
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో భారత్ శాసించే స్థితిలో నిలిచింది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వరుసగా రెండోసారి ఐదు వికెట్లతో రూట్ సేనను దెబ్బతీశాడు. అటు అరంగేట్ర స్పిన్నర్ అక్షర్ పటేల్ (2/40), ఇషాంత్ (2/22) కూడా ప్రభావం చూపడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 59.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. బెన్ ఫోక్స్ (42 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. దీంతో 195 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ రోజు ముగిసేసరికి 18 ఓవర్లలో వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ (25 బ్యాటింగ్), పుజార (14 బ్యాటింగ్) ఉన్నారు. ప్రస్తుతానికి భారత్ 249 పరుగుల భారీ ఆధిక్యంలో ఉండగా, చేతిలో మరో 9 వికెట్లున్నాయి. దీంతో ఈ టర్నింగ్ పిచ్‌పై ఇంగ్లండ్ గెలవాలంటే అద్భుతం జరగాల్సిందే.. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ సేన 329 పరుగులకు ఆలౌటైంది. పంత్ (58 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీ సాధించగా, మొయిన్ అలీకి 4, స్టోన్‌కు 3 వికెట్లు దక్కాయి.
7.5 ఓవర్లలోనే..: రెండో రోజు ఓవర్‌నైట్ స్కోరు 300/6తో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ మరో 29 పరుగులే చేసింది. ఆరంభంలోనే అక్షర్ (5), ఇషాంత్ (0)ను మొయిన్ అలీ అవుట్ చేశాడు. అటు పంత్ ధాటిగా ఆడుతూ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. కుల్దీప్ (0) కాసేపు వికెట్ కాపాడుకున్నా అతడితోపాటు సిరాజ్ (4)ను స్టోన్ అవుట్ చేయడంతో భారత్ ఆట ముగిసింది.
39కే నాలుగు: భారత్ తొలి ఇన్నింగ్స్‌ను త్వరగానే ముగించిన జోష్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్‌కు దిగింది. కానీ వారి ఆటతీరు మొదటి టెస్టుకు పూర్తి భిన్నంగా సాగింది. లంచ్ విరామం వరకే 39/4 స్కోరుతో ఇబ్బందుల్లో పడింది. తొలి ఓవర్ మూడో బంతికే బర్న్స్‌ను ఇషాంత్ డకౌట్ చేశాడు. ఆ తర్వాత సిబ్లే (16)ను అశ్విన్ అవుట్ చేయగా.. భీకర ఫామ్‌లో ఉన్న కెప్టెన్ రూట్ (6)ను అక్షర్ తన టెస్టు కెరీర్‌లో తొలి వికెట్‌గా వెనక్కి పంపాడు. తన ఫేవరెట్ స్వీప్ షాట్ ఆడే క్రమంలోనే అతడు అవుటవడం గమనార్హం. లంచ్ బ్రేక్‌కు ముందు లారెన్స్ (9)ను అశ్విన్ అవుట్ చేశాడు.
ఫోక్స్ పోరాటం: ఆ తర్వాత సెషన్ సాగుతున్న కొద్దీ పిచ్ మరింత టర్న్ కావడంతో స్పిన్నర్లు చెలరేగారు. బెన్ ఫోక్స్ ఒక్కడే ఈ సెషన్‌లో వికెట్ కాపాడుకుంటూ పోరాడి జట్టును ఫాలోఆన్ నుంచి తప్పించాడు. ఆరంభంలోనే బెన్ స్టోక్స్ (18)ను అశ్విన్ దెబ్బతీశాడు. ఈ దశలో పోప్ (22)తో కలిసి ఫోక్స్ ఆరో వికెట్‌కు 35 రన్స్ జోడించాడు. అయితే 39వ ఓవర్‌లో సిరాజ్ తొలిసారి బరిలోకి దిగగా తన మొదటి బంతికే పోప్‌ను అవుట్ చేశాడు. ఈ క్యాచ్‌ను కీపర్ పంత్ తన ఎడమ వైపు గోల్‌కీపర్ తరహాలో డైవ్ చేస్తూ అద్భుతంగా పట్టేశాడు. ఆ తర్వాత వరుస ఓవర్లలో మొయిన్ అలీ (6)ని అక్షర్.. స్టోన్ (1)ను అశ్విన్ అవుట్ చేయడంతో ఇంగ్లండ్ 106 రన్స్‌కే 8 వికెట్లు కోల్పోయింది. లీచ్ (5)ను ఇషాంత్ అవుట్ చేయగా, బ్రాడ్‌ను వెనక్కి పంపి అశ్విన్ 5 వికెట్లను పూర్తి చేసుకున్నాడు.
శుభారంభం: భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్ 18 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసింది. శుభ్‌మన్ గిల్ (14)తో కలిసి రోహిత్ తొలి వికెట్‌కు 42 రన్స్ అందించాడు. 12వ ఓవర్‌లో గిల్‌ను లీచ్ ఎల్బీ చేశాడు. దీనిపై భారత్ రివ్యూ కోరినా ఫలితం లేకపోయింది. తర్వాతి ఓవర్‌లో రోహిత్ ఎల్బీపై ఇంగ్లండ్ రివ్యూకెళ్లినా నిరాశే ఎదురైంది. 14వ ఓవర్‌లో రోహిత్‌ను అంపైర్ అవుట్‌గా ప్రకటించగా అతను డీఆర్‌ఎస్ కోరి బతికిపోయాడు. ఆ తర్వాత పుజారతో కలిసి వికెట్ కోల్పోకుండా రోజును ముగించాడు.
