ఓటీపీ సేవలకు విఘాతం

0
162
Spread the love

 వాణిజ్య సందేశాల నియంత్రణ కు సంబంధించి ట్రాయ్‌ రూపొందించిన కొత్త నిబంధనలు అమల్లోకి రావడంతో సోమవారం నుంచి ఎస్సెమ్మెస్‌, ఓటీపీ సేవలకు విఘాతం కలుగుతోంది. దీంతో బ్యాంకు లావాదేవీలు, క్రెడిట్‌కార్డు చెల్లింపులు, రైల్వే టికెట్‌ బుకింగ్‌, కొవిన్‌ రిజిస్ట్రేషన్‌ తదితర సేవలు సరి గ్గా అందట్లేదు. వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో కొత్త నిబంధనల అమలును వారంపాటు వాయిదా వేస్తున్నట్టు ట్రాయ్‌ ప్రకటించిం ది. దేశంలో నిత్యం 100 కోట్ల వాణిజ్య సందేశాలు వినియోగదారులకు చేరతాయని అంచనా. వాటిలో 40ు సందేశాలు ఈ కొత్త నిబంధనల అమలు వల్ల వినియోగదారులకు చేరలేదు. సోమవారమే ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రముఖ ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకుల సందేశాల్లో దాదాపు 25 శాతం వినియోగదారులకు చేరలేదని సమాచారం. దీంతో ఇండియన్‌ బ్యాంకుల సమాఖ్య ట్రాయ్‌ను, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను సంప్రదించి..

ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాల్సిందిగా కోరాయి. కొత్త నిబంధనలు అమలు వారాంతాల్లో చేస్తే బాగుంటుందిగానీ, ఇలా వారం మొదటి నుంచి అమలు చేయడం మొదలుపెడితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశాయి. అయితే.. దీంట్లో తమ తప్పేమీ లేదని ట్రాయ్‌ అధికారులు చెబుతున్నారు. పదిహేను రోజుల ముందునుంచే తాము బ్యాంకులకు ఈ కొత్త నిబంధనల గురించి పదేపదే గుర్తుచేశామని వారు వివరించారు. ఎస్సెమ్మెస్‌, ఓటీపీ సేవలకు విఘాతం కలుగుతోందంటూ తమకు ఇంతవరకూ అధికారికంగా ఎలాంటి ఫిర్యాదూ రాలేదని చెప్పారు. అటు.. సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ జనరల్‌ ఎస్పీ కొచ్చర్‌ కూడా దీంట్లో తమ తప్పేమీ లేదని స్పష్టం చేశారు. మార్చి 7లోపు కంపెనీలు తమ ‘కంటెంట్‌ టెంప్లేట్‌’ను తమ వద్ద నమోదు చేసుకోవాల్సిందిగా సూచించామని ఆయన వివరించారు.

ఇదీ నేపథ్యం..

అవాంఛిత వాణిజ్య సందేశాలను, స్పామ్‌ కాల్స్‌ను నిరోధించడానికి ‘టెలికం కమర్షియల్‌ కమ్యూనికేషన్‌ కస్టమర్‌ ప్రిఫరెన్స్‌ రెగ్యులేషన్‌ (టీసీసీసీపీఆర్‌)ను అమల్లోకి తేవాలంటూ ఢిల్లీ హైకోర్టు కిందటి నెలలో ట్రాయ్‌ను ఆదేశించింది. దాని ప్రకారం ట్రాయ్‌ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఆర్థిక నేరగాళ్లు వాడే నకిలీ ఎస్సెమ్మెస్‌ హెడర్లను అడ్డుకునేలా ఈ నిబంధనలను రూపొందించింది. ఎస్సెమ్మెస్‌ హెడర్లంటే.. కంపెనీ పేరును సూచించేవి. ఉదాహరణకు.. సిటీ బ్యాంకు పంపే సందేశాల్లో కొన్ని ‘టీఎం-ఎ్‌సఐటీఐబీఏ’ అనే హెడర్‌తో వస్తాయి. ఇందులో టీఎం అనేది టెలికం ఆపరేటర్‌ను, సర్కిల్‌ను సూచిస్తుంది. దీన్ని రెండు అక్షరాల్లో సూచించాలి. ‘ఎస్‌ఐటీఐబీఏ’.. అంటే సిటీ బ్యాంక్‌ అని అర్థం. ఇది ఆరు అక్షరాలే ఉండాలి. చాలామంది ఆర్థిక నేరాళ్లు ఈ హెడర్లను వాడుతూ నకిలీ ఎస్సెమ్మె్‌సలు పంపి మోసం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. అలాంటి ఆర్థిక నేరగాళ్లను, టెలీమార్కెటీర్లను అడ్డుకోవడమే లక్ష్యంగా ట్రాయ్‌ కొత్త నిబంధనలను రూపొందించి అమల్లోకి తెచ్చింది. దాని ప్రకారం.. కంపెనీలు, టెలీమార్కెటీర్లు ‘డిస్ట్రిబ్యూటెడ్‌ లెడ్జర్‌ టెక్నాలజీ (డీఎల్‌టీ)’ కంపెనీల వద్ద నమోదు చేసుకోవాలి. ఎస్సెమ్మె్‌సలలో ఉండే సెండర్‌ ఐడీ, హెడర్‌ సమాచారాన్ని టెలికం కంపెనీలు ధ్రువీకరించుకున్నాకే ఆ ఎస్సెమ్మెస్‌ వెళ్లేలా ఏర్పాట్లు చేయాలి. కొత్త నిబంధనల ప్రకారం లేని వాణిజ్య సంస్థలను టెలికం కంపెనీలు సోమవారం నుంచి అడ్డుకుంటున్నాయి. దీనివల్ల యూపీఐ, ఆధార్‌ ఆధారిత చెల్లింపులు, నెట్‌బ్యాంకింగ్‌ సేవలకు విఘాతం కలుగుతోంది. దీనివల్ల వినియోగదారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుండడంతో ట్రాయ్‌ స్పందించి వాయిదా నిర్ణయాన్ని తీసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here