తొలిరోజే తిప్పేశారు

0
226
Spread the love

అహ్మదాబాద్‌: పింక్‌బాల్‌ టెస్ట్‌లో అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌ (3/26) దెబ్బకు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 48.4 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ జాక్‌ క్రాలే (84 బంతుల్లో 10 ఫోర్లతో 53) అర్ధ శతకం సాధించగా.. మిగతా బ్యాట్స్‌మెన్‌ అందరూ కలసి 53 పరుగులే చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన భారత్‌ ఆటముగిసే సమయానికి 33 ఓవర్లలో 99/3 స్కోరు చేసింది. ఓపెనర్‌ రోహిత్‌తోపాటు రహానె (1 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. రోహిత్‌, కోహ్లీ (27) మూడో వికెట్‌కు 64 పరుగులు జత చేసి జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు. లీచ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. కుల్దీప్‌ స్థానంలో సుందర్‌, సిరాజ్‌ బదులు బుమ్రా జట్టులోకొచ్చారు. ఇంగ్లండ్‌ నాలుగు మార్పులు చేసింది.

ఉచ్చులో చిక్కుకొని..: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రూట్‌ సేన.. టీమిండియా స్పిన్నర్ల దెబ్బకు విలవిల్లాడింది. ఓపెనర్‌ క్రాలే మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ అంతా గింగిర్లు తిరిగే బంతులను ఎలా ఎదుర్కోవాలో అర్థంకాక పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆడిన రెండో టెస్ట్‌లోనూ ఐదు వికెట్ల ఫీట్‌ సాధించిన అక్షర్‌ తెలివిగా బౌలింగ్‌ చేసి.. ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ వెన్నువిరిచాడు. వందో టెస్ట్‌ ఆడుతున్న పేసర్‌ ఇషాంత్‌.. మూడో ఓవర్‌లోనే ప్రత్యర్థి పతనానికి నాందిపలికాడు. ఓ అద్భుతమైన బంతితో ఓపెనర్‌ సిబ్లేను డకౌట్‌ చేశాడు. ఏడో ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన అక్షర్‌ తొలి బంతికే ప్రమాదకర బెయిర్‌స్టో (0)ను వికెట్లముందు దొరకబుచ్చుకొన్నాడు. బెయిర్‌స్టో రివ్యూకు వెళ్లినా ఫలితం దక్కలేదు. అయితే, కెప్టెన్‌ జో రూట్‌ (17)తో కలిసి క్రాలే ఇన్నింగ్స్‌ను గాడిలోపెట్టే ప్రయత్నం చేశాడు. మూడో వికెట్‌కు 47 పరుగులతో బలపడుతున్న వీరి భాగస్వామ్యాన్ని అశ్విన్‌ విడదీశాడు. రూట్‌ను అశ్విన్‌ ఎల్బీగా అవుట్‌ చేయడంతో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ కుదుపునకు గురైంది. అర్ధ శతకంతో ధాటిగా ఆడుతున్న క్రాలేను అక్షర్‌ బౌన్స్‌ బాల్‌తో అవుట్‌ చేశాడు. దీంతో టీ సెషన్‌ ముగిసేసరికి ఇంగ్లండ్‌ 81/4తో కష్టాల్లో పడింది. రెండో సెషన్‌లో స్పిన్నర్లు మరింతగా విజృంభించడంతో ఇంగ్లండ్‌ మరో 31 రన్స్‌ జోడించి మిగిలిన 6 వికెట్లను చేజార్చుకుంది.

నిలబెట్టిన రోహిత్‌-విరాట్‌: డిన్నర్‌కు ముందు ఐదు ఓవర్లపాటు బ్యాటింగ్‌ చేసిన టీమిండియా ఓపెనర్లు రోహిత్‌, శుభ్‌మన్‌ గిల్‌ (11) ఆచితూచి ఆడారు. బ్రేక్‌ తర్వాత హిట్‌మ్యాన్‌ బౌండ్రీలతో జోరు చూపగా.. గిల్‌ మంచి సహకారం అందించాడు. తొలి వికెట్‌కు 33 పరుగులతో సాఫీగా సాగుతున్న వీరి భాగస్వామ్యాన్ని ఆర్చర్‌ విడదీశాడు. గిల్‌ను క్యాచ్‌ అవుట్‌ చేసిన ఆర్చర్‌ ఇంగ్లండ్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. ఆ వెంటనే భారత్‌కు మరో షాక్‌ తగిలింది. వన్‌డౌన్‌లో వచ్చిన చటేశ్వర్‌ పుజార (0)ను లీచ్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ దశలో రోహిత్‌, విరాట్‌ సమన్వయంతో ఆడారు. ఈ క్రమంలో స్టోక్స్‌ బౌల్‌ చేసిన 25వ ఓవర్‌ ఐదో బంతికి సింగిల్‌తో రోహిత్‌ కెరీర్‌లో 12వ అర్ధ శతకం పూర్తి చేశాడు. మరోవైపు కోహ్లీ సింగిల్స్‌తో స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ ప్రత్యర్థిని తీవ్ర అసహనానికి గురి చేశాడు. అయితే, తొలిరోజు ఆఖరి ఓవర్‌లో లీచ్‌ బౌలింగ్‌లో విరాట్‌ బౌల్డయ్యాడు.

స్కోరు బోర్డు

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: జాక్‌ క్రాలే (ఎల్బీ) అక్షర్‌ 53, సిబ్లే (సి) రోహిత్‌ (బి) ఇషాంత్‌ 0, బెయిర్‌స్టో (ఎల్బీ) అక్షర్‌ 0, రూట్‌ (ఎల్బీ) అశ్విన్‌ 17, స్టోక్స్‌ (ఎల్బీ) అక్షర్‌ 6, పోప్‌ (బి) అశ్విన్‌ 1, ఫోక్స్‌ (బి) అక్షర్‌ 12, ఆర్చర్‌ (బి) అక్షర్‌ 11, లీచ్‌ (సి) పుజార (బి) అశ్విన్‌ 3, బ్రాడ్‌ (సి) బుమ్రా (బి) అక్షర్‌ 3, అండర్సన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 48.4 ఓవ ర్లలో 112 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-2, 2-27, 3-74, 4-80, 5-81, 6-81, 7-93, 8-98, 9-105; బౌలింగ్‌: ఇషాంత్‌ 5-1-26-1, బుమ్రా 6-3-19-0, అక్షర్‌ 21.4-6-38-6, అశ్విన్‌ 16-6-26-3.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (బ్యాటింగ్‌) 57, గిల్‌ (సి) క్రాలే (బి) ఆర్చర్‌ 11, పుజార (ఎల్బీ) లీచ్‌ 0, కోహ్లీ (బి) లీచ్‌ 27, రహానె (బ్యాటింగ్‌) 1; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 33 ఓవర్లలో 99/3; వికెట్ల పతనం: 1-33, 2-34, 3-98; బౌలింగ్‌: అండర్సన్‌ 9-6-11-0, బ్రాడ్‌ 6-1-16-0, ఆర్చర్‌ 5-2-24-1, లీచ్‌ 10-1-27-2, బెన్‌ స్టోక్స్‌ 3-0-19-0.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here