ప్రస్తుతం భారత జట్టు పూర్తి స్థాయి ఆటగాళ్లతో కళకళలాడుతోంది.

ఆసీస్ టూర్‌లో పలువురు క్రికెటర్లు గాయపడగా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఒక్క టెస్టుకే పరిమితమైన విషయం తెలిసిందే. ఇక ఈనెల 5 నుంచి చెన్నైలో జరిగే తొలి టెస్టులో పేసర్లు బుమ్రా, ఇషాంత్‌తో పాటు స్పిన్నర్ అశ్విన్ తుది జట్టులో ఉండడం ఖాయంగానే కనిపిస్తోంది. దీంతో ఈ త్రయానికి జతగా మరొకరా లేక ఇద్దరు బౌలర్లా అనేది తేలాల్సి ఉంది. స్థానిక చిదంబరం స్టేడియం పిచ్‌పై పచ్చిక కనిపిస్తుండడంతో మూడో పేసర్ వైపు మొగ్గు చూపే చాన్స్ కనిపిస్తోంది. అదే జరిగితే హైదరాబాదీ సిరాజ్ జట్టులో ఉంటాడు. కానీ ఈ ముగ్గురూ బ్యాటింగ్‌లో బలహీనమేననే విషయం మరిచిపోవద్దు. అయితే, ఈ మధ్యకాలంలో భారత జట్టు రెగ్యులర్‌గా ఐదుగురు బౌలర్లను ఆడించడం కనిపిస్తోంది. ఆసీ్‌సతో చివరి మూడు టెస్టులతో పాటు 2019-20లో స్వదేశంలో జరిగిన నాలుగు టెస్టుల్లోనూ జట్టు ఇదే ఫార్ములాతో ముందుకెళ్లింది. సహజంగా చెపాక్ స్పిన్‌కు కూడా అనుకూలిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుంటే ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లు జట్టులో ఉన్నా ఆశ్చర్యం లేదు. రెండేళ్లుగా టెస్టులకు దూరమైన చైనామన్ కుల్దీప్ యాదవ్‌కు భారత్‌లో మెరుగైన ట్రాక్ రికార్డుంది. దీంతో అతడికి ఈసారి అవకాశం లభించవచ్చు. ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో అదనంగా ఆల్‌రౌండర్‌ను బరిలోకి దింపే ఆలోచననూ తోసిపుచ్చలేం.
జడేజా స్థానం ఎవరిదో..
స్టార్ ఆల్‌రౌండర్ జడేజా గాయం కారణంగా దూరం కావడంతో అతడి స్థానాన్ని భర్తీ చేయడం జట్టుకు సవాల్‌గా మారింది. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ రూపంలో స్పిన్ ఆల్‌రౌండర్లు సిద్ధంగా ఉన్నారు. కానీ పటేల్ ఇంకా అరంగేట్రం చేయకపోగా సుందర్‌కు ఒక టెస్టు అనుభవం మాత్రమే ఉంది. టెస్టుల్లో సుదీర్ఘ సమయం బౌలింగ్ చేసే సామర్థ్యం అన్నింటికంటే ముఖ్యం. బ్రిస్బేన్ టెస్టుకు ముందు సుందర్ చివరిసారిగా 2017లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. ఇంగ్లండ్ జట్టులోని టాప్-7 ఆటగాళ్లలో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లు ఉండడంతో భారత జట్టు ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లతో ముందుకెళ్లడం కష్టమే. మరోవైపు సుందర్‌కన్నా అక్షర్ పటేల్ ఎక్కువ ఫస్ల్ క్లాస్ మ్యాచ్‌లాడాడు. అలాగే అతడి లెఫ్టామ్ స్పిన్ బౌలింగ్ కూడా అనుకూలం కానుంది. అయితే మూడో ఆల్‌రౌండర్‌గా పేసర్ శార్దూల్ ఠాకూర్ ఎంపికను కూడా కొట్టివేయలేం. గాబాలో అతడి బ్యాటింగ్ నైపుణ్యం ఎలాంటిదో జట్టుకు తెలిసొచ్చింది. సుందర్, పటేల్‌లతో పోలిస్తే ఠాకూర్ కాస్త మెరుగే. ఒకవేళ బుమ్రా, ఇషాంత్, శార్దూర్‌లతో పాటు ఇద్దరు స్పిన్నర్లతో వెళ్లాల్సి వస్తే సిరాజ్ బెంచీకే పరిమితమవుతాడు. హార్దిక్ పాండ్యా పూర్తి స్థాయి బౌలింగ్ చేయగలుగుతాడా? లేదా? అనే విషయంలో స్పష్టత లేదు. తన చివరి 20 మ్యాచ్‌ల్లో సిడ్నీలో జరిగిన రెండో వన్డేలో మాత్రమే తను నాలుగు ఓవర్లు వేయగలిగాడు.