నిన్న- నేడు అంతా అతడే!

0
181
Spread the love

‘సొంత గడ్డ’పై రవిచంద్రన్‌ అశ్విన్‌ అంతా తానై చెలరేగుతున్నాడు. చెపాక్‌ పిచ్‌ అతడు చెప్పినట్టుగా వింటున్నట్టుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు ఖాతాలో వేసుకున్న అతడు.. మూడో రోజు ఎనిమిదో నెంబర్‌లో బరిలోకి దిగి ఏకంగా శతకంతో అదరగొట్టాడు. ఇతర బ్యాట్స్‌మెన్‌ క్రీజులో నిలిచేందుకు తంటాలు పడిన చోట ఈ తమిళ తంబి అద్భుత షాట్లతో శభాష్‌ అనిపించుకున్నాడు. అటు కెప్టెన్‌ కోహ్లీ అర్ధసెంచరీతో ఇంగ్లండ్‌ ముందు 482 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగారు. స్పిన్‌కు విపరీతంగా అనుకూలిస్తున్న పిచ్‌పై ప్రస్తుతం 53/3 స్కోరుతో ఉన్న పర్యాటక జట్టు గెలవాలంటే అద్భుతం జరగాల్సిందే!

చెన్నై: ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకెళుతోంది. అశ్విన్‌ (148 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో 106) ఆల్‌రౌండ్‌ షోతో అదరగొడుతూ కెరీర్‌లో ఐదో శతకం సాధించాడు. విరాట్‌ కోహ్లీ (149 బంతుల్లో 7 ఫోర్లతో 62) క్లాస్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవడంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులు చేసింది. దీంతో టీమిండియాకు 481 పరుగుల ఆధిక్యం లభించింది. ఓ దశలో 106/6 స్కోరుతో భారత్‌ ఇన్నింగ్స్‌ త్వరగానే ముగుస్తుందనుకున్న వేళ కోహ్లీ-అశ్విన్‌ జోడీ ఏడో వికెట్‌కు 96 రన్స్‌ అందించింది. ఈ కష్టసాధ్యమైన ఛేదన కోసం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌ సోమవారం మూడో రోజు ఆట ముగిసేసరికి 19 ఓవర్లలో 53/3 స్కోరుతో కష్టాల్లో పడింది. అక్షర్‌కు రెండు, అశ్విన్‌కు ఓ వికెట్‌ దక్కాయి. క్రీజులో లారెన్స్‌ (19 బ్యాటింగ్‌), రూట్‌ (2 బ్యాటింగ్‌) ఉన్నారు. ఆటకు ఇంకా రెండు రోజుల సమయం ఉన్నప్పటికీ అత్యంత ప్రమాదకరంగా మారిన పిచ్‌పై వీరు ఏమేరకు ఆడగలరనేది సందేహమే. భారత్‌ మాత్రం నాలుగో రోజే మ్యాచ్‌ను ముగించి సిరీ్‌సను సమం చేయాలనే పట్టుదలతో ఉంది.

తొలి సెషన్‌లో ఐదు వికెట్లు: ఓవర్‌నైట్‌ స్కోరు 52/1తో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ ఈ సెషన్‌లో వేగంగా వికెట్లను కోల్పోయింది. పిచ్‌ సహకారాన్ని సొమ్ము చేసుకుంటూ స్పిన్నర్లు లీచ్‌, అలీ విజృంభించారు. దీంతో 55 పరుగుల వద్దే పుజారా (7), రోహిత్‌ (26) వికెట్లను కోల్పోయింది. స్కోరులో వేగం పెంచేందుకు పంత్‌ (8)ను నాలుగో నెంబర్‌లో పంపినా ఫలితం లేకపోయింది. అటు రహానె (10), అక్షర్‌ పటేల్‌ (7) నిరాశపరిచారు. అప్పటికి భారత్‌ స్కోరు 106/6. మరో ఎండ్‌లో కోహ్లీ ఓపిగ్గా క్రీజులో నిలిచినా భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టదనిపించింది. కానీ ఈ దశలో అశ్విన్‌ అండగా నిలిచాడు. వచ్చీ రావడంతోనే బ్యాట్‌ను ఝుళిపిస్తూ రన్స్‌ సాధించాడు. దీంతో 156/6తో జట్టు లంచ్‌ విరామానికి వెళ్లింది.

