
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మంగళవారం 431 కేసులు నమోదవగా.. బుధవారం ఆ సంఖ్య 493కి పెరిగింది. ఈ ఏడాదిలో ఒకే రోజు ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్‌లో 138, జిల్లాల్లో 355 కేసులు రికార్డయ్యాయి. దీంతో పాజిటివ్‌ల సంఖ్య 3,04,791కి చేరింది. 157 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షల మంది(2,99,427) కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ శాతం 98.24గా ఉంది. బుధవారం నలుగురు కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,680కి చేరింది. బుధవారం 56,464 నమూనాలను పరీక్షించగా, 893 శాంపిళ్ల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 98,45,577 నమూనాలను పరీక్షించారు. ప్రస్తుతం 3,684 యాక్టివ్ కేసులున్నాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 138 కరోనా కేసులు నమోదయ్యాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 42, రంగారెడ్డిలో 35, నిజామాబాద్, సంగారెడ్డిలో 24 చొప్పున వచ్చాయి. కాగా, బుధవారం 32,350 మంది తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. దీంతో తొలి డోసు వేసుకున్న వారి సంఖ్య 8,18,776కి చేరింది. 2,151 మంది రెండో డోసు తీసుకోగా.. ఆ సంఖ్య 2,26,525 చేరింది.