ఇ‘షాన్‌’దార్‌ విరాట్‌

0
227
Spread the love

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీ్‌సలో భారత్‌ 1-1తో పోటీలోకొచ్చింది. విరాట్‌ కోహ్లీ (49 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 73 నాటౌట్‌), ఇషాన్‌ కిషన్‌ (32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 56) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. దీంతో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. జేసన్‌ రాయ్‌ (46), మోర్గాన్‌ (28) రాణించారు. శార్దూల్‌, సుందర్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో భారత్‌ 17.5 ఓవర్లలో 3 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఇషాన్‌ కిషన్‌ నిలిచాడు. మూడో టీ20 మంగళవారం జరుగుతుంది.

ఇషాన్‌, కోహ్లీ దూకుడు: ఛేదనలో భారత జట్టు ఏ దశలోనూ తడబడలేదు. మొదటి ఓవర్‌లోనే రాహుల్‌ (0) వికెట్‌ను కోల్పోయింది. అయితేనేం.. తొలి టీ20 ఆడుతున్న ఇషాన్‌ కిషన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తానెదుర్కొన్న తొలి బంతినే ఫోర్‌గా మలవడంతో పాటు ఆరో ఓవర్‌లో 6,4,4 బాదాడు. అటు కోహ్లీ కూడా బ్యాట్‌కు పనిచెప్పడంతో పవర్‌ప్లేలోనే జట్టు 50 పరుగులు చేసింది. మరుసటి ఓవర్‌లో చెరో సిక్సర్‌ సాధించడంతో స్కోరు రాకెట్‌ వేగంతో దూసుకెళ్లింది. అయితే పదో ఓవర్‌లో రెండు వరుస సిక్సర్లతో 28 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసిన ఇషాన్‌ ఆరో బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. పంత్‌ (26) రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో ధనాధన్‌ ఇన్నింగ్స్‌ను కనబరిచినా ఎక్కువ సేపు నిలవలేదు. కోహ్లీ మాత్రం లాఫ్టెడ్‌ డ్రైవ్‌తో సిక్సర్‌ సాధించి 35 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు. ఆ తర్వాత 18వ ఓవర్‌లో 4,6తో విరాట్‌ మ్యాచ్‌ను ముగించాడు.

మిడిలార్డర్‌ నిలకడ: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఈసారి శుభారంభం దక్కలేదు. అయితే మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఫర్వాలేదనిపించారు. అటు పేసర్‌ శార్దూల్‌ వైవిధ్యమైన బంతులతో చివర్లో కట్టడి చేయగలిగాడు. తొలి ఓవర్‌ మూడో బంతికే ఓపెనర్‌ బట్లర్‌ను భువనేశ్వర్‌ డకౌట్‌ చేశాడు. ఆ తర్వాత ఓపెనర్‌ రాయ్‌, డేవిడ్‌ మలాన్‌ (23) దీటుగా ఆడారు. ఇద్దరూ చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ స్కోరును పెంచారు. స్పిన్నర్‌ చాహల్‌ 9వ ఓవర్‌లో మలాన్‌ను ఎల్బీగా అవుట్‌ చేయడంతో, రెండో వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అటు ఆఫ్‌ స్టంప్‌నకు బయట వేస్తున్న బంతులను రాయ్‌ రివర్స్‌ స్వీప్‌తో ఫోర్లుగా మలిచి చాహల్‌పై ఆధిక్యం చూపాడు. కానీ మరో స్పిన్నర్‌ సుందర్‌ ఓవర్‌లో భారీ షాట్‌కు వెళ్లిన రాయ్‌ క్యాచ్‌ అవుటయ్యాడు. దీంతో వరుసగా రెండోసారీ త్రుటిలో అర్ధసెంచరీ మిస్‌ అయ్యాడు. ఇక కెప్టెన్‌ మోర్గాన్‌ వచ్చీ రావడంతోనే ఫోర్లతో చెలరేగాడు. సుందర్‌ వేసిన మరుసటి ఓవర్‌లో బెయిర్‌స్టో (20) ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ దగ్గర సూర్యకుమార్‌ వదిలేయడంతో సిక్స్‌కు వెళ్లింది. ఐదో బంతిని మాత్రం డీప్‌ మిడ్‌ వికెట్‌లో అతడే పట్టేయడంతో బెయిర్‌స్టో అవుటయ్యాడు. ఇక డెత్‌ ఓవర్లలో భారత పేసర్లు తమ స్లో బంతులతో ఇంగ్లండ్‌ను కట్టడి చేశారు. ఇదే క్రమంలో 17వ ఓవర్‌లో మోర్గాన్‌ (28)ను, 20వ ఓవర్‌లో స్టోక్స్‌ (20)ను శార్దూల్‌ అవుట్‌ చేశాడు.

స్కోరుబోర్డు

ఇంగ్లండ్‌: జేసన్‌ రాయ్‌ (సి) భువనేశ్వర్‌ (బి) సుందర్‌ 46; బట్లర్‌ (ఎల్బీ) భువనేశ్వర్‌ 0; మలాన్‌ (ఎల్బీ) చాహల్‌ 23; బెయిర్‌స్టో (సి) సూర్యకుమార్‌ (బి) సుందర్‌ 20; మోర్గాన్‌ (సి) పంత్‌ (బి) శార్దూల్‌ 28; స్టోక్స్‌ (సి) పాండ్యా (బి) శార్దూల్‌ 24; సామ్‌ కర్రాన్‌ (నాటౌట్‌) 6; జోర్డాన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 20 ఓవర్లలో 164/6. వికెట్ల పతనం: 1-0, 2-64, 3-91, 4-119, 5-142, 6-160. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-28-1; వాషింగ్టన్‌ సుందర్‌ 4-0-29-2; శార్దూల్‌ 4-0-29-2; హార్దిక్‌ 4-0-33-0; చాహల్‌ 4-0-34-1.

భారత్‌: రాహుల్‌ (సి) బట్లర్‌ (బి) సామ్‌ కర్రాన్‌ 0; ఇషాన్‌ కిషన్‌ (ఎల్బీ) రషీద్‌ 56; కోహ్లీ (నాటౌట్‌) 73; పంత్‌ (సి) బెయిర్‌స్టో (బి) జోర్డాన్‌ 26; శ్రేయాస్‌ (నాటౌట్‌) 8; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 17.5 ఓవర్లలో 166/3. వికెట్ల పతనం: 1-0, 2-94, 3-130. బౌలింగ్‌: సామ్‌ కర్రాన్‌ 4-1-22-1; ఆర్చర్‌ 4-0-24-0; జోర్డాన్‌ 2.5-0-38-1; టామ్‌ కర్రాన్‌ 2-0-26-0; స్టోక్స్‌ 1-0-17-0; రషీద్‌ 4-0-38-1.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here