క్రీడా వాటాలో రూ. 230 కోట్ల కోత

0
178
Spread the love

 కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న క్రీడారంగానికి బడ్జెట్‌లో ఊరట లభించకపోగా.. రూ. 230.78 కోట్ల కోత పడింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో క్రీడా రంగానికి రూ. 2,596.14 కోట్లు మాత్రమే కేటాయించారు.

గతేడాది క్రీడలకు రూ. 2,826.92 కోట్లు కేటాయించినా.. కరోనా కారణంగా కార్యకలాపాలు నిలిచిపోవడంతో రూ. 1800.15 కోట్లకు కుదించారు. అయితే, తగ్గించిన కేటాయింపులతో పోల్చుకుంటే మాత్రం 2021-22 బడ్జెట్‌లో రూ. 795.99 కోట్లు అదనంగా ఇచ్చినట్టే..! లాక్‌డౌన్‌ కారణంగా ఒలింపిక్స్‌ వాయిదా పడడం, దేశవాళీ ఈవెంట్లు రద్దు కావడంతోపాటు క్రీడాకారుల శిబిరాలు కూడా నిలిచిపోవడంతో గత బడ్జెట్‌ వాటాను పెద్దగా ఖర్చు చేయలేక పోయారు. కాగా, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న ఖేలో ఇండియా కార్యక్రమం నిధుల్లో కూడా భారీగా కత్తెరేశారు. గతేడాది ఖేలో ఇండియా కోసం రూ. 890.42 కోట్లు కేటాయిస్తే.. ఈసారి రూ. 657.71 కోట్లకు తగ్గించారు. అంటే రూ. 232.71 కోట్ల కోత పడింది. అయితే, భారత క్రీడా ప్రాథికార సంస్థ (సాయ్‌) కేటాయింపులు మాత్రం రూ. 160.41 కోట్లమేర పెరిగాయి. గతేడాది రూ. 500 కోట్లుకాగా.. ఈ ఏడాది రూ. 660.41 కోట్లుకు చేరింది. జాతీయ క్రీడా సమాఖ్యల (ఎన్‌ఎ్‌సఎ్‌ఫ)కు ఇచ్చే నిధులను కూడా రూ. 35 కోట్లు పెంచి మొత్తంగా రూ. 280 కోట్లు కేటాయించారు. కానీ, క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాలను రూ. 70 కోట్ల నుంచి రూ. 53 కోట్లకు కుదించారు. జాతీయ క్రీడాభివృద్ధి నిధిని సగానికి సగం.. అంటే రూ. 25 కోట్లకు తగ్గించారు. 2010 కామన్వెల్త్‌ క్రీడలు-సాయ్‌ స్టేడియాల ఆధునికీకరణ కేటాయింపులను కూడా రూ. 75 కోట్ల నుంచి రూ. 30 కోట్లకు కుదించారు. ఆటగాళ్ల సంక్షేమ నిధికి ఇచ్చే రూ. 2 కోట్లు, జమ్మూకశ్మీర్‌లో క్రీడా సౌకర్యాల అభివృద్ధికి రూ. 50 కోట్లలో ఎటువంటి మార్పులూ చేయలేదు. లక్ష్మీబాయి జాతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌కు ఇచ్చే వాటా రూ. 55 కోట్లను కొనసాగించగా.. ‘వాడా’ కేటాయింపులను రూ. 2 కోట్ల నుంచి రూ. 2.5 కోట్లకు పెంచారు. 

బడ్జెట్‌ ప్రసంగంలో టీమిండియా ప్రస్తావన

ఆస్ట్రేలియాలో టీమిండియా చారిత్రక టెస్ట్‌ సిరీస్‌ విజయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. సోమవారం బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా మరోసారి గుర్తు చేసుకొన్నారు. భారత జట్టు అద్భుత విజయంతో దేశం యావత్తు సంతోషంతో ఎలా ఉప్పొంగిందో చూశామన్నారు. భారత దేశ విజయకాంక్షకు అదో నిలువెత్తు ఉదాహరణ అని చెప్పారు. ‘క్రికెట్‌ను ఎంతగానో ప్రేమించే భారత్‌.. ఆస్ట్రేలియాపై చారిత్రక గెలుపు తర్వాత పొందిన అనుభూతిని మరోసారి గుర్తు చేసుకుంటున్నా. క్లిష్టపరిస్థితులు ఎదురైనా ఎలా ముందుకు సాగాలనే దాన్ని ఈ విజయం స్పష్టం చేసింది. మనం కూడా అదే స్ఫూర్తిని పెంపొందించుకోవాల’ని నిర్మల అన్నారు. కొవిడ్‌ కారణంగా కుదేలైన దేశ ఆర్థిక పరిస్థితులను మళ్లీ చక్కదిద్దడానికి అందరూ టీమిండియా ప్రేరణగా ముందుకు సాగాలనే అర్థం ఆమె మాటల్లో ధ్వనించింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here