పుదుచ్చేరిలో నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోలేక.. ముఖ్యమంత్రి పదవికి నారాయణస్వామి సోమవారం రాజీనామా చేశారు. ఆయన అందించిన రాజీనామాను లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్‌జీ) డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ వెంటనే ఆమోదించారు. కాగా స్పీకర్ శివకొళందు అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేశారు. మరోవైపు ఆదివారం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు డీఎంకే, కాంగ్రెస్‌లు ప్రకటించాయి.

బలం నిరూపించుకోకుండానే బయటికి..
33 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేపై అనర్హత వేటు, ఐదుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో కాంగ్రె్‌స-డీఎంకే కూటమికి స్పీకర్‌తో కలిపి 12 మందే మిగిలారు. వీరిలో ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. మరోవైపు ఏడుగురు ఎన్‌ఆర్ కాంగ్రెస్, నలుగురు అన్నాడీఎంకే, ముగ్గురు బీజేపీ నామినేటెడ్ ఎమ్మెల్యేలతో కలిపి ప్రతిపక్ష కూటమికి 14 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశం కాగానే సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వంపైనా, మాజీ ఎల్‌జీ కిరణ్ బేదీపైనా నిప్పులు చెరిగారు. రాష్ట్రాలను బలహీనపరచడమే ధ్యేయంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పని చేస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ విప్ అనంతరామన్ మాట్లాడుతూ బలపరీక్షలో ముగ్గురు నామినేటెడ్ బీజేపీ సభ్యులకు ఓటేసే హక్కు లేదన్నారు. రాజ్యసభ, రాష్ట్రపతి ఎన్నికల్లోనూ వారికి ఓటు హక్కు లేదని పేర్కొన్నారు. ఓటింగ్‌లో వారిని అనుమతించరాదని కోరగా, ఆ అభ్యర్థనను స్పీకర్ పట్టించుకోలేదు. దీంతో సీఎం నారాయణస్వామి అసెంబ్లీ నుంచి బయటికి వెళ్లిపోయారు. మంత్రులు, అధికార పక్షం ఎమ్మెల్యేలూ ఆయన వెంటే బయటికి వెళ్లిపోవడంతో ప్రభుత్వం బలపరీక్షలో విఫలమైందని స్పీకర్‌ప్రకటించారు. అసెంబ్లీ నుంచి రాజ్‌నివా్‌సకు వెళ్లిన నారాయణస్వామి ఎల్‌జీకి రాజీనామాపత్రాన్ని అందించారు. స్పీకర్ సభానిబంధనలను పాటించలేదని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతిపక్షాలను ఆహ్వానిస్తారా?
నారాయణస్వామి రాజీనామా సమర్పించిన కొద్దిసేపటికే దానిని ఆమోదించినట్లుగా రాజ్‌నివాస్ ప్రకటించింది. అదే విధంగా నారాయణస్వామికి 50 మందితో కల్పించిన భద్రతను సైతం ఉపసంహరించుకుంది. ప్రభుత్వం కూలిపోవడంతో ఎల్జీ తదుపరి నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ప్రతిపక్ష కూటమిని ఆహ్వానించడం, రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడం, లేదా అసెంబ్లీని రద్దు చేయడం ఆమె ముందున్న ప్రత్యామ్నాయాలని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానిస్తే ఆ మేరకు ప్రయత్నిస్తామని బీజేపీకి చెందిన నమశ్శివాయం ప్రకటించారు. కాగా, బలపరీక్షలో విఫలమైన నారాయణస్వామిని ముఖ్యమంత్రి అనాలా ? మాజీ సీఎం అనాలా ? అని ప్రధాన ప్రతిపక్షనేత, ఎన్‌ఆర్ కాంగ్రెస్ అధినేత ఎన్.రంగస్వామికి సందేహం కలిగింది. విలేకరుల సమావేశంలోనే ఆయన పక్కనున్న ఎమ్మెల్యేని ఈ విషయం అడగడం టీవీ చానళ్లలో ప్రత్యక్షప్రసారమైంది. నారాయణస్వామి మాజీ ముఖ్యమంత్రేనని ఎమ్మెల్యే చెప్పినప్పటికీ రంగస్వామి మాత్రం ‘ముఖ్యమంత్రి’ అనే సంబోధించడం విశేషం. గత ఐదేళ్లుగా నారాయణస్వామి పుదుచ్చేరికి చేసిందేమీ లేదని రంగస్వామి విమర్శించారు.