అబుదాబి: టీ10 టోర్నీలో విచిత్రమైన సంఘటన జరిగింది.

అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో నిన్న టీం అబుదాబి-నార్తర్న్ వారియర్స్ మధ్య జరిగిన టీ10 మ్యాచ్‌లో బౌండరీ వద్ద ఉన్న ఓ ఫీల్డర్ ఫోర్‌ను అడ్డుకోలేకపోయిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
నార్తర్న్ ఆటగాడు కొట్టి బంతి బౌండరీ వైపుగా దూసుకొస్తోంది. అయితే, అక్కడే ఉన్న అబుదాబి ఆటగాడు రోహన్ ముస్తాఫా బౌండరీ లైన్ వద్ద జెర్సీ మార్చుకోవడంలో బిజీగా ఉన్నాడు. దీంతో బంతి బౌండరీని ముద్దాడింది. ఆ బౌండరీని కనుక అతడు ఆపి ఉంటే టీం అబుదాబి జట్టు విజయం సాధించి ఉండేది. అతడి కారణంగా జట్టు పరాజయం పాలవడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
తనపై వస్తున్న విమర్శలపై ముస్తాఫా స్పందించాడు. తాను జెర్సీని మార్చుకోవాలనుకోలేదని, స్వెట్టర్‌ను తొలగించే ప్రయత్నంలో జెర్సీ అందులో చిక్కుకుపోయిందని ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చాడు. ఆ తర్వాతి ఓవర్ తాను వేయాల్సి ఉండడంతో స్వెట్టర్‌ను విప్పుదామని భావించానని చెప్పాడు.
కరోనా నిబంధనల కారణంగా బౌలర్ నుంచి అంపైర్ ఏమీ తీసుకునేందుకు ఇష్టపడడం లేదని, అందుకనే తాను స్వెట్టర్ విప్పాలని అనుకున్నానని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో జెర్సీ అందులో చిక్కకుపోయి ముఖానికి అడ్డుపడడంతో బౌండరీని అడ్డుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కారణంగా జట్టు ఓటమి పాలైనందుకు క్షమాపణలు తెలిపాడు.