ముంబైలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి కదా… ఇలా వానలు పడిన సమయంలో… కొండ చిలువలు… ఎప్పుడూ ఉండే ప్రదేశంలో ఉండలేక… నీరు లేని వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తాయి. అలాంటి ఓ మూగ జీవి… కొందరు కుర్రాళ్ల కంట పడింది. అది ఏ నాగుపామో అయితే… కాటేస్తుందనే భయంతో దాని జోలికి వెళ్లేవాళ్లు కాదేమో. కానీ పాపం అది నెమ్మదిగా వెళ్లే కొండ చిలువ కదా… ఆ కేటుగాళ్లు దాన్ని పట్టుకొని ఇష్టమొచ్చినట్లు వంచి… కాళ్లతో తన్ని, చేతులతో చితకబాది… అది వాళ్లకు లొంగాక… దానితో సెల్ఫీలు తీసుకున్నారు. ఈ దుర్మార్గపు ఘటన… బోరీవాలీలోని హనుమాన తెక్డీ ఏరియాలో జరిగింది. బుధవారం రాత్రి సమయంలో ఇది జరిగినట్లు తెలిసింది. ఆ కుర్రాళ్లు ఉంటున్న ఇంటి ముందు నుంచి వెళ్తూ… అది వాళ్ల కంటపడటమే దాని తప్పిదమైంది.
సెల్ఫీలు తీసుకున్నాక… ఆ 8.5 అడుగుల పామును ఓ సంచిలో కుక్కి… దగ్గర్లోని అడవిలో వదిలేశారు. పామును వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న వన్యప్రాణి సంరక్షణ కర్త పవన్ శర్మ… ఆ వీడియో ఆధారంగా… అటవీ అధికారులకు కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే అధికారులు… వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద… వాళ్లపై కేసు రాసి… కస్టడీలోకి తీసుకున్నారు. వాళ్లను ఇంటరాగేట్ చేసి… చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా… ముంబై ప్రజలకు అటవీ అధికారులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఎవరికైనా వన్య ప్రాణులు కనిపిస్తే… తమకు కాల్ చెయ్యాలనీ, అంతే తప్ప… వాటి జోలికి వెళ్లొద్దని తెలిపారు. రూల్స్‌కి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా… కఠిన చర్యలు తీసుకుంటామన్నారు