కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడానికి రూ. 13 లక్షలు లంచం తీసుకుంటుండగా.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ సర్పంచ్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన సాజిద్‌పాషా కుటుంబానికి మన్నెగూడ పంచాయతీ పరిధిలో వికారాబాద్ రోడ్డుపై 200 ఎకరాల భూమి ఉంది. రోడ్డుకు ఆనుకుని ఉన్న బిట్టులో.. వాణిజ్య సముదాయ నిర్మాణాన్ని ప్రారంభించారు. అదే సమయంలో పంచాయతీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. రూ. 20 లక్షలు ఇస్తేనే అనుమతి ఇస్తానంటూ సర్పంచ్ వినోద్‌గౌడ్ తేల్చి చెప్పాడు. దీంతో సాజిద్‌పాషా ఏసీబీని ఆశ్రయించారు. నగర శివార్లలో డబ్బు అందజేస్తానని సర్పంచ్‌కు కబురు పెట్టారు. హైదర్‌షాకోట్‌లోని ఆరెమైసమ్మ ఆలయం వద్దకు రప్పించారు. అక్కడ తన కారులో వినోద్‌గౌడ్‌కు రూ. 13 లక్షలు అందజేశారు. అప్పటికే అక్కడ వలపన్నిన ఏసీబీ అధికారులు.. వినోద్‌గౌడ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులను చూసిన పారిపోయేందుకు యత్నించాడు. దాంతో.. అధికారులు అతడిని వెంబడించి పట్టుకున్నారు. తదుపరి కెమికల్ పరీక్షలో.. పాజిటివ్ రావడంతో, అరెస్టు చేశారు. అదే సమయంలో.. ఏసీబీకి చెందిన మరో బృందం మన్నెగూడ పంచాయతీ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. కాగా.. ఏసీబీ అరెస్టు చేసిన వినోద్‌గౌడ్ గతంలో ఉత్తమ సర్పంచ్ అవార్డును అందుకోవడం గమనార్హం..!

ఏసీబీ వలలో ప్రజాప్రతినిధులు
జిల్లాలో పలువురు ప్రజాప్రతినిధులు ఏసీబీ కేసుల్లో చిక్కుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తాజాగా శుక్రవారం మన్నెగూడ సర్పంచ్ వినోద్‌గౌడ్ ఏసీబీకి చిక్కగా.. నెల రోజుల క్రితం మహేశ్వరం మండలం మన్‌సాన్‌పల్లి గ్రామ సర్పంచ్ భర్త, ఉప సర్పంచ్ లంచం తీసుటుంటూ పట్టుబడ్డారు. గతంలో.. ధారూర్ మండలం నాగారం గ్రామ సర్పంచ్ కూడా డబ్బులు తీసుకుంటూ అనినీతి నిరోధక శాఖకు చిక్కాడు.
సర్పంచ్ దంపతులే కూలీలుగా మారి!
భీమదేవరపల్లి: వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవ రపల్లి మండలం విశ్వనాథపురం సర్పంచ్ వల్లెపు అనిత, ఆమె భర్త రమేశ్ కూలీలుగా మారారు. గత ఏడాది గ్రామంలో రూ.20 లక్షలతో వైకుంఠధామం నిర్మాణ పనులు చేపట్టారు. వర్షాలకు ఆ నిర్మాణాలు కుంగిపోయాయి. విషయాన్ని కలెక్టర్ సహా అధికారులకు చెప్పినా ఎలాంటి సాయం అందకపోగా.. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని హుకుం జారీ చేశారు. చేసేది లేక సర్పంచ్ దంపతులు కూలీలుగా మారి పనులు చేస్తున్నారు.