సూయజ్ కాలువలో ఎవర్ గివెన్ నౌకను బయటికి తీసేందుకు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెల 23 నుంచి ఇక్కడ అడ్డుగా నిలబడిన నౌకను తీసేందుకు ఎంతోమంది కష్టపడుతుంటే.. ఇన్ని రోజులకు నౌక స్వల్పంగా రెండు అంగుళాల మేర కదిలింది. దీంతో కాలువలో నిలిచిపోయిన నౌకల సిబ్బంది సంతోషంతో హారన్లను మోగించారు. ఇప్పటికే పలు టగ్ బోట్లు దాన్ని బయటికి లాగేందుకు యత్నిస్తుండగా.. తాజాగా మరో రెండు పడవలు కూడా కాలువకు బయలుదేరాయి. ఓవైపు నౌక కూరుకుపోయిన ఒడ్డున ఇసుకను తవ్వే పనులు జరుగుతూనే ఉండగా.. మరోవైపు ఈ టగ్ పడవలు నౌకను తాళ్లతో బయటికి లాగేందుకు ప్రయత్నిస్తాయని బెర్న్‌హర్డ్ షుల్టే అనే సంస్థ తెలిపింది. ఎవర్ గివెన్ నిర్వహణను ఈ సంస్థే చూస్తుండటం గమనార్హం. బలమైన గాలులు మాత్రమే నౌక ఇలా ఆగిపోవడానికి కారణం కాకపోవచ్చని, నౌక పనితీరులో సాంకేతిక సమస్య లేదా సిబ్బంది పొరపాటు కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. ఇక సూయజ్ కెనాల్‌లో నౌకల రద్దీ మరింతగా పెరిగింది. మ్యాక్సార్ టెక్నాలజీస్ సంస్థకు చెందిన ఉపగ్రహాలు తీసిన ఫొటోల్లో ఈ విషయం వెల్లడైంది. కాలువకు దిగువన సుమారు 120కు పైగా నౌకలు లంగరు వేసి వేచిచూస్తున్నట్లు తేలింది. మొత్తంగా 321 నౌకలు కాలువలోకి ప్రవేశించేందుకు లేదా బయటికి వెళ్లేందుకు ఎదురుచూస్తున్నాయని అంచనా.
