కేసీఆర్‌ స్పష్టత ఇస్తారా?

0
246
Spread the love

టీఆర్‌ఎ్‌సను సంస్థాగతంగా పటిష్ఠం చేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టి పెట్టారు.

పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామ స్థాయి నుంచీ రాష్ట్ర స్థాయి వరకూ పార్టీ కమిటీల నియామకం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్‌ 27న పార్టీ వార్షిక మహాసభ, ఇతర సంస్థాగత అంశాలపైన విస్తృతంగా చర్చించేందుకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో ఆదివారం టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గం సమావేశం అవుతోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటుగా మంత్రులు, పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎ్‌సల అధ్యక్షులనూ ఆహ్వానించారు. పార్టీ పటిష్టత, రానున్న శాసనమండలి, కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికలు, సాగర్‌ ఉప ఎన్నికలకు సంబంధించి ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌ దిశా నిర్దేశనమూ చేయనున్నారు. వాస్తవానికి దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సీట్లు బాగా తగ్గిన తర్వాత టీఆర్‌ఎ్‌సలో ఒక రకమైన స్తబ్ధత, గందరగోళం నెలకొని ఉంది. వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమితో పార్టీ నేతలు, కార్యకర్తల్లో నిరాశా, నిస్పృహలూ ఆవరించి ఉన్నాయి.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు వరకూ ఎంఐఎంను టీఆర్‌ఎస్‌ తన మిత్రపక్షంగానే పరిగణించింది. అయితే, జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ తమకు మిత్రపక్షం కాదని కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఆ ఎన్నికల్లో ఎంఐఎంతోనూ టీఆర్‌ఎస్‌ తలపడింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా బీజేపీపైయుద్ధం ప్రకటించిన సీఎం కేసీఆర్‌ ప్రత్యామ్నాయ వేదిక కోసం హైదరాబాద్‌లో సీఎంల సదస్సును ఏర్పాటు చేస్తాననీ అన్నారు. ఢిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతూ ప్రకటించారు. అయితే, ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాను కలిసి వచ్చిన తర్వాత కేసీఆర్‌ యూటర్న్‌ తీసుకున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, ఎంఐఎంలతో టీఆర్‌ఎస్‌ వైఖరి ఎలా ఉండబోతుందన్న దానిపై పార్టీ నేతల్లోనే కొంత గందరగోళం నెలకొని ఉంది. అలాగే సీఎం కేసీఆర్‌ అందుబాటులో లేడు, కనిపించడమూ లేదన్న అభిప్రాయాలూ పార్టీలో వ్యక్తమవుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సీట్లు బాగా తగ్గిన తర్వాత పార్టీ నేతలూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. కొందరు నేతలు వివాదాస్పద వ్యాఖ్యలూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం కార్యవర్గ సమావేశంలో సీఎం కేసీఆర్‌ చేయనున్న దిశానిర్దేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీజేపీ, ఎంఐఎ పార్టీల పట్ల టీఆర్‌ఎస్‌ వైఖరి ఎలా ఉంటుందన్నది ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అన్ని అంశాలపైనా ఆయన స్పష్టతను ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి, వరుస ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలన్న దానిపైనా ఆయన దిశానిర్దేశం చేస్తారని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, తెలంగాణ పట్ల కేంద్రం వైఖరి పైనా సీఎం మాట్లాడేందుకు అవకాశం ఉంది. రాజకీయంగా టీఆర్‌ఎస్‌ ఒంటరిగానే ముందుకు వెళుతుందంటూ ప్రకటించే అవకాశమూ ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు వివాదాల జోలికి పోకుండా ప్రజల్లోనే ఉండాలన్న దానిపైనా సూచనలు చేస్తారని చెబుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటమి, పార్టీ శ్రేణుల నిరాశా, నిస్పృహలపైనా సీఎం కేసీఆర్‌ వద్ద ఇప్పటికే ఫీడ్‌బ్యాక్‌ ఉందనీ చెబుతున్నారు. వీటినీ ప్రస్తావించే అవకాశం ఉందంటున్నారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థి ఎవరన్నదీ కార్యవర్గ సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది. 11న మేయర్‌ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

ఘనంగా వార్షికోత్సవం!

2001లో పెట్టిన టీఆర్‌ఎస్‌ పార్టీకి 20 సంవత్సరాలు నిండుతున్న నేపథ్యంలో ఏప్రిల్‌ 27న పార్టీ వార్షిక మహాసభను ఘనంగానే నిర్వహించే అవకాశం ఉంది. ప్లీనరీ కూడా నిర్వహించవచ్చునంటున్నారు. దీనిపైనా సీఎం కేసీఆర్‌ కార్యవర్గ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ సభ్యత్వ డ్రైవ్‌కూ పిలుపునిచ్చే అవకాశం ఉందని, ఈ ప్రక్రియను ప్లీనరీ వరకూ కొనసాగించేందుకు ఆస్కారం ఉందని చెబుతున్నారు. అటు వరుస ఎన్నికలకు సన్నద్దత, ఇటు పార్టీ బలోపేతం సమాంతరంగా జరిగేలా దిశానిర్దేశనం చేయనున్నారు. కేసీఆర్‌ కుమారుడు, మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేయడానికి పూర్వరంగంగా ఈ సమావేశం జరుగుతున్నట్లుగానూ ప్రచారం జరుగుతోంది. కానీ పార్టీలోని విశ్వసనీయ వర్గాలు మాత్రం అదేమీ ఉండక పోవచ్చునని చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here