దుబాయ్: ఆస్ట్రేలియాలో చారిత్రక టెస్ట్ సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా వికెట్ కీపర్- బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్..

ఐసీసీ తొలి ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు నామినేట్ అయ్యాడు. పంత్‌తోపాటు ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్‌ను కూడా ఎంపిక చేసినట్టు ఐసీసీ మంగళవారం ప్రకటించింది. మూడు ఫార్మాట్లలోనూ అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శన చేసిన పురుషులు, మహిళా క్రికెటర్లకు గుర్తింపుగా ఐసీసీ నెలనెలా ఈ అవార్డులను ప్రకటించనుంది. ఆసీ్‌సతో సిడ్నీలో జరిగిన టెస్ట్‌లో 97 పరుగులు చేసిన పంత్.. బ్రిస్బేన్ మ్యాచ్‌లో అజేయంగా 89 పరుగులతో జట్టును గెలిపించాడు. మహిళా క్రికెటర్లలో పాకిస్థాన్ ప్లేయర్ డయానా బేగ్, సౌతాఫ్రికాకు చెందిన షబ్నం ఇస్మాయిల్, మరిజన్నే కాప్‌లు కూడా ఈ అవార్డులకు నామినేట్ అయ్యారు. కుదించిన ఆటగాళ్ల జాబితాను ఐసీసీ ఆన్‌లైన్ ఓటింగ్‌కు ఉంచనుంది. ఎంపిక చేసిన కమిటీ, ఆన్‌లైన్ ఓటింగ్ ఆధారంగా ప్రతి నెలా రెండో సోమవారం విజేతలను ప్రకటించనుంది.