క్రీడా రంగానికి కేటాయింపులెన్నో!

0
426
Spread the love

కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టనున్న 2021–22 వార్షిక బడ్జెట్‌లో క్రీడా రంగానికి లభించే కేటాయింపులపై ఆసక్తి నెలకొంది. గత కొన్నేళ్లుగా బడ్జెట్‌లో క్రీడారంగానికి ప్రాధాన్యత పెరిగినప్పటికీ, కేటాయింపుల్లో నిలకడ లోపించింది.

Sportsts Expect from finance minister Nirmala Sitharaman Budget 2021-22

గతేడాది (2020–21) ఖేలో ఇండియా గేమ్స్‌ కోసం రూ. 890 కోట్లను కేటాయించిన కేంద్రం… భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్‌), జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్‌)ల నిధుల్లో కోత విధించింది. 2019లో రూ. 615 కోట్లుగా ఉన్న ‘సాయ్‌’ కేటాయింపులు గతేడాది రూ. 500 కోట్లకు తగ్గగా… క్రీడా సమాఖ్యలకు (రూ. 245 కోట్ల నుంచి రూ. 55 కోట్లకు తగ్గింపు) సైతం భారీ కోత పడింది. అయితే కరోనా ప్రభావంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి సిద్ధం చేసిన ఈ బడ్జెట్‌లో క్రీడారంగానికి ఎన్ని నిధులు దక్కుతాయనేది ఆసక్తికరం.

► లాక్‌డౌన్‌ కారణంగా యూత్‌ స్పోర్ట్స్‌కు ఆదరణ పెరగడంతో ఈసారి బడ్జెట్‌లో క్రీడలపై ఎక్కువ వెచ్చించే అవకాశముంది.

► మరోవైపు కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఖేలో ఇండియా, ఫిట్‌ ఇండియా కార్యక్రమాలను విజయవంతం చేయాలంటే అందుకు తగిన నిధులు కేటాయించాల్సిందే.

► లింగ సమానత్వాన్ని పెంపొందించేందుకు, క్రీడల్ని కెరీర్‌గా ఎంచుకున్న మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై కేంద్రం దృష్టి సారించాల్సి ఉంది. దీనితో పాటు ఒలింపిక్స్‌ ఏడాది కావడంతో ఆటగాళ్లకు దన్నుగా నిలిచేందుకు ‘సాయ్‌’, ఎన్‌ఎస్‌ఎఫ్‌లకు ఎక్కువ నిధులు కేటాయించాల్సి ఉంటుంది.

► కరోనా కారణంగా ప్రజలు ఇంటికే పరిమితం కావడంతో గతేడాది గేమింగ్‌ సెక్టార్‌ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఈస్పోర్ట్స్, గేమింగ్‌ సెక్టార్‌లను అభివృద్ధి చేసే స్వదేశీ గేమ్‌ డెవలపర్స్, స్టార్టప్స్‌ను ప్రోత్సహిస్తూ బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యం ఇస్తే… నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోన్న మేకిన్‌ ఇండియా బ్రాండ్‌కు మంచి ప్రోత్సాహం లభించినట్లు అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here