ఆదుకున్న భాగస్వామ్యం: రెండో సెషన్‌లో కోహ్లీ-అశ్విన్‌ జోడీ ఇంగ్లండ్‌ బౌలర్లను ఆటాడుకుంది. సొగసరి డ్రైవ్స్‌తో కోహ్లీ ఓవైపు అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, అశ్విన్‌ పూర్తిస్థాయి బ్యాట్స్‌మన్‌ తరహాలో అన్ని రకాల షాట్లను బౌలర్లకు రుచి చూపించాడు. దీంతో 64 బంతుల్లోనే అతడి హాఫ్‌ సెంచరీ పూర్తయింది. వీరి దూకుడుకు డ్రింక్స్‌ తర్వాత బ్రేక్‌ పడింది. 66వ ఓవర్‌లో కోహ్లీ మరోసారి అలీకే దొరికిపోయాడు. ఆ వెంటనే కుల్దీప్‌ (3)ను కూడా అలీనే అవుట్‌ చేశాడు. ఈ దశలో ఇషాంత్‌ (7) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు.

సహకరించిన సిరాజ్‌: భారత్‌ తొమ్మిదో వికెట్‌ పడేసరికి అశ్విన్‌ 77 పరుగులతో ఉన్నాడు. చివరి బ్యాట్స్‌మన్‌గా సిరాజ్‌ (16 నాటౌట్‌) రావడంతో అశ్విన్‌ శతకం అసాధ్యమే అనిపించింది. కానీ ఎవరూ ఊహించని రీతిలో హైదరాబాదీ పేసర్‌ పట్టుదలగా క్రీజులో నిలిచాడు. లీచ్‌ బంతులను ఓపిగ్గా డిఫెండ్‌ చేస్తూ వికెట్‌ కాపాడుకున్నాడు. సిరాజ్‌ సహకారంతో అశ్విన్‌ చకచకా ఫోర్లు సాధిస్తూ స్కోరును పెంచసాగాడు. 82వ ఓవర్‌లో వరుసగా 6,2,4తో కెరీర్‌లో ఐదో శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత లీచ్‌ వరుస ఓవర్లలో సిరాజ్‌ బ్యాట్‌ ఝుళిపిస్తూ రెండు భారీ సిక్సర్లు బాదడంతో డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్న భారత ఆటగాళ్లు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. చివరికి 86వ ఓవర్‌లో అశ్విన్‌ను స్టోన్‌ బౌల్డ్‌ చేయడంతో జట్టు ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆఖరి వికెట్‌కు వీరు 49 పరుగులు జోడించడం విశేషం.

ఇంగ్లండ్‌ కష్టాలు: కొండంత లక్ష్యం కోసం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌ ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌ సిబ్లే (3)ను అక్షర్‌ ఆరంభంలోనే అవుట్‌ చేశాడు. అయితే ఇన్నింగ్స్‌ తొలి బంతినే ఫోర్‌గా మలిచిన బర్న్స్‌ (25), లారెన్స్‌ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. నాలుగు ఫోర్లతో టచ్‌లో కనిపించిన బర్న్స్‌ను 16వ ఓవర్‌లో అశ్విన్‌ అవుట్‌ చేశాడు. నైట్‌ వాచ్‌మన్‌గా వచ్చిన లీచ్‌ను తొలి బంతికే అక్షర్‌ డకౌట్‌ చేయడంతో కెప్టెన్‌ రూట్‌ బరిలోకి దిగి మరో వికెట్‌ పడకుండా రోజును ముగించాడు.

