ఐడీపీఎల్‌ కథ కంచికి!

0
198
Spread the love

ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీల్లో రెండింటిని మూసివేయడంతో పాటు మరో మూడింటిని ప్రైవేటీకరించనున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ తెలిపారు. ఔషధాల శాఖ పరిధిలో మొత్తం 5 ప్రభుత్వ రంగ కంపెనీలున్నాయి. అందులో ఇండియన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ (ఐడీపీఎల్‌), రాజస్థాన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌  (ఆర్‌డీపీఎల్‌)ను మూసివేయనున్నట్లు లోక్‌సభలో  మం త్రి వెల్లడించారు. అంతేకాదు, హిందుస్థాన్‌ యాంటీబయాటిక్స్‌ (హెచ్‌ఏఎల్‌), బెంగాల్‌ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ (బీసీపీఎల్‌), కర్ణాటక యాంటీబయాటిక్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ (కేఏపీఎల్‌)లో వ్యూహాత్మక వాటా విక్రయించనున్నట్లు చెప్పారు. అయితే, ఈ విషయంపై 2019 సెప్టెంబరు 9న ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఐడీపీఎల్‌, ఆర్‌డీపీఎల్‌ ఉద్యోగులందరికీ ప్రభుత్వం ఇప్పటికే స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) పథకాన్ని ఆఫర్‌ చేసిందన్నారు. 

ఐడీపీఎల్‌ గురించి.. 

గురుగ్రామ్‌ కేంద్రంగా 1961లో ప్రారంభమైన ఐడీపీఎల్‌.. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీ. ఈ బల్క్‌ డ్రగ్‌, ఔషధ ఆవిష్కరణ కంపెనీకి హైదరాబాద్‌తోపాటు గురుగ్రామ్‌, రిషికే్‌షలో ప్లాంట్లున్నాయి. చెన్నై, ముజఫ్ఫర్‌పూర్‌, భువనేశ్వర్‌లో అనుబంధ విభాగాలను కలిగి ఉంది. ప్రైవేట్‌ రంగం నుంచి పోటీ తట్టుకోలేక క్రమంగా నష్టాల్లోకి జారుకున్న ఐడీపీఎల్‌ ఆర్థికంగా దివాలా తీసింది.

హైదరాబాద్‌ ప్లాంట్‌ గురించి.. 

బాలానగర్‌, కూకట్‌పల్లి ప్రాంతాలకు చెందిన 891 ఎకరాల స్థలంలో ఐడీపీఎల్‌ హైదరాబాద్‌ యూనిట్‌ను ఏర్పా టు చేశారు. 1967లో ప్రారంభమైన ఈ ప్లాంట్‌లో దాదాపు 47 రకాల ఔషధాలు తయారయ్యేవి. అయితే, ఈ ప్లాంట్‌ ఇప్పటికే మూతపడింది. 1996 నుంచి బల్క్‌డ్రగ్‌, 2003 నుంచి ఫార్ములేషన్ల తయారీ నిలిచిపోయింది. 2007 అక్టోబరులో ఇందులోని రీసెర్చ్‌ సెంటర్‌లో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (నైపర్‌) కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఫార్మా గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ విద్యార్థులకు ఈ కేంద్రం శిక్షణనిస్తుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here