చిత్తూరు జిల్లా: ఎన్నికల్లో ఎదురు నిలిచినవారిని కత్తులు, కటారులతో, వేటకొడవళ్లతో చంపేస్తున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును మార్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. పంతానికి పోయి ప్రజలు కోరుకున్న వ్యక్తులను పదవులకు దూరం చేస్తూ ప్రజాకాంక్షను చంపేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో అధికార ఒత్తిడులతో గెలిచినవారు ఓడిపోతున్నారు. ఓడినవారు గెలుస్తున్నారు. ఈ లెక్కనైతే సర్పంచ్ ఎన్నికలు ఎందుకు? అధికారపార్టీ నేతలు గ్రామాల్లో పార్టీ శాఖలకు అధ్యక్షులను నియమించుకున్నట్లు సర్పంచ్‌లను కూడా వారికి ఇష్టమొచ్చినట్లు నియమించుకోవచ్చుకదా.. అని ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికై అధికారపార్టీ జులూంతో ఓడిపోవాల్సి వస్తున్న సర్పంచ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి జిల్లాల్లోనూ కౌంటింగ్.. రీ కౌంటింగ్ ఫలితాల్లో తేడా రావడం యాధృచ్చికం కాదు. కావాలనే తమ మనుషులను పదవుల్లో కూర్చోబెట్టేందుకు రీ కౌంటింగ్ ఎత్తుగడను వాడుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
