కారు కావాలా? డబ్బు కావాలా?

0
165
Spread the love

ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో షాపింగ్‌ చేసిన కస్టమర్లనే లక్ష్యంగా చేసుకుంటారు.. బంపర్‌ ఆఫర్‌లో ఖరీదైన కార్లను బహుమతులుగా గెలుచుకున్నారంటూ బురిడీ కొట్టిస్తారు.. నమ్మించడానికి స్ర్కాచ్‌ కార్డులను ఇంటికి పంపిస్తారు.. అది నమ్మి ఎవరైనా చిక్కితే అంతే.. ప్రాసెసింగ్‌ ఫీజుల పేరుతో రూ.లక్షలు కొల్లగొడతారు. ఇలా కొత్త రకం సైబర్‌ మోసంతో వందలాది మందిని మోసం చేసి రూ.కోట్లు కొల్లగొడుతున్న అంతర్రాష్ట్ర ఝార్ఖండ్‌ సైబర్‌ ముఠా ఆటకట్టించారు సైబరాబాద్‌ పోలీసులు. 10 మందిని అరెస్టు చేశారు. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ సోమవారం మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు. సైబరాబాద్‌ ప్రాంతానికి చెందిన ఓ బాధితుడికి గతేడాది ఆగస్టులో కార్తీక్‌ అనే వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. ‘‘మీరు మా ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ నుంచి ఫలానా వస్తువు కొనుగోలు చేశారు.

కంపెనీ బంపర్‌ డ్రాలో బహుమతి గెలుచుకున్నారు. వివరాలు మీకు పోస్టులో పంపాము. లెటర్‌ అందిన తర్వాత ఫోన్‌ చేయండి’’ అన్నారు. చెప్పినట్లుగానే లేఖ వచ్చింది. అందులో స్ర్కాచ్‌ కార్డు ఉంది. ఓపెన్‌ చేస్తే అందులో టాటా సఫారీ కారు గెలుచుకున్నట్లు రాసి ఉంది. వెంటనే బాధితుడు లేఖలో ఉన్న నంబర్‌కు ఫోన్‌ చేశాడు. ‘‘కంగ్రాట్స్‌ సర్‌.. మీకు కారు కావాలా? అందుకు సమానమైన రూ.14లక్షల డబ్బు కావాలా?’’ అని అడిగారు. బాధితుడు కారు కావాలని చెప్పాడు. అంతే, ఆ రోజు నుంచి జీఎస్‌టీ, ప్రాసెసింగ్‌ ఫీజు, డెలివరీ చార్జీలు అంటూ విడతల వారీగా రూ.45,150 వసూలు చేశారు. కారు డెలివరీ కాకపోవడం, మరిన్ని డబ్బులు కావాలని అడగడంతో, అనుమానించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఇదే తరహాలో మరో మూడు ఫిర్యాదులూ నమోదయ్యాయి.

రంగంలోకి సైబర్‌ టీం..

కొత్త తరహా మోసాలు వెలుగులోకి రావడంతో సీపీ సజ్జనార్‌ ప్రత్యేక సైబర్‌ క్రైం టీంను రంగంలోకి దింపారు. ఝార్ఖండ్‌లోని రాంచీకి చెందిన సైబర్‌ ముఠా ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. సుమారు 5 నెలలు కసరత్తు చేసి ఆధారాలు సేకరించారు. రాంచీ వెళ్లి సైబర్‌ ముఠా ఆటకట్టించి 10 మందిని అరెస్టు చేశారు. వీరిలో ముఠా నాయకుడు బిహార్‌కు చెందిన తరుణ్‌, రాంచీకి చెందిన ఇద్దరు, మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు, తెలంగాణకు చెందిన ఆరుగురు ఉన్నారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. ఈ ముఠా ఆరు నెలల్లోనే రూ.2 కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, నిందితుల్లో ఒకడైన ఝార్ఖండ్‌కు చెందిన కమలేశ్‌ దూబే గతంలో బతుకుదెరువు కోసం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి వచ్చి… 20 ఏళ్లపాటు ఇక్కడే ఉన్నాడు. ఆ తరువాత రాంచీకి వెళ్లి ఈ ముఠాలో కలిశాడు. సైబర్‌ మోసంలో తెలుగువారిని నమ్మించడానికి తెలుగు టెలీకాలర్స్‌ అవసరం ఏర్పటంతో.. తనకు మంచిర్యాలలో పరిచయమున్న రమేష్‌, వెంకటేశ్‌, రాకేష్‌, ప్రశాంత్‌, రాజేందర్‌రెడ్డి, రాజలింగు ఆరుగురిని రాంచీకి రప్పించాడు. టెలీకాలర్స్‌గా నియమించి.. కస్టమర్లను మోసం చేయడం నేర్పించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here