నడాల్‌కు షాక్‌

0
184
Spread the love

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అతి పెద్ద సంచలనం.. క్వార్టర్స్‌ఫైనల్లో మహిళల టాప్‌ సీడ్‌ ఆష్లే బార్టీ, పురుషుల రెండో సీడ్‌ నడాల్‌కు పరాజయం.. పురుషుల క్వార్టర్స్‌లో నడాల్‌, గ్రీకు వీరుడు సిట్సిపాస్‌ హోరాహోరీగా తలపడ్డారు.. కానీ, 34 ఏళ్ల నడాల్‌పై 22 ఏళ్ల సిట్సిపా్‌సదే పైచేయి అయింది..ఇక మహిళల క్వార్టర్‌ఫైనల్లో కరోలినా మ్యుచోవా అసమాన పోరాట పటిమ చూపింది.. మొదటి సెట్‌ చేజారినా వెనుకంజ వేయలేదు..మరింత విజృంభించి టైటిల్‌ ఫేవరెట్‌ బార్టీని కంగుతినిపించింది..

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో బుధవారంనాటి పురుషుల క్వార్టర్‌ఫైనల్‌ పోరు అభిమానులకు మస్త్‌ మజా పంచింది. ఈసారి టోర్నీలో అత్యంత ఆసక్తి రేపిన స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నడాల్‌, ఐదో సీడ్‌ స్టెఫానో సిట్సిపాస్‌ మ్యాచ్‌ అంచనాలకు మించి సాగింది. ఐదు సెట్ల పోరులో చివరకు యువ ఆటగాడు సిట్సిపాస్‌ 3-6, 2-6, 7-6 (4), 6-4, 7-5 స్కోరుతో అపార అనుభవజ్ఞుడు నడాల్‌ను చిత్తు చేశాడు.

మహిళల్లో చెక్‌ రిపబ్లిక్‌ భామ మ్యుచోవా టోర్నీలో గత మ్యాచ్‌ల్లో చూపిన తెగువను క్వార్టర్‌ఫైనల్లోనూ పునరావృతం చేసింది. టైటిల్‌పై కన్నేసిన స్థానిక స్టార్‌ ఆష్లే బార్టీని 1-6, 6-3, 6-2తో ఓడించి తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. రెండో సెట్‌లో తలతిరగడంతో మెడికల్‌ టైమవుట్‌ తీసుకున్న మ్యుచోవా..తిరిగి వచ్చాక మ్యాచ్‌ను ఏకపక్షం చేస్తూ విజయం అందుకుంది. గురువారం జరిగే సెమీ్‌సలో అమెరికాకు చెందిన జెస్సీ బ్రాడీతో మ్యుచోవా తలపడుతుంది. క్వార్టర్‌ఫైనల్లో 22వ సీడ్‌ బ్రాడీ 4-6, 6-2, 6-1తో తన దేశానికే చెందిన పెగ్యులాపై గెలుపొందింది.

స్టెఫానో సూపర్‌

21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ వేటలో భాగంగా బరిలోకి దిగిన నడాల్‌కు ప్రీక్వార్టర్స్‌ వరకూ నల్లేరుపై బండి నడకలాగే సాగింది. సిట్సిపా్‌సతో క్వార్టర్‌ఫైనల్లోనూ మొదటి రెం డు సెట్లను రఫా సునాయాసంగా నెగ్గాడు. కానీ మూడో సెట్‌ నుంచి స్టెఫానో జూలు విదిల్చాడు. అయినా నడాల్‌ గట్టిగా బదులివ్వడంతో మూడో సెట్‌ టైబ్రేకర్‌కు వెళ్లింది. టైబ్రేకర్‌లో నడాల్‌ అనవసర తప్పిదాలు చేసి ఆ సెట్‌ను చేజార్చుకున్నాడు. ఇదే ఊపులో సిట్సిపా్‌స నాలుగో సెట్‌ దక్కించుకున్నాడు. అయితే నిర్ణాయక చివరి సెట్‌లో నడాల్‌ ఆట మళ్లీ గాడిలో పడినా 5-6 వద్ద ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన సిట్సిపాస్‌ నడాల్‌పై విజయ కేతనం ఎగురవేశాడు. మొత్తంగా నడాల్‌తో ఎనిమిదిసార్లు తలపడిన సిట్సిపాస్‌ రెండోసారి నెగ్గాడు. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో యూఎస్‌ ఓపెన్‌ రన్నరప్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ను సిట్సిపాస్‌ ఢీకొంటాడు. క్వార్టర్‌ఫైనల్లో రష్యాకు చెందిన నాలుగో సీడ్‌ మెద్వెదెవ్‌ 7-5, 6-3, 6-2 స్కోరుతో సహచరుడు రుబ్లేవ్‌ను ఓడించాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here