం చేసుకునేందుకు ప్రవాసులు పోటీపడ్డారు! అమరావతిలో ‘హ్యాపీనెస్ట్’ ప్రాజెక్టులో అపార్ట్‌మెంట్లు హాట్ కేకుల్లా బుక్ అయ్యాయి. అందులోనూ… ప్రవాసాంధ్రులు అనేక మంది ఇక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేశారు. ఇక… అమరావతిలోని వివిధ ప్రాజెక్టుల పట్ల ప్రవాస భారతీయులు ఎందరో ప్రత్యేక ఆసక్తి చూపించారు. ‘నవ్యాంధ్రలో రియల్టీకి మంచి భవిష్యత్తు ఉంది’ అంటూ రాష్ట్రవ్యాప్తంగా ఇతర నగరాల్లోనూ పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు ఏపీ వైపు ప్రవాసులు చూడటంలేదని తేలింది. 2014-2019 మధ్య విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లోనూ రియల్టీ రంగం పరుగులు తీసింది.
రాష్ట్రంతోపాటు దేశవిదేశాల్లోని ఎందరెందరో రాష్ట్రంలో స్థిరాస్తుల కొనుగోలుకు అమితాసక్తి చూపారు. రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా జాతీయస్థాయిలో పేరొందిన ఎన్నెన్నో రియల్టీ సంస్థలు, నిర్మాణ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ అమరావతిని అటకెక్కించేసింది. ‘మూడు రాజధానుల’తో దాదాపుగా ఏడాది రాష్ట్రంలో అనిశ్చితి కొనసాగుతోంది. ‘‘ప్రాజెక్టులు, పెట్టుబడులకు సంబంధించి వైసీపీ సర్కారులో స్థిరమైన విధానాలు కనిపించడంలేదు. ఆంధ్రప్రదేశ్ అంటే పెట్టుబడులకు ఏమాత్రం అనుకూలమైనది కాదనే అభిప్రాయం నెలకొంది. కొత్తగా భారీ ప్రాజెక్టులేవీ రాకపోగా, ఉన్నవే వెళ్లిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో రియల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాసులు ఎందుకు ఆసక్తి చూపిస్తారు?’’ అని ఒక బిల్డర్ ప్రశ్నించారు.