గెలిచి తీరాలి..

0
174
Spread the love

చెన్నై: అంచనాలకు భిన్నంగా.. తొలి టెస్టులో ఘోరంగా ఓడిన టీమిండియా ఇప్పుడు బదులు తీర్చుకోవాలనుకుంటోంది. చెపాక్‌ మైదానంలోనే శనివారం నుంచి ఇంగ్లండ్‌తో జరిగే రెండో టెస్టులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఈ సారి టర్నింగ్‌ పిచ్‌ కావడంతో తమ ప్రధాన బలమైన స్పిన్‌తో ఇంగ్లండ్‌పై పంజా విసిరే ఆలోచనలో ఉంది. ఫ్లాట్‌గా కనిపించిన మొదటి టెస్టు పిచ్‌పై నాలుగోరోజు నుంచి బంతి టర్న్‌ అయిన విషయం తెలిసిందే. మరోవైపు నాలుగు టెస్టుల సిరీ్‌సలో 0-1తో వెనుకంజలో ఉన్న భారత జట్టుకు ఈ మ్యాచ్‌ కీలకం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్లో చోటు దక్కాలంటే భారత్‌ మిగిలిన 3 టెస్టుల్లో రెండైనా గెలవాల్సిందే. ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం ఆశలు ఆవిరవుతాయి. ఇదిలావుండగా రెండో టెస్టుకు 50శాతం (14 వేలు) ప్రేక్షకులు హాజరుకానున్నారు.

అక్షర్‌ అరంగేట్రం ఖాయమే..: తొలి టెస్టులో స్పిన్నర్‌ అశ్విన్‌కు సహచరుల నుంచి సహకారం లభించలేదు. బౌలింగ్‌లో వాషింగ్టన్‌ సుందర్‌, షాబాజ్‌ నదీమ్‌ తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో పక్కా వ్యూహంతో టర్నింగ్‌ వికెట్‌పై భారత్‌ బరిలోకి దిగాలనుకుంటోంది. నదీమ్‌ను తిరిగి స్టాండ్‌ బై ఆటగాడిగా పంపించారు. దీంతో గాయం నుంచి కోలుకున్న లెఫ్టామ్‌ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే చైనామన్‌ కుల్దీప్‌ యాదవ్‌పై స్పష్టత లేదు. అతను జట్టులోకి వస్తే సుందర్‌పై వేటు పడే చాన్సుంది. జట్టు కూర్పులో భాగంగా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు చోటు దక్కినా ఆశ్చర్యం లేదు. ఎలాగూ స్పిన్‌ పిచ్‌ కావడంతో స్పెషలిస్ట్‌ పేసర్‌ అవసరం లేదని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. అలా అయితే ఇషాంత్‌పై వేటు పడుతుంది. బ్యాటింగ్‌లో రోహిత్‌, రహానె సత్తా నిరూపించుకోవాల్సి ఉంది.

ఆర్చర్‌, అండర్సన్‌ లేకుండానే..: 22 ఏళ్ల తర్వాత చెన్నైలో భారత్‌కు ఓటమి రుచి చూపిన ఇంగ్లండ్‌ నాలుగు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఆర్చర్‌ గాయపడగా అండర్సన్‌, బట్లర్‌లకు విశ్రాంతినిచ్చారు. స్పిన్నర్‌ బెస్‌ తొలిటెస్టులో నిరాశపర్చడంతో మొయిన్‌ అలీని తీసుకున్నారు. అండర్సన్‌ స్థానంలో స్టువర్ట్‌ బ్రాడ్‌ రానుండగా.. ఆర్చర్‌ స్థానం కోసం వోక్స్‌-స్టోన్‌ మధ్య పోటీ నెలకొంది. బట్లర్‌ స్థానంలో వికెట్‌ కీపర్‌గా బెన్‌ ఫోక్స్‌ను ఆడిస్తున్నారు.

పిచ్‌

రెండో టెస్టు కోసం పిచ్‌ను సరికొత్తగా రూపొందించారు. ఇది తొలి రోజు నుంచే టర్నింగ్‌ వికెట్‌గా మారే అవకాశం ఉంది. దీంతో స్పిన్నర్లు అత్యంత కీలకం కానున్నారు. అటు టాస్‌ ప్రభావం కూడా పెద్దగా ఉండదని భావిస్తున్నారు. అయితే ఈ పిచ్‌పై మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ బంతి ఎలా బౌన్స్‌ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.

తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌, గిల్‌, పుజార, కోహ్లీ (కెప్టెన్‌), రహానె, పంత్‌, అశ్విన్‌, అక్షర్‌, కుల్దీ్‌ప/సుందర్‌, ఇషాంత్‌, బుమ్రా.

ఇంగ్లండ్‌: సిబ్లే, బర్న్స్‌, లారెన్స్‌, రూట్‌ (కెప్టెన్‌), స్టోక్స్‌, పోప్‌, ఫోక్స్‌, మొయిన్‌ అలీ, బ్రాడ్‌, వోక్స్‌/స్టోన్‌, లీచ్‌.

ఇంగ్లండ్‌కు మరో విజయం దక్కితే ఆసియాలో వరుసగా ఏడు టెస్టులు గెలిచిన పర్యాటక జట్టుగా ఆస్ట్రేలియాతో సమంగా నిలుస్తుంది.

1 భారత జట్టు ఈ మ్యాచ్‌ గెలిస్తే స్వదేశంలో ఎక్కువ విజయాలు (21) సాధించిన కెప్టెన్‌గా ధోనీ సరసన విరాట్‌ కోహ్లీ నిలుస్తాడు.

5 భారత జట్టు తమ టెస్టు చరిత్రలో తొలి మ్యాచ్‌ ఓడినా.. ఐదుసార్లు సిరీ్‌సను గెలిచింది. ఇందులో మూడింటిని గత ఆరేళ్లలోనే సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here