లాస్‌ఏంజిల్స్: అమెరికా దిగ్గజ గోల్ఫర్ టైగర్ ఉడ్స్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఓ టెలివిజన్ షూటింగ్ కోసం మంగళవారం వెళుతుండగా అతడు ప్రయాణిస్తున్న ఎస్‌యూవీ కారు లాస్‌ఏంజిల్స్ సమీపంలోని ఏటవాలు రోడ్డులో అదుపుతప్పి డివైడర్ మీదనుంచి దూసుకుపోయింది. ఆపై ఎదురుగా రెండు లేన్ల రహదారిమీదుగా పల్టీలు కొట్టి కారు లోయలోకి దూసుకుపోయింది. అయితే బెలూన్లు తెరుచుకోవడంతో ఉడ్స్‌కు ప్రాణాపాయం తప్పింది. తీవ్రంగా గాయపడిన అతడిని అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వాహనం పూర్తిగా ధ్వంసమైంది.

కోలుకుంటున్నాడు..: ఉడ్స్ కోలుకుంటున్నాడని అతడు చికిత్స పొందుతున్న హార్బర్ ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) అనీష్ మహాజన్ బుధవారం వెల్లడించారు. 45 ఏళ్ల ఉడ్స్ కుడి కాలు, పాదానికి తీవ్ర గాయాలైనట్టు తెలిపారు. మోకాలు, పాదం మధ్యనున్న ఎముకలు విరగడంతో ఆపరేషన్ చేసి రాడ్ వేసినట్టు ఆయన వివరించారు. పాదం ఇతర గాయాలకు స్ర్కూలు వేయాల్సి వచ్చిందన్నారు. ఉడ్స్ స్పృహలో ఉన్నాడని, చికిత్సకు స్పందిస్తున్నాడని చెప్పారు.
కెరీర్ ముగిసినట్టేనా?
ప్రమాదం నుంచి ఉడ్స్ క్షేమంగా బయటపడినా అతడి కాలికైన తీవ్ర గాయాలు, ఆపరేషన్‌ను బట్టి చూస్తే ఉడ్స్ గోల్ఫ్ కెరీర్ ఇక ముగిసినట్టేనని అసోసియేటెడ్ ప్రెస్‌కు చెందిన క్రీడా కాలమిస్టు ఒకరు అభిప్రాయపడ్డారు. అత్యంత విజయవంతమైన గోల్ఫర్‌గా ఖ్యాతికెక్కిన ఉడ్స్.. తన కెరీర్‌లో 15 మేజర్ చాంపియన్‌షిప్‌లతో పాటు 82 పీజీఏ టూర్ టైటిళ్లను గెలిచాడు.