మ్యాక్సీ హాటా?.. స్మిత్‌ స్వీటా?

0
157
Spread the love

చెన్నై: ఆస్ట్రేలియా డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్‌ను ఏ ఫ్రాంచైజీ దక్కించుకొంటుంది. రాయల్స్‌ వదిలించుకొన్న స్మిత్‌ ఏ జట్టుకు ఆడతాడు.. మొయిన్‌ అలీకి డిమాండ్‌ ఉంటుందా? భారీగా ఆటగాళ్లను రిలీజ్‌ చేసిన ‘పంజాబ్‌ కింగ్స్‌’ ఈసారి ఎలాంటి వారిని కొనుగోలు చేస్తుంది? తదితర ప్రశ్నలకు గురువారం జరిగే ఐపీఎల్‌ మినీ వేలంలో తెరపడనుంది. మొత్తం 292 మంది వేలానికి రానుండగా.. అందులో 164 మంది స్వదేశీ, 125 మంది విదేశీ, ముగ్గురు అసోసియేట్‌ సభ్య దేశాల ఆటగాళ్లున్నారు. ఖాళీల భర్తీ కోసం వీరి నుంచి 61 మంది క్రికెటర్లను ఎనిమిది ఫ్రాంచైజీలు ఖరీదు చేయనున్నాయి. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఎక్కువగా 11 మందిని కొనుగోలు చేయనుండగా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తక్కువగా ముగ్గురు ప్లేయర్లను వేలంలో తీసుకోనుంది. అనిల్‌ కుంబ్లే కోచ్‌గా ఉన్న పంజాబ్‌ వద్ద అత్యధికంగా రూ. 53.20 కోట్లు మిగిలున్నాయి. వీటితో 9 మందిని వేలంలో ఖరీదు చేయనుంది. గత సీజన్‌లో ఆకట్టుకోలేక పోయినా.. బిగ్‌ హిట్టర్‌ మ్యాక్సీ హాట్‌ కేక్‌లా అమ్ముడవుతాడని అంచనా వేస్తున్నారు. అతడిని కొనుగోలు చేసేందుకు బెంగళూరు ఎక్కువగా ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ పేరు కూడా బాగానే వినిపిస్తోంది.

స్మిత్‌తోపాటు టీ20 టాప్‌ బ్యాట్స్‌మన్‌, ఇంగ్లండ్‌ ఆటగాడు డేవిడ్‌ మలాన్‌ కోసం భారీగా బిడ్డింగ్‌ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. చెన్నై జట్టు మిగిలిన రూ. 20 కోట్లతో ఆరుగురు ఆటగాళ్లను ఖరీదు చేయనుంది. టీమిండియా ఆటగాళ్లు కేదార్‌ జాదవ్‌, హర్భజన్‌ సింగ్‌, ఉమేష్‌ కూడా వేలానికి రానున్నారు. దేశవాళీ యువ ఆటగాళ్లలో మహ్మద్‌ అజరుద్దీన్‌ (కేరళ) ప్రధాన ఆకర్షణ కానున్నాడు. సచిన్‌ టెండూల్కర్‌ కొడుకు అర్జున్‌ కూడా ఈసారి వేలానికి రానున్నాడు. రూ. 20 లక్షల కనీస ధర కేటగిరీలో ఉన్న అర్జున్‌ ఎంత పలుకుతాడనేది ఆసక్తికరం. ముంబై ఇండియన్స్‌ తమ వద్ద మిగిలిన రూ.15.35 కోట్లతో ఏడుగురిని, ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ.13.40 కోట్లతో ఎనిమిది మందిని, రూ.37.85 కోట్లతో రాజస్థాన్‌ రాయల్స్‌ 9 మందిని, రూ.10.75 కోట్లతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 8 మందిని కొనుగోలు చేయనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here