బాసెల్: ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్ సాధించాలని ఆశించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 12–21, 5–21తో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయింది. కేవలం 35 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో మారిన్‌కు కాస్త పోటీనిచ్చిన సింధు రెండో గేమ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. రన్నరప్‌గా నిలిచిన సింధుకు 5,320 డాలర్ల (రూ. 3 లక్షల 89 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.