చెన్నై ‘సూపర్‌’ కింగ్‌

చెపాక్‌ మైదానంలో ‘లోకల్‌ బాయ్‌’ అశ్విన్‌ అసలుసిసలైన ఆల్‌రౌండ్‌ షోతో అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను తక్కువ పరుగులకే పరిమితం చేయడంలో అతడిదే కీలక పాత్ర. ఈ కారణంగానే భారత్‌కు భారీ ఆధిక్యం దక్కింది. ఇప్పుడు టర్నింగ్‌ వికెట్‌పై బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. మూడోరోజు ఆటలో చెపాక్‌ పిచ్‌ విపరీతంగా స్పందించింది. దీంతో భారత బ్యాట్స్‌మెన్‌కు పరుగులు సాధించడం కష్టమైంది. కోహ్లీ ఖాతా తెరిచేందుకు ఏకంగా 20 బంతులు తీసుకున్నాడంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే మరో ఎండ్‌లో మాత్రం టపటపా ఆరు వికెట్లు నేలకూలాయి. ఈ దశలో అశ్విన్‌ తన అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌కు దాదాపు విజయాన్ని ఖాయం చేశాడు. నిజానికి అశ్విన్‌ నుంచి కూడా ఎవరూ పరుగులను ఆశించలేదు. కానీ ఈ పిచ్‌పై అతను సునాయాసంగా పరుగులు రాబట్టాడు. ఈక్రమంలో అతడు స్వీప్‌ షాట్లను కూడా ఆడుతూ టర్నింగ్‌ వికెట్‌పై బ్యాటింగ్‌ చేయడమెలాగో చూపించాడు. కోహ్లీకన్నా అశ్విన్‌ ఒక్క బంతినే ఎక్కువ ఆడాడు. కానీ అతడు చేసిన పరుగులు చూస్తే అశ్విన్‌ దూకుడు ఎలా సాగిందో తెలుస్తుంది. ఆ జోరుతో 2017 తర్వాత తొలిసారిగా 50+ రన్స్‌ సాధించాడు. ఫోర్‌తో శతకం పూర్తి చేయగానే డ్రెస్సింగ్‌ రూమ్‌లో సహచరులంతా లేచి హర్షధ్వానాలు చేయడం భారత్‌ విజయాన్ని గుర్తుకుతెచ్చింది. ఆసీస్‌ టూర్‌ నుంచి సరికొత్తగా కనిపిస్తున్న అశ్విన్‌ ఇప్పటిదాకా 4 సెంచరీలు విండీ్‌సపైనే చేయగా, తొలిసారి ఇంగ్లండ్‌పై సాధించాడు.

2- శ్రీకాంత్‌ తర్వాత చెపాక్‌లో సెంచరీ సాధించిన రెండో తమిళ క్రికెటర్‌ అశ్విన్‌.

3- ఒక టెస్టులో 5 వికెట్లు+సెంచరీ సాధించడం అశ్విన్‌కిది మూడోసారి. ఈ ఫీట్‌ను అత్యధికంగా ఇయాన్‌ బోథమ్‌ 5సార్లు నమోదుచేయగా.. సోబర్స్‌, కలిస్‌, ముస్తాక్‌ అహ్మద్‌, షకీబల్‌ రెండేసి సార్లు సాధించారు.

స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 329; ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 134;

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ (స్టంప్‌) ఫోక్స్‌ (బి) లీచ్‌ 26; గిల్‌ (ఎల్బీ) లీచ్‌ 14; పుజార (రనౌట్‌) 7; కోహ్లీ (ఎల్బీ) మొయిన్‌ అలీ 62; పంత్‌ (స్టంప్‌) ఫోక్స్‌ (బి) లీచ్‌ 8; రహానె (సి) పోప్‌ (బి) మొయిన్‌ అలీ 10; అక్షర్‌ (ఎల్బీ) మొయిన్‌ అలీ 7; అశ్విన్‌ (బి) స్టోన్‌ 106; కుల్దీప్‌ (ఎల్బీ) మొయిన్‌ అలీ 3; ఇషాంత్‌ (సి) స్టోన్‌ (బి) లీచ్‌ 7; సిరాజ్‌ (నాటౌట్‌) 16; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం: 85.5 ఓవర్లలో 286 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-42, 2-55, 3-55, 4-65, 5-86, 6-106, 7-202, 8-210, 9-237, 10-286. బౌలింగ్‌: స్టోన్‌ 6.5-1-21-1; లీచ్‌ 33-6-100-4; మొయిన్‌ అలీ 32-7-98-4; రూట్‌ 4-0-15-0; బ్రాడ్‌ 9-3-25-0; లారెన్స్‌ 1-0-7-0.

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: బర్న్స్‌ (సి) కోహ్లీ (బి) అశ్విన్‌ 25; సిబ్లే (ఎల్బీ) అక్షర్‌ 3; లారెన్స్‌ (బ్యాటింగ్‌) 19; లీచ్‌ (సి) రోహిత్‌ (బి) అక్షర్‌ 0; రూట్‌ (బ్యాటింగ్‌) 2; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 19 ఓవర్లలో 53/3. వికెట్ల పతనం: 1-17, 2-49, 3-50. బౌలింగ్‌: ఇషాంత్‌ 2-1-6-0; అక్షర్‌ 9-3-15-2; అశ్విన్‌ 8-1-28-1.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here