రికార్డుల హోరు
సొంతగడ్డపై స్పిన్నర్ అశ్విన్ ప్రత్యర్థులను వణికిస్తున్నాడు. కెరీర్‌లో మొత్తంగా 29సార్లు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లను తీయగా ఇందులో స్వదేశంలోనే 23 సార్లు ఈ ఫీట్ సాధించాడు. ఈ విషయంలో అతను అండర్సన్ (22)ను అధిగమించాడు. అయితే సొంత గడ్డపై అత్యధికంగా ఐదు వికెట్లను తీసిన వారిలో మురళీధరన్ (45), హెరాత్ (26), కుంబ్లే (25) అతడికంటే ముందున్నారు. అంతేకాకుండా భారత్‌లో ఎక్కువ టెస్టు వికెట్లు (268) సాధించిన రెండో బౌలర్ అయ్యాడు. కుంబ్లే (350) తొలి స్థానంలో ఉండగా హర్భజన్ (265)ను అశ్విన్ అధిగమించాడు. దీనికితోడు 200 సార్లు లెఫ్ట్ హ్యాండర్స్‌ను అవుట్ చేసిన తొలి బౌలర్‌గానూ రికార్డులకెక్కాడు. ఇందులో అత్యధికంగా డేవిడ్ వార్నర్ (10సార్లు) వికెట్ తీశాడు.
2- టెస్టు క్రికెట్‌లో ఎక్కువసార్లు (36) డకౌట్ అయిన రెండో ఆటగాడిగా క్రిస్ మార్టిన్‌తో సమంగా నిలిచిన స్టువర్ట్ బ్రాడ్. వాల్ష్ (43) ముందున్నాడు.
ఒక్క ఎక్స్‌ట్రా లేకుండానే..
భారత తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బౌలర్లు ఎక్స్‌ట్రాల రూపంలో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. దీంతో అదనపు పరుగు లేకుండానే ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు (329) ఇదే. 1955లో పాకిస్థాన్‌పై భారత్ బౌలర్లు కూడా ఇలాగే ఒక్క ఎక్స్‌ట్రా కూడా ఇవ్వలేదు. అయితే అప్పుడు పాక్ 328 పరుగులు చేసింది. దీంతో ఒక్క పరుగుతో 66 ఏళ్ల రికార్డు బ్రేక్ అయింది.
కోహ్లీ ఈల.. ఫ్యాన్స్ గోలగోల
చిదంబరం స్టేడియంలో క్రికెట్ మ్యాచంటే ఆ జోషే వేరు! అలాంటిది ఏడాది తర్వాత ఇక్కడ మ్యాచ్ జరుగుతుండడం..అందునా కరోనా అనంతరం దేశంలో తొలిసారి స్టేడియంలోకి ఫ్యాన్స్‌ను అనుమతించడంతో వారి కేరింతలు, తుళ్లింతలతో ‘చిదంబరం’ హోరెత్తుతోంది. ఆదివారం మ్యాచ్ జరుగుతున్నంతసేపూ ఈలలు వేస్తూ, ఫోర్లు, సిక్సర్లు కొట్టినప్పుడు లయబద్ధంగా చప్పట్లు చరుస్తూ, వికెట్ పడినప్పుడు డ్యాన్సులు చేస్తూ క్రికెటర్లలో ఉత్సాహం నింపారు. అభిమానుల అల్లరి కెప్టెన్ కోహ్లీలో కూడా ఊపు తెచ్చినట్టుంది. అతడు కూడా నోట్లో రెండు వేళ్లు పెట్టుకొని విజిల్ వేస్తూ..‘ఈలలు వినిపించడంలేదు. మరింత గట్టిగా వేయండి’ అనేలా సంజ్ఞ చేయడంతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం రెట్టింపైంది.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 329; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: బర్న్స్ (ఎల్బీ) ఇషాంత్ 0; సిబ్లే (సి) కోహ్లీ (బి) అశ్విన్ 16; లారెన్స్ (సి) గిల్ (బి) అశ్విన్ 9; రూట్ (సి) అశ్విన్ (బి) అక్షర్ 6; స్టోక్స్ (బి) అశ్విన్ 18; పోప్ (సి) పంత్ (బి) సిరాజ్ 22; ఫోక్స్ (నాటౌట్) 42; మొయిన్ అలీ (సి) రహానె (బి) అక్షర్ 6; స్టోన్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 1; లీచ్ (సి) పంత్ (బి) ఇషాంత్ 5; బ్రాడ్ (బి) అశ్విన్ 0; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 59.5 ఓవర్లలో 134 ఆలౌట్. వికెట్ల పతనం: 1-0, 2-16, 3-23, 4-39, 5-52, 6-87, 7-105, 8-106, 9-131, 10-134. బౌలింగ్: ఇషాంత్ 5-1-22-2; అశ్విన్ 23.5-4-43-5; అక్షర్ 20-3-40-2; కుల్దీప్ 6-1-16-0; సిరాజ్ 5-4-5-1.
భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (బ్యాటింగ్) 25; గిల్ (ఎల్బీ) లీచ్ 14; పుజార (బ్యాటింగ్) 7; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: 18 ఓవర్లలో 54/1. వికెట్ పతనం: 1-42. బౌలింగ్: స్టోన్ 2-0-8-0; లీచ్ 9-2-19-1; మొయిన్ అలీ 7-2-19-0.