గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ దాడులకు తెగబడుతోంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడు సర్పంచ్ స్థానాన్ని ఎస్సీ మహిళకు రిజర్వు చేశారు. ఇక్కడ నాలుగో విడతలో ఎన్నికల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ మద్దతుదారు జొన్నలగడ్డ మరియమ్మ… వైసీపీ మద్దతుతో జొన్నలగడ్డ మరియమ్మ (ఇద్దరివీ ఒకే పేర్లు) పోటీచేశారు. టీడీపీ మద్దతుదారు 124 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ వర్గీయులు సుమారు 60 మంది సోమవారం రాత్రి టీడీపీ వర్గీయుల గృహాలపైకి వచ్చి రాళ్లదాడి చేశారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ కర్రలు, ఇనుపరాడ్లు చేతబూని దాడికి పాల్పడారు. ఈ దాడిలో టీడీపీకి చెందిన గరికపాటి కృష్ణయ్య, శీలంనేని మహేష్, శీలంనేని లక్ష్మి, శీలంనేని విజయలక్ష్మితోపాటు పలువురికి గాయాలయ్యాయి. కృష్ణయ్య పరిస్థితి విషమంగా మారడంతో గుంటూరులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు.

నవీన్‌తోపాటు మరో 11 మందిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్‌ఐ సురేష్ తెలిపారు. కాగా, మంగళవారం కూలీలతో మిర్చి కోయిస్తున్న టీడీపీ కార్యకర్త కొండవీటి నటరాజ్‌పై వైసీపీకి చెందిన జొన్నలగడ్డ పిచ్చయ్య, పాలేటి ఇర్మియాలు కర్రలతో దాడిచేశారు. నటరాజ్ తలకు, శరీర భాగాలకు గాయాలవ్వగా సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. అలాగే, శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం రెండుచోట్ల ఇరువర్గాలు కొట్లాటకు దిగారు. జి.సిగడాం మండలం మెట్టవలస పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారు కామోజుల ఆరుద్ర గెలుపొందారు. దీన్ని జీర్ణించుకోలేని కొందరు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారు. దీనిని గ్రామస్థులు కొందరు ప్రశ్నించడంతో ఘర్షణ ప్రారంభమైంది. ఇరువర్గాల వారు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. 21 మంది గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. టి.తమ్మినాయుడు అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో టీడీపీ మద్దతుదారు అల్లుపల్లి రాంబాబు గెలుపొందారు. మంగళవారం పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఎనిమిది మంది గాయపడ్డారు.
పశ్చిమలో.. తల్లీకొడుకులపై దాడి
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని దుగ్గిరాలలో వైసీపీకి చెందిన మెండం సాగరవరప్రసాద్ పెద్దమ్మ మెండెం కుమారిని టీడీపీ బలపర్చడంతో వార్డు మెంబర్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఓడిపోయిన వైసీపీకి చెందిన జాలా రాజు, సరిహద్దుల ఆనంద్, సరిహద్దుల రాములు, సంజీవ్ వారి అనుచరులు కలసి సాగర్, అతని తల్లిని సోమవారం రాత్రి కొట్టి గాయపరిచారు. గాయాలపాలైన సాగర్‌ను ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. మరోవైపు సాగర్, అరుణ, జోసఫ్, తలారి మధుసూదనరావు తనను కొట్టి గాయపరిచారని అదే గ్రామానికి చెందిన గుడిపూడి కృష్ణకుమారